ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ భాజపాలో చేరారు. భాజపా కేంద్ర కార్యాలయంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి విచ్చేసిన సైనాకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్హూ నెహ్వాల్ కూడా భాజపాలో చేరారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీలా దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను భాజపాలో చేరినట్టు చెప్పారు.
సైనా నెహ్వాల్ కొత్త గేమ్- భాజపాలో చేరిక - saina nehwal in bjp
12:06 January 29
హరియాణాలో జన్మించిన సైనా.. హైదరాబాద్‌లోని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకొని విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచారు. 24కి పైగా అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకున్న సైనా నెహ్వాల్ 2009లో వరల్డ్ నంబర్ 2, 2015లో వరల్డ్ నంబర్ 1 ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్న సైనా.. గతంలో తోటి క్రీడాకారుడైన పారుపల్లి కశ్యప్‌ను వివాహం చేసుకున్నారు.
గతేడాది ప్రముఖ క్రీడాకారులు గౌతం గంభీర్, బబితా ఫొగాట్ తదితరులు కమల దళంలో చేరారు.