Badminton World Championships: ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ప్రపంచ ఛాంపియన్ కావాలన్న కలను 2019లో నెరవేర్చుకున్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు.. రెండో ప్రపంచ టైటిల్ కోసం బరిలోకి దిగుతోంది. ఆదివారం ఆరంభం కానున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు మహిళల సింగిల్స్ ఫేవరెట్లలో ఒకరిగా అడుగు పెడుతోంది. ఈ ఏడాది ఒక్క టైటిలూ గెలవకపోయినప్పటికీ.. సింధు మంచి లయలోనే ఉంది. వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్ టర్నీలో సెమీస్ చేరడమే కాదు.. ఇటీవలే ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో రన్నరప్‌గానూ నిలిచింది. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించి ఈ ఏడాదికి ఘనమైన ముగింపును ఇవ్వాలని సింధు ఆశిస్తోంది. మూడుసార్లు ఛాంపియన్ కరోలినా మారిన్, 2017 విజేత నవోమి ఒకుహర టోర్నీకి దూరం కావడం సింధుకు కలిసొచ్చేదే. తొలి రౌండ్లో సింధుకు బై లభించగా.. రెండో రౌండ్లో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే తొమ్మిదో సీడ్ చొచువాంగ్ (థాయ్‌లాండ్).. ప్రీక్వార్టర్స్‌లో సింధుకు ఎదురు పడొచ్చు. చివరగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చొచువాంగ్ చేతిలో ఓడిన నేపథ్యంలో సింధుకు ఈ మ్యాచ్ సవాలే. ఈ అడ్డంకిని దాటితే ఆమెకు క్వార్టర్స్‌లో తై జు యింగ్ ఎదురు పడొచ్చు. ఒలింపిక్స్ సెమీస్‌లో సింధు ఈ తైవాన్ క్రీడాకారిణి చేతిలోనే సెమీస్‌లో ఓడిన సంగతి తెలిసిందే. ఆమెను ఓడిస్తే సింధు టైటిల్‌కు చేరువైనట్లే.
Badminton World Championships: కొడుతుందా మళ్లీ.. రెండో టైటిల్‌పై సింధు గురి - ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సైనా నెహ్వాల్
Badminton World Championships: 2013, 2014లో వరుసగా రెండు కాంస్యాలు.. సంతృప్తి చెందలేదు. 2017, 2018లో వరుసగా రెండు రజతాలు.. ఆగిపోలేదు. మొక్కవోని పట్టుదలతో మళ్లీ ప్రయత్నించింది. 2019లో తన కల నెరవేర్చుకుంది. ఆ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన పూసర్ల వెంకట సింధు.. ఇప్పుడు ఆ టైటిల్ నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగుతోంది. కరోనా కారణంగా నిరుడు రద్దవడం వల్ల రెండేళ్ల పాటు ప్రపంచ ఛాంపియన్‌గా కొనసాగిన తెలుగమ్మాయి.. ఇంకో ఏడాది ఆ హోదాను అనుభవిస్తుందో లేదో స్పెయిన్‌లో తేలబోతోంది.
సైనా దూరం..
మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆడటం మొదలుపెట్టాక ఈ టోర్నీకి సైనా దూరం కావడం ఇదే తొలిసారి. పురుషుల సింగిల్స్‌లో 12వ సీడ్ కిదాంబి శ్రీకాంత్.. తొలి రౌండ్లో పాబ్లో అబియన్ (స్పెయిన్)ను ఢీకొంటాడు. సాయిప్రణీత్.. డచ్ ఆటగాడు మార్క్ కాల్జోతో, హెచ్.ఎస్.ప్రణయ్.. లాంగ్ ఆంగస్‌తో తొలి మ్యాచ్‌లు ఆడతారు. ఆదివారం శ్రీకాంత్, సాయిప్రణీత్ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడనున్నారు. లక్ష్యసేన్‌కు తొలి రౌండ్లో బై లభించింది. అగ్రశ్రేణి ఆటగాడు కెంటో మొమొట టోర్నీకి దూరం కావడం శ్రీకాంత్, ప్రణీత్‌లకు కలిసొచ్చేదే. వీళ్లు పోరాడితే పతకం సాధించడం కష్టమేమీ కాదు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప.. లియు జువాన్-జియా యు టింగ్‌లను ఢీకొంటారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టిలకు తొలి రౌండ్లో బై వచ్చింది. మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీ పోటీల మొదటి రోజు అదృష్టం పరీక్షించుకోనుంది. మహిళల డబుల్స్‌లో పూజ, సంజన సంతోష్ బరిలో ఉన్నారు. స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.