తెలంగాణ

telangana

ETV Bharat / sports

'స్వర్ణం కోసమే టోక్యో వెళ్తున్నా' - టోక్యో ఒలింపిక్స్​

రియో ఒలింపిక్స్​లో వెండి పతకంతో సత్తా చాటిన భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు(PV Sindhu).. స్వర్ణమే లక్ష్యంగా టోక్యోకు వెళ్తోంది. త్వరలో జరగబోయే ఒలింపిక్స్​లో స్వర్ణం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్లే సన్నద్ధమవుతున్న సింధుతో చిట్​చాట్​.

pv sindu intervie
పీవీ సింధు

By

Published : Jul 10, 2021, 7:22 AM IST

వీలైనంత త్వరగా పరిస్థితులకు అలవాటు పడడమే ఒలింపిక్స్‌లో అత్యంత కీలకమని భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు తెలిపింది. టోక్యోలోని స్టేడియాలు, పరిస్థితులకు తగ్గట్లుగా హైదరాబాద్‌లో సాధన చేస్తున్నట్లు ఆమె చెప్పింది. తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి స్వర్ణ పతకం సాధిస్తానని సింధు ధీమా వ్యక్తం చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన ఈ హైదరాబాదీ.. టోక్యోలోనూ కచ్చితంగా పతకం సాధిస్తుందన్న అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే సన్నద్ధమవుతున్న సింధుతో ఇంటర్వ్యూ ఈటీవీ భారత్​కు​ ప్రత్యేకం.

స్వర్ణం కోసమే టోక్యో వెళ్తున్నా

రియోలో రజతం సాధించారు. టోక్యోలో స్వర్ణం గెలుస్తారా?
స్వర్ణం సాధించడం అంత సులువేమీ కాదు. నా లక్ష్యం మాత్రం ఆ పతకమే. పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఒలింపిక్స్‌కు వెళ్తున్నా. నా శక్తి సామర్థ్యాలన్నీ ప్రయోగిస్తా. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తా. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా.

ఒలింపిక్స్‌ సన్నాహాలు.. డ్రాపై ఏమంటారు?

ప్రాక్టీస్‌ పక్కాగా సాగుతోంది. మార్చి నుంచి ఎలాంటి టోర్నీలు లేకపోవడంతో ఆటను మరింత మెరుగు పరుచుకునే అవకాశం లభించింది. కొత్త నైపుణ్యాలు, టెక్నిక్‌లపై దృష్టిసారించా. డ్రా కూడా వచ్చేసింది. గ్రూప్‌ దశలో ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రిక్వార్టర్స్‌ నుంచి గట్టి పోటీ ఉంటుంది. క్వార్టర్స్‌లో జపాన్‌ అమ్మాయి యమగూచి ఎదురవ్వొచ్చు. ఎవరితో ఎలా ఆడాలి? ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అనే విషయాలపై పూర్తి స్పష్టతతో ఉన్నా. సుచిత్ర అకాడమీ నుంచి క్రీడాకారులు వస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఎదురయ్యే పరిస్థితులు, సవాళ్లకు తగ్గట్లుగా వారితో సాధన చేస్తున్నా. 4 నెలల సమయంలో అన్ని అంశాలపై కసరత్తు చేశా. ఇప్పుడు ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నా. ఈనెల 14 లేదా 17న టోక్యోకు బయల్దేరే అవకాశముంది.

టోక్యో పరిస్థితులకు అలవాటు పడేందుకు ఏం చేస్తున్నారు?

ఒలింపిక్స్‌ అనుభూతి కలిగేందుకు ఫిబ్రవరి నుంచి గచ్చిబౌలి ఇండోర్‌లోనే శిక్షణ కొనసాగుతోంది. టోక్యోలోని పెద్ద స్టేడియాల్లో ఏసీకి అలవాటు పడటం.. షటిల్‌పై నియంత్రణ తెచ్చుకోవడం ముఖ్యం. సరిగ్గా అలాంటి పరిస్థితుల్నే ఇక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడికి వెళ్లాక పరిస్థితులకు అలవాటు పడాలంటే సమయం పడుతుంది. ముందుగానే అలాంటి పరిస్థితుల్లో సాధన చేయడం కలిసొస్తుంది. నాతో సమానంగా, నాకంటే మెరుగ్గా ఆడే ఆటగాళ్లతో కలిసి సాధన చేస్తున్నా.

ఒలింపిక్స్‌లో ఆశ్చర్యకర అస్త్రాలు చూడొచ్చన్నారు.. ఏంటవి?

