దశాబ్దకాలానికిపైగా ప్రపంచ ఫుట్‌బాల్ ప్రేమికులను మైమరిపిస్తున్న ఆటగాడు లియోనల్ మెస్సీ.. తన అద్భుత ఆటతో ప్రపంచాన్ని మైమరిపించిన ఈ అర్జెంటీనా స్టార్.. మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. కెరీర్‌లో వెయ్యి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా ఖ్యాతినార్జించాడు. ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ మెస్సీకి వెయ్యో మ్యాచ్.
ఈ మ్యాచ్‌లో కళ్లు చెదిరే గోల్‌తో ఆకట్టుకున్న మెస్సీ.. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా రికార్డును కూడా బద్దలుకొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మెస్సీ 3 గోల్స్ సాధించాడు. దీంతో అతడి కెరీర్‌లో ఫిఫా ప్రపంచకప్‌లలో కొట్టిన మొత్తం గోల్స్ సంఖ్య 9కి చేరింది. అర్జెంటీనా తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో మెస్సీ రెండో స్థానానికి చేరుకొన్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనాను మెస్సీ అధిగమించాడు. అర్జెంటీనా తరపున ఫీఫా కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన వారిలో గాబ్రియెల్ బటిస్టుటా 10 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.