తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇండస్ట్రీలో అదొక్కటే నన్ను కాపాడింది: ఎస్వీ కృష్ణారెడ్డి - ఆలీతో సరదాగా ఎస్వీ కృష్ణారెడ్డి

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ దర్శకనిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రారంభం కాకపోవడానికి గల కారణాల్ని వెల్లడించారు.

SV KRISHNA REDDY IN ALITHO SARADAGA TALK SHOW
అలీతో సరదాగాలో ఎస్వీ కృష్ణారెడ్డి

By

Published : Sep 30, 2020, 11:07 AM IST

తనలో ఉన్న నటుడికి తెలుసు.. నటనతో మాయ చేసే ‘మాయలోడు’డని..

తనలో ఉన్న సంగీత దర్శకుడికి తెలుసు.. తన సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను ఊపేయగలడని..

తనలో ఉన్న కథా రచయితకు తెలుసు తన కథలతో సకుటుంబ సపరివార సమేతంగా మెప్పించగలడని..

తనలోని నిర్మాతకు తెలుసు.. బడ్జెట్‌ పద్మనాభమని..

తనలో ఉన్న దర్శకుడికి తెలుసు.. సినిమా అంటే ఇవన్నీ కలిసి ఉండే 'ఉగాది' అని..

ఆఫ్‌ స్క్రీన్‌లో అన్ని క్యారెక్టర్లు చేసే ఆయన స్క్రీన్‌పై మాత్రం స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, 'ఎగిరే పావురం'లా శాంతంగా ఉంటారు. ఆయనే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదాగా సంగతులు పంచుకున్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి అంటే సెంటిమెంట్‌.. వినోదమా?

ఎస్వీ కృష్ణారెడ్డి: రెండు కలిపి ఉంటేనే కదా! లేకపోతే ఎస్వీ కృష్ణారెడ్డి ఎలా అవుతాడు(నవ్వులు)

చాట భాషకు లిపి లేదు. దాన్ని క్రియేట్‌ చేసింది మీరే. ఎంద చాట అంటే ఏంటి?

ఎస్వీ కృష్ణారెడ్డి: (నవ్వులు) మొట్టమొదటే మంచి ప్రశ్న వేశారు. అలీ అని ఒక మంచి ఆర్టిస్ట్‌ ఉన్నాడు. జనం చూడకముందే నా అదృష్టం కొద్దీ నేను అతన్ని చూశా. మొదటిసారి అలీ గురంచి దివాకర్‌బాబు నాకు చెప్పారు. ‘అతని దగ్గర చాలా రకాల టాలెంట్‌లు ఉన్నాయి. చిత్ర విచిత్రమైన భాష మాట్లాడతాడు. అది మాలయాళం కాదు కానీ, విచిత్రంగా ఉంటుంది’ అని నాకు చెప్పి నా దగ్గరకు పంపారు. అప్పుడు అతను నా దగ్గరకు వచ్చి ‘ఎంద చాట ’ అంటూ మాట్లాడాడు. నాకు బాగా నచ్చి, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో బ్రహ్మానందంతో పాటు ఇతర హాస్యనటుల కాంబినేషన్‌లో సీన్లు తీశాం. అప్పుడు ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఆలీ-బ్రహ్మానందం నటిస్తున్న సీన్లు తెరకెక్కిస్తున్న కెమెరామెన్‌ శరత్‌ ఆ సీన్‌ చూసి నవ్వు తట్టుకోలేక కెమెరా వదిలేసి వెళ్లిపోయాడు. అది అలాగే రన్‌ అవుతూనే ఉంది. ఆయనే కాదు, సెట్‌లో ఉన్న చాలా మంది నవ్వాపులేకపోయారు. నేను మాత్రం పంటి బిగువున నవ్వు ఆపుకొని, మీ సన్నివేశం పూర్తయ్యే వరకూ ఉన్నా. ఈరోజుకు కూడా అద్భుతమైన కామెడీ సీన్‌. సింగిల్‌ టేక్‌. కనీసం రిహార్సల్స్‌ కూడా చేయలేదు. (ఆలీ అందుకుని, ఆ రోజు సెట్‌కు రాగానే, నా సీన్‌ గురించి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను అడిగాను. పేపర్‌ తీసుకుని బ్రహ్మానందగారి డైలాగ్‌లు చెబుతున్నాడు. నా డైలాగ్‌ల దగ్గర ఖాళీగా ఉంది. ‘అదేంటి? నాకు డైలాగ్‌లు లేవా’ అని అడిగాను. ‘ఏమోనండీ. మీరు ఏదో భాష మాట్లాడతారట కదా! డైరెక్టర్‌గారు అది మాట్లాడేయమన్నారు’ అన్నాడు. ఎవరిని అడిగినా చెప్పడం లేదు. చివరిగా మిమ్మల్ని(ఎస్వీ కృష్ణారెడ్డి) అడిగితే ‘ఆ రోజు ఆఫీస్‌లో నువ్వు మాట్లాడింది. ఈ సీన్‌లో చెప్పు’ అన్నారు. ఈ సీన్‌ ప్రేక్షకులను అంత బాగా అలరిస్తుందని నేననుకోలేదు. సినిమా విడుదలైన తర్వాత నేను ఒక రోజు షాప్‌నకు వెళ్తే, అక్కడకు ఒక పాప కూడా వచ్చింది. నన్ను వాళ్లమ్మకు చూపిస్తూ, ‘అమ్మా.. చాటగాడు’ అంది (నవ్వులు) ఆ తర్వాత ‘మాయలోడు’ కూడా ఒకే ఎక్స్‌ప్రెషన్‌)