స్వతహాగా నేను అటాకింగ్‌ క్రీడాకారిణిని. ఇప్పుడు డిఫెన్స్‌ మీద కూడా బాగా కసరత్తు చేశాం. ప్రత్యేకంగా ఒకరిని దృష్టిలో ఉంచుకుని కాదు. టోర్నీలో ఏ దశలో.. ఎవరు ఎదురైనా దీటుగా స్పందించేందుకు కొత్త నైపుణ్యం, టెక్నిక్‌ నేర్చుకున్నా. ఈ విషయంలో కోచ్‌ పార్క్‌ను అభినందించాలి. ఏడాదిన్నరగా పార్క్‌ నాకు శిక్షణ ఇస్తున్నాడు. నైపుణ్యం, టెక్నిక్‌పై ఎక్కువ దృష్టిసారిస్తాడు. క్రీడాకారుల్ని బాగా అర్థం చేసుకుంటాడు. పొరపాట్లను ఇట్టే పసిగడతాడు. ఎలా సరిచేసుకోవాలో చెప్తాడు. మార్చి నుంచి సమయం దొరకడంతో అన్ని అంశాలపై పక్కాగా కసరత్తు చేశాం.

అగ్రశ్రేణి క్రీడాకారిణులంతా ఒకేనైపుణ్యంతో ఉంటారు. అందరి కంటే ముందుండటం ఎలా?

ఒలింపిక్స్‌ నాలుగేళ్లకోసారి జరుగుతాయి. ఈసారి అయిదేళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు. మిగతా టోర్నీల మాదిరి కాకుండా అంతా కొత్తగా, వినూత్నంగా ఉంటుంది. వీలైనంత త్వరగా పరిస్థితులకు అలవాటు పడటం ఒలింపిక్స్‌లో అత్యంత కీలకం. ఎన్నో నెలలు సాధన చేస్తాం. కోచ్‌లు చాలా నేర్పిస్తారు. ఒలింపిక్స్‌కు ప్రతి ఒక్కరు నూటికి నూరు శాతం సిద్ధమవుతారు. పరీక్ష కోసం వంద ప్రశ్నలకు జవాబులు నేర్చుకుంటే అందులో నుంచి ప్రశ్నపత్రంలో ఒకటో, రెండో వచ్చినట్లు.. ఆటలోనూ అంతే. మనం నేర్చుకున్న వాటిలో ఒకటో, రెండో తెలిసిన సవాళ్లు ఎదురవుతాయి. మిగతావన్నీ అప్పటికప్పుడు గుర్తించి, దీటుగా స్పందించాలి. ఎంతో ప్రాక్టీస్‌తో ఈ స్థాయికి వెళ్లాక ప్రత్యర్థి ఎవరైనా ఒకటే.

చైనా క్రీడాకారులపై అంచనాలేంటి?

చైనా క్రీడాకారుల నుంచి కచ్చితంగా ఆశ్చర్యకర సవాళ్లు ఎదురవ్వొచ్చు. ఏడాది నుంచి వాళ్లు ఏ టోర్నీలోనూ ఆడట్లేదు. అంతమాత్రాన వాళ్లు ఆడకుండా ఉండరు. చైనాలో దేశవాళీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. చెన్‌ యుఫెయ్‌, హి బింగ్జియావొ అన్ని రకాలుగా సిద్ధమయ్యే వస్తారు. కొత్త అస్త్రాలతో బరిలోకి దిగుతారు. నిజానికి ఏ దేశంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. ఎవరు ఎలా సన్నద్ధమవుతున్నారో స్పష్టత లేదు. చాలాకాలంగా ఒకరితో ఒకరం ఆడలేదు కాబట్టి గత రికార్డులు చూసి ఫలానా క్రీడాకారిణిపై నాదే పైచేయి అని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అందరూ కొత్తగా వస్తున్నట్లే..

ఒలింపిక్స్‌లో అతి పెద్ద బయో బబుల్‌పై మీ అభిప్రాయం?

ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఒలింపిక్స్‌లో జాగ్రత్తగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇంటి దగ్గర బయల్దేరినప్పటి నుంచి విమానాశ్రయం సహా క్రీడలు ముగిసే వరకు మనతో పాటు ప్రతి ఒక్కరు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఒక్కరు ఏమరుపాటుగా ఉన్నా కష్టం. క్రీడాకారులకు బయో బబుల్‌ వాతావరణం అలవాటవుతుంది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌, ఆల్‌ ఇంగ్లాండ్‌లో బుడగలో ఉంటూ ప్రతి రోజూ కరోనా పరీక్షలు చేయించుకున్నాం. ఒలింపిక్స్‌లో ఇంకాస్త కఠినంగా ఉంటుంది. నిబంధనల్ని నిక్కచ్చిగా అమలు చేస్తారు. ఎన్నో దేశాల నుంచి క్రీడాకారులు వస్తారు. అందరు జాగ్రత్తగా ఉంటే ప్రమాదం ఉండదు.

ఇవీ చదవండి:Olympics: సింధు, ప్రణీత్​కు సులువైన డ్రా

పారాలింపిక్స్​లో ప్రేక్షకులు.. ఒలింపిక్స్​లో మాత్రం!

ABOUT THE AUTHOR

...view details