ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత మళ్లీ ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత మూడు టోర్నీల్లో పాల్గొందీ క్రీడాకారిణి. కానీ ఒక్కదాంట్లోనూ రెండో రౌండ్ దాటలేకపోయింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించిన తర్వాత చైనా ఓపెన్‌లో పాల్గొన్న సింధు.. రెండో రౌండ్లోనే ఓడింది. తర్వాత కొరియా ఓపెన్‌లో మరీ దారుణంగా ఆరంభ పోరులోనే పరాజయం చెంది ఇంటిముఖం పట్టింది. ఇటీవలే జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో రెండో రౌండ్లో ఓడి నిరాశపర్చింది. ఫ్రెంచ్ ఓపెన్ మొదటి రౌండ్లో కెనడాకు చెందిన మిచెల్లీ లీతో తలపడనుంది సింధు. ప్రారంభ రౌండ్లను దిగ్విజయంగా దాటితే క్వార్టర్స్‌లో టాప్ సీడ్ తై జూ యంగ్‌తో పోరు ఉంటుంది.
చివరగా జరిగిన మూడో టోర్నీల్లోనూ ప్రారంభ పోరులోనే ఓడి నిరాశ పర్చిన మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతోన్న సైనా.. ఈ టోర్నీలో సత్తాచాటాలని భావిస్తోంది. మొదటి రౌండ్లో హాంకాంగ్‌కు చెందిన చెంగ్ యితో తలపడనుంది.
పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్ మరోసారి ఈ టోర్నీలో అదరగొట్టాలని భావిస్తున్నాడు. 2017లో ఛాంపియన్‌గా నిలిచిన ఈ ఆటగాడికి తొలి రౌండ్లోనే గట్టి పోటీ ఎదురుకానుంది. రెండో ర్యాంకులో ఉన్న చౌ తీన్ చెన్ (చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు శ్రీకాంత్.