'నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా' ఓ సినిమాలో కథానాయకుడి డైలాగ్ ఇది. సినిమాలో డైలాగ్ పేల్చడానికి బాగానే ఉంటుంది కానీ.. నిజ జీవితంలో ఈ మాటను నిజం చేయడం అంత తేలిక కాదు. అందులోనూ ఓ అమ్మాయి.. పైగా ఆటల్లో.. అంటే అది మరీ కష్టం. ఇక ఆ అమ్మాయి ఎంచుకున్న ఆటలో అప్పటికే ఓ క్రీడాకారిణి తిరుగులేని స్థాయిని అందుకుని ప్రపంచ వేదికపై అద్భుత విజయాలతో దూసుకెళ్తున్నపుడు.. ఆమెకు చేరువగా వెళ్లడమే మిగతా క్రీడాకారుల లక్ష్యం అయినపుడు.. ఆ అగ్రశ్రేణి ప్లేయర్‌ను దాటి ముందుకెళ్లడం.. ఊహకైనా అందని విజయాలందుకోవడం.. ఆటలో కొత్త ప్రమాణాలు నెలకొల్పడం.. తన ఆటను దాటి దేశ క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా పేరు తెచ్చుకోవడం సామాన్య విషయమా? ఇది కదా ట్రెండ్ సెట్ చేయడం అంటే. మన సింధు చేసిందదే.
ప్రపంచ ఛాంపియన్ పూసర్ల వెంకట సింధు సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. స్వర్ణం సాధ్యంకాకపోయినా కాంస్య పతకంతో సత్తాచాటింది. ఆదివారం ఏకపక్ష పోరులో ఆరో సీడ్ సింధు 21-13, 21-15తో 8వ సీడ్ బింగ్జియావో (చైనా)ను ఓడించింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది
అస్త్రాలన్నింటినీ..: స్వర్ణం సాధించే అవకాశాన్ని కోల్పోయిన సింధు కాంస్య పతకం కోసం ప్రాణం పెట్టింది. బింగ్జియావోతో పోరులో అన్ని అస్త్రాలను సంధించింది. పతకం తప్ప మరో ఆలోచన లేకుండా ఆడింది. 52 నిమిషాల పాటు సాగిన పోరులో అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో అదరగొట్టింది. అటాకింగ్, నెట్ గేమ్‌లలో సింధుకు ప్రత్యర్థి పోటీగానే కనిపించలేదు. సింధు స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్ షాట్‌లకు బింగ్జియావో దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఎడమచేతి వాటం బింగ్జియావో బ్యాక్‌హ్యాండ్‌ను సింధు లక్ష్యంగా చేసుకుంది. ర్యాలీ గేమ్‌లోనూ వైవిధ్యం చూపించింది. సింధు నైపుణ్యం, ఫిట్‌నెస్ ముందు బింగ్జియావో పూర్తిగా తేలిపోయింది. మొదటి పాయింటు నుంచే పతకం సాధించాలన్న పట్టుదలను సింధు కనబరిచింది. తొలి గేమ్‌లో వరుసగా 4 పాయింట్లతో సత్తాచాటింది. అయితే సింధు అనవసర తప్పిదాలు ప్రత్యర్థికి లాభించాయి. షటిల్‌ను నెట్‌కు ఆడేయడం.. కోర్ట బయటకు కొట్టడంతో ప్రత్యర్థి రేసులోకి వచ్చింది. 6-6తో పాయింట్లను సమం చేసింది. వెంటనే తేరుకున్న సింధు ఒక్కసారిగా గేరు మార్చింది. స్మాష్‌లతో విరుచుకుపడింది. 11-8తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత స్టార్ అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. స్మాష్‌లు, క్రాస్‌కోర్ట్, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. తనపై 9-6తో మెరుగైన గెలుపోటముల రికార్డున్న బింగ్జియావోను సింధు అనామక క్రీడాకారిణిగా మార్చేసింది. షటిల్‌పై పూర్తి నియంత్రణతో కోర్టు నలువైపులా పాయింట్లు రాబట్టి 21-13తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లోనూ బింగ్జియావో పోటీ ఇవ్వలేకపోయింది. రెట్టించిన దూకుడుతో కనిపించిన సింధు వరుస పాయింట్లతో హోరెత్తించింది. 5-2తో ముందంజ వేసిన సింధు క్రాస్‌కోర్ట్ స్మాష్ సంధించి 11-9 మరింత ముందుకెళ్లింది. ఈ సమయంలో సింధు 2 అనవసర తప్పిదాలు చేయడంతో 11-11తో స్కోరు సమమైంది. ఆ తర్వాత నుంచి ఆటంతా సింధుదే. స్మాష్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. 17-14తో ఆధిక్యం లభించినప్పుడు సింధు గర్జనతో స్టేడియం హోరెత్తింది. స్మాష్‌తో 20-15తో మ్యాచ్‌కు చేరువైన సింధు క్రాస్‌కోర్ట్ షాట్‌తో 21-15తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. అనంతరం రెండు చేతులు పైకెత్తి సింహనాదం చేసింది. కోచ్ పార్క్‌ను హత్తుకుని సంబరాలు చేసుకుంది.
"ఒలింపిక్స్ కోసం ఎంతగానో కష్టపడ్డా. పతకం గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నాలో భిన్నమైన భావోద్వేగాలు ఉన్నాయి. కాంస్య నెగ్గినందుకు ఆనంద పడాలో.. ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం చేజారినందుకు బాధ పడాలో తెలియట్లేదు. ఈ మ్యాచ్‌కు ముందు నా భావోద్వేగాల్ని పక్కనబెట్టా. నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వాలని భావించా. శనివారం సెమీఫైనల్స్‌లో నేను, బింగ్జియావో ఓడిపోయాం. ఆదివారం కచ్చితంగా గెలవాలనే బరిలో దిగాం. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించడం ఇద్దరికీ ముఖ్యమే. అదంత సులువేమీ కాదు. మ్యాచ్‌లో బింగ్జియావో గట్టి పోటీనిచ్చింది. నేను ఓపికగా, ప్రశాంతంగా ఆడా. ఆధిక్యంలో ఉన్నా కూడా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేదు. నేను బాగా ఆడాననే అనుకుంటున్నా. దేశానికి పతకం అందించడం గర్వంగా ఉంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం గెలవడంతో మేఘాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ఈ క్షణాల్ని ఆస్వాదిస్తున్నా. నా కోసం కుటుంబమంతా చాలా కష్టపడింది. ఎన్నో త్యాగాలు చేశారు. వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటా. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా బరిలో దిగుతా."
- సింధు
"2016 (రజతం), 2020 (కాంస్యం). సింధు.. భారత్‌కు రెండు ఒలింపిక్స్ పతకాలు అందించడం ఓ గొప్ప ఘనత. నువ్వు దేశాన్ని ఎంతో గర్వపడేలా చేశావు’"
- సచిన్
"వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో పతకాలు గెలిచిన నీ (సింధు) పట్ల గర్వపడుతున్నా. కచ్చితంగా అద్భుత ప్రదర్శన చేశావ్. గొప్పగా ఆడావ్’"
- కరణం మల్లీశ్వరి
నాన్నకు బహుమతిగా ఇవ్వమన్నా..