ఏ ఫార్ములాను నమ్ముకొని స్వీట్‌షాపు బిజినెస్‌ నుంచి టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌ అయ్యారు?మీకు స్ఫూర్తి ఎవరు?

ఎస్వీ కృష్ణారెడ్డి: నా తల్లి నాకు స్ఫూర్తి. ఆమె దగ్గర ఉన్నంత ప్రేమనంతా తీసుకున్నా. నేను కాలేజ్‌ చదివే రోజుల్లో నాకు ఇష్టమైనవన్నీ చేసి, నేను ఎప్పుడు వస్తానా? అని నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. రాగానే స్వీట్లు పెట్టేది. ఆ తర్వాత తన కాలుపై పడుకోబెట్టుకుని తల నిమిరేది. ‘ఇంత సంస్కారం అమ్మ దగ్గర నేర్చుకున్నాను కదా! దీన్ని జీవితాంతం వదలకూడదు’ అనుకున్నా. స్ఫూర్తి అంటే సంస్కారం. అప్పట్లో సినిమా చూడాలంటే థియేటర్‌కు రావాల్సిందే. ఎవరూ ఒంటరిగా రారు. మనతో పాటు చాలామంది కూడా అక్కడకు వస్తారు. వాళ్లతో కలిసి సినిమా చూడాలి. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు మన పక్కనే అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా చాలా మంది ఉంటారు. సంస్కారం అనేది లేకపోతే అక్కడ చాలా ప్రమాదం ఎదరవుతుందని నా ఫీలింగ్‌. అదే నా సినిమా. అసభ్య సన్నివేశాలు లేకుండా సినిమాలు చేశాను. అదొక్కటే నన్ను కాపాడింది. ఇప్పటికీ బయటకు వెళ్తే, ‘మీరొక్కరే సర్‌.. ఇంటిల్లిపాదీ కూర్చొని చూసే సినిమాలు తీశారు’ అంటే మనసు పులకించిపోతుంది.

ప్రేమ కథలు, పెళ్లి కథలు నడుస్తున్న సమయంలో విడాకులు కథాంశంతో సినిమా తీయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది?

ఎస్వీ కృష్ణారెడ్డి: వరుసలో వెనుక నిలబడటం కన్నా, మనమే కొత్త వరుస ఏర్పాటు చేస్తే, దానికి పాపులారిటీ ఉంటుందనేది నా అభిప్రాయం. అందుకే వరుసగా అలాంటి సినిమాలు చేసుకుంటూ వచ్చా. ‘విడాకులు’ కాన్సెప్ట్‌తో సినిమా తీయాలనుకున్నా, కానీ, క్లైమాక్స్‌ ఏంటో తెలియలేదు. సాధారణంగా పెళ్లికి అందరూ శుభలేఖ ఇచ్చి వేడుకగా కార్యక్రమం చేసుకుంటాం. అలాగే విడాకులను కూడా ఎందుకు ఫంక్షన్‌లా చేయకూడదనిపించింది. అదే సినిమా కాన్సెప్ట్‌తో ఇంగ్లిష్‌లోనూ సినిమా చేశా. ఇంకా పుట్టనటువంటి బిడ్డ హక్కుల కాన్సెప్ట్‌తో అది నడుస్తుంది.

ప్రముఖ దర్శకనిర్మాత ఎస్పీ కృష్ణారెడ్డి

‘ఆహ్వానం’ విడుదలైన తర్వాత మహిళల నుంచి వచ్చిన స్పందన ఏంటి?

