World Badminton Championship: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత రెండో షట్లర్‌గా రికార్డు సాధించడానికి శ్రీకాంత్‌కు కావాల్సింది ఇంకో విజయం మాత్రమే. ఆదివారమే ఫైనల్ జరగబోతోంది. ఆంటొన్సెన్ (డెన్మార్క్)-కియాన్ యో (సింగపూర్) మధ్య రెండో సెమీస్ విజేతతో శ్రీకాంత్ తుదిపోరులో తలపడనున్నాడు.
చరిత్రకు అడుగు దూరంలో శ్రీకాంత్.. స్వర్ణంపై కోటి ఆశలు
World Badminton Championship: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాలని ఉత్సాహంతో ఉన్నాడు భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్. ఇప్పటివరకు ఈ టోర్నీలో పీవీ సింధు మాత్రమే బంగారు పతకం గెలిచింది. ఆదివారం జరగబోయే ఫైనల్లో గెలిస్తే శ్రీకాంత్ ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు.
ఇప్పటివరకు సింధు మాత్రమే ప్రపంచ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం నెగ్గింది. చివరగా 2019లో జరిగిన టోర్నీలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన ఆమె.. ఈసారి ఫేవరెట్లలో ఒకరిగా బరిలోకి దిగింది. కనీసం ఏదో ఒక పతకమైనా సాధిస్తుందని అనుకుంటే క్వార్టర్స్‌లోనే ఆమె కథ ముగిసింది.
ఈ దశలో ఇద్దరు పురుష షట్లర్లు సెమీస్ చేరి అభిమానుల్లో కొత్త ఆశ రేపారు. సెమీస్‌లో ఆ ఇద్దరూ ముఖాముఖిలో తలపడగా.. లక్ష్యసేన్‌ను ఓడించి శ్రీకాంత్ ఫైనల్ చేరాడు. భారత బ్యాడ్మింటన్‌లో ఇదే ఒక రికార్డు. అతను ఇంకొక్క అడుగు ముందుకేసి స్వర్ణం కూడా సాధిస్తే శ్రీకాంత్ పేరు భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. మరి ఆఖరి అడ్డంకినీ దాటి మన తెలుగు కుర్రాడు చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి. మహిళల సింగిల్స్‌లో తైజు యింగ్ (చైనీస్ తైపీ), అకానె యమగూచి (జపాన్) స్వర్ణం కోసం పోటీపడనున్నారు.