స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకుని చరిత్ర సృష్టించింది తెలుగు తేజం పీవీ సింధు. వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరిన ఈ క్రీడాకారిణి.. గోల్డ్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. తుదిపోరులో విజయంతో.. తనపై ఇటీవలి విమర్శలకు సమాధానం చెప్పింది సింధు.
"నాపై వస్తోన్న విమర్శలకు ఈ గెలుపే సమాధానం. నన్ను పదే పదే ప్రశ్నిస్తోన్న వారందరికీ నా రాకెట్‌తోనే సమాధానం చెప్పాలనుకున్నా. ఇప్పుడు అదే చేశా. రెండు సార్లు ఫైనల్లో ఓడిపోవడం బాధను, కోపాన్ని కలిగించింది."
-సింధు, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
ఫైనల్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు... తొలి సెట్‌ను 21-7 తేడాతో గెలిచింది. రెండో సెట్లోనూ అదే జోష్ చూపించి 21-7 తేడాతో విజయం సాధించింది. తెలుగమ్మాయి తిరుగులేని స్మాష్‌లకు జపాన్ క్రీడాకారిణి సమాధానం చెప్పలేకపోయింది.
"ఈ గెలుపును ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తర్వాత నాపై అంచనాలు పెరిగాయి. ప్రతి టోర్నీలో స్వర్ణం సాధిస్తానని అందరూ భావించారు. ఏడాది తర్వాత ఇతరుల గురించి ఆలోచించడం మానేసి నా ఆటపై మాత్రమే దృష్టి పెట్టా".