ఎస్వీ కృష్ణారెడ్డి: అన్నీ మంచి ప్రశంసలే వచ్చాయి. ఈ సందర్భంగా మీకొక సంఘటన చెబుతా. ప్రతి సినిమాకు పెద్ద పెద్ద దర్శకులను పిలిచి ప్రివ్యూ వేసేవాడిని. ఈ సినిమాకు కె.విశ్వనాథ్‌గారిని పిలిచా. ఆయన తన భార్యతో కలిసి వచ్చారు. సినిమా అయిపోయిన తర్వాత వెళ్లి ఆయన్ను కలిశా. ‘అందరూ వెళ్లిపోయే దాకా నేను ఉంటాను. ఆ తర్వాత వచ్చి నన్ను కలువు. నీతో మాట్లాడాలి’ అన్నారు. నేను షాకయ్యా. అందరూ వెళ్లాక ఆయన దగ్గరకు వెళితే, నా భుజంపైన చేయి వేసి ‘ఎంత సాహసం చేశావయ్యా. నేనే చేయలేదు. ఒక పాయింట్‌ను ఇంత గొప్పగా ప్రజెంట్‌ చేశావు. సెన్సేషనల్‌ హిట్ అవుతుంది’ అని చెప్పారు. ఇటీవల కూడా ఒక ఫంక్షన్‌లో కలిసినప్పుడు ‘ఏంటయ్యా.. నువ్వు ఈ మధ్య సినిమాలు ఎందుకు తీయడం లేదు’ అని అడిగారు. ‘కొంతకాలం ఆగి చేద్దామనుకుంటున్నానండీ’ అని చెప్పాను. ‘సినిమా దర్శకత్వం సర్లేవయ్యా.. కనీసం ఆ మ్యూజిక్‌ డైరెక్షన్‌ అయినా చేయవచ్చు కదా! కొత్త పాటలు విందామంటే కుదరదు. పాతవి అవే వినాలి. కొత్త పాటలు చెయ్యవయ్యా..’ అని మురిసిపోయారు. ‘శంకరాభరణం’ వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన ఆ మహానుభావుడు నా సంగీతాన్ని మెచ్చుకోవడం నిజంగా నా అదృష్టం.

ఆ రోజుల్లో మీరు తలుచుకుంటే ఇళయరాజా, రెహమాన్‌లతో మ్యూజిక్‌ చేయించవచ్చు. కానీ, ఆ ఆలోచన మీకెందుకు రాలేదు?

ఎస్వీ కృష్ణారెడ్డి: నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. ‘తెలుగులో మీకు నచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు’ అని రెహమాన్‌గారిని అడిగితే ఆయన ‘ఎస్వీ కృష్ణారెడ్డిగారి సంగీతం అంటే నాకు ఇష్టం’ అని చెప్పారట. నేనే షాకయ్యా.

‘యమలీల’లో తల్లి పాటను ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేశారు?

ఎస్వీ కృష్ణారెడ్డి: ఒకరకంగా మా అమ్మగారిని దృష్టిలో పెట్టుకుని ఆ పాట చేశా. అయితే, అప్పటికే ఆమె చనిపోయారు. నా సక్సెస్‌ను కూడా చూడలేదు. అప్పుడు నేను ఎం.కామ్‌ చదువుతున్నా.

మీ స్వస్థలం ఏది?

ఎస్వీ కృష్ణారెడ్డి: భీమవరం దగ్గర ఆరవల్లి. నేను పుట్టి పెరిగింది అంతా తూర్పుగోదావరి జిల్లా ‘కొంకుదురు’. మేము ఇద్దరం బ్రదర్స్‌. ఆయన కూడా చనిపోయారు. ఇప్పుడు నేను, నా భార్య.. నాకు ఇద్దరు కూతుళ్లు. వారికి పెళ్లి కూడా అయింది.

ఎస్వీ కృష్ణారెడ్డి కుటుంబం

అచ్చిరెడ్డిని ఎలా కలిశారు?

ఎస్వీ కృష్ణారెడ్డి: నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఆరవల్లి వెళ్లినప్పటి నుంచి బాగా స్నేహం. ఆ తర్వాత బంధుత్వాలు కూడా కలిశాయి. చాలా మంచి వ్యక్తి. నేనే ఎప్పుడైనా ఒక మాట జారి, ఆ తర్వాత సారీ చెబుతా. కానీ, తను ఎప్పుడూ అలా మాట్లాడింది లేదు. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. (మధ్యలో ఆలీ అందుకుని, అప్పట్లో మీరిద్దరూ వస్తుంటే ‘అచ్చి బుచ్చిలు వస్తున్నారు’ అని సరదాగా అనేవారు)

‘యమలీల’ కథ రాయగానే హీరోగా ఎవరిని అనుకున్నారు?అసలు హీరో దొరక్క ఆలీని పెట్టుకున్నారా?

