కరోనా కేసుల పెరుగుదల కారణంగా.. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. కొరియా ఓపెన్, మకావు ఓపెన్ టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. చైనాలో జరగాల్సిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌నూ వాయిదా వేసింది.
కొరియా ఓపెన్ ఆగస్టు 31- సెప్టెంబర్ 5 వరకు, మకావు ఓపెన్.. నవంబర్ 2 నుంచి 7 మధ్య జరగాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని రద్దు చేయడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేసింది బీడబ్ల్యూఎఫ్. ఈ ఏడాది జరగాల్సిన మిగతా టోర్నీలు గురించి చర్చించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే వాయిదా పడిన మలేసియా మాస్టర్స్ సూపర్ 500 ఈవెంట్, మలేసియా ఓపెన్ సూపర్ 750 టోర్నీల విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది.
కొవిడ్ మహమ్మారి కారణంగా.. చైనా ఓపెన్, జపాన్ ఓపెన్, హాంకాంగ్ ఓపెన్ సహా ఇతర ప్రధాన టోర్నీలు ఇదివరకే రద్దయ్యాయి. ఈ కారణంగా.. సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ వంటి భారత షట్లర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారు.