చైనా మాస్టర్స్, డచ్ ఓపెన్లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ప్రకటించింది. కరోనా సంక్షోభం తర్వాత తిరిగి ప్రణాళిక వేసిన క్యాలెండర్‌లోని రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలను రద్దు చేస్తున్నామని తాజాగా వెల్లడించింది.
"కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) తిరిగి ప్రణాళిక చేసిన టోర్నీల్లో రెండింటిని రద్దు చేస్తున్నాం. ఈ ఏడాది నిర్వహించాలనుకున్న లింగ్షూ చైనా మాస్టర్స్ 2020, డచ్ ఓపెన్ 2020లు రద్దు చేయాలని నిర్ణయించాం" అని బీడబ్ల్యూఎఫ్ పరిపాలనా విభాగం ప్రకటన విడుదల చేసింది.
రెండుసార్లు వాయిదా
చైనా మాస్టర్స్.. ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు జరగాల్సి ఉంది. కానీ, చైనాలో అప్పటి పరిస్థితులు, కరోనా వ్యాప్తి కారణంగా మే నెలకు వాయిదా వేశారు. వేసవి నాటికి ఇంకా అక్కడ కొవిడ్ కేసులు నియంత్రణలోకి రాకపోవడం వల్ల ఆగస్టు 25 నుంచి 30 తేదీల మధ్య నిర్వహించాలని భావించారు. తాజా పరిణామాల నేపథ్యంలో టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది బీడబ్ల్యూఎఫ్.
ఆరోగ్య భద్రత కారణంగా
అక్టోబరు 6 నుంచి 11 వరకు నెదర్లాండ్స్ వేదికగా జరగాల్సిన డచ్ ఓపెన్‌ను క్రీడాకారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు రద్దు చేశారు. కరోనా సంక్షోభం కారణంగా ఈ ఏడాది మిగిలిన బ్యాడ్మింటన్ సీజన్‌ను తిరిగి నిర్వహించడానికి ఇటీవలే క్యాలెండర్‌ను విడుదల చేసింది బీడబ్లూఎఫ్.