ఎస్వీ కృష్ణారెడ్డి: హీరో దొరక్క ఆలీని పెట్టుకోలేదు. అప్పట్లో నా దర్శకత్వంలో నటించడానికి చాలా మంది హీరోలు ఇష్టపడేవారు. ‘ఆ పాత్ర మేం చేస్తాం కదా’ అని ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోల దగ్గరి నుంచి కూడా నాకు కబురొచ్చింది. కానీ, నేను అనుకున్న కథలో హీరో చేతకానివాడిలా ఉండాలి. తల్లికోసం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండాలి. ఇంట్లో దొంగతనాలు, బయట అప్పులు చేసే వాడిలా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే దేనికి పనికి రానివాడు కావాలి. కానీ, వారంతా తెరపై అద్భుతాలు చేయగల హీరోలు. ఇక్కడ ఇంకొక విషయం చెబుతా. ఆలీ పక్కన కథానాయికగా సౌందర్య చేయాలి. మరో 15రోజుల్లో షూటింగ్‌ ఉందనగా, సౌందర్య ఫోన్‌ చేసి, ‘సర్‌.. పెద్ద పెద్ద హీరోల పక్కన ఛాన్స్‌లు వస్తున్నాయి. ఈ సినిమా నేను చేయలేను. దయచేసి అర్థం చేసుకోండి’ అని చాలా వినమ్రంగా అడిగింది. ‘నీ మనసుకు నచ్చకపోతే చేయొద్దు’ అని నేను చెప్పా. అయితే, ఒక కండిషన్‌ పెట్టింది. ‘మీరు నటిస్తే, తప్పకుండా చేస్తా’ అని చెప్పింది. ‘నేను ఆ పాత్రకు సరిపోనమ్మా. ఒక ఆలీ తప్ప ప్రపంచంలో ఎవరూ సరిపోరు. ఒకవేళ మొహమాటం కొద్దీ చేసినా, ఆ సినిమా ఆడదు. నేను సక్సెస్‌ను కోరుకుంటున్నా. అందుకే ఆలీని తీసుకున్నా’ అని వివరించా. ‘అయితే, చేయలేను సర్‌’ అంది. సౌందర్య మానేసిందని కోట శ్రీనివాసరావుగారు మానేశారు. కోట చేయనంటే తోటరాముడి పాత్రలో తనికెళ్ల భరణిగారిని తీసుకొచ్చా. ఈ కారణంతో చేయలేమని ఎవరన్నా కూడా.. ‘సర్లేండి. మనం మరొక సినిమాకు చేద్దాం’ అని వాళ్లతో చెప్పా. అందరినీ వదులుకున్నా. నా కథ కోసం, హీరో పాత్ర కోసం కోటలాంటి నటుడినే వద్దనుకున్నా. అయితే, కోట శ్రీనివాసరావుగారి గొప్పతనం ఇక్కడ మనం మెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆయనే వచ్చి నాకు సారీ చెప్పి, ‘సినిమా చేస్తానండీ. ఏ పాత్ర ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే మీరు మా ఆలీని హీరో చేస్తున్నారు. నేను తప్పకుండా నటించాలి’ అన్నారు. అప్పుడు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్ర ఉంటే ఆయనకు ఇచ్చా. ఆలీకి నేను అవకాశం ఇచ్చానని ఎప్పుడూ అనుకోవద్దు. అది ఆయన గొప్పతనం.

(ఎస్వీ కృష్ణారెడ్డి అందుకుని, ఎప్పుడూ మీరే ప్రశ్నలు అడుగుతారా? నేను ఒక ప్రశ్న అడగవచ్చా?)

ఎస్వీ కృష్ణారెడ్డి: ‘యమలీల’ చేసినప్పుడు మీ తల్లి ఎలా ఫీలయ్యారు?

ఆలీ: ఆ సినిమాను సారథి స్టూడియోస్‌ బయట ఉన్న థియేటర్‌లో షో వేశారు. మేనేజర్‌ నాకు ఫోన్‌ చేసి, ‘సినిమా చూడటానికి డైరెక్టర్‌గారి కుటుంబం వస్తోంది. మీరు అక్కడకు వస్తే బాగుంటుంది’ అనగానే, మా అమ్మను, భార్యను తీసుకొచ్చా. నాన్న రాలేదు. ఆ తర్వాత సినిమా విడుదల రోజున మా కుటుంబంలో దాదాపు 35మందిని తీసుకొని రాజమండ్రిలో థియేటర్‌కు వెళ్లా. సినిమా చూసి నాన్న భుజం తట్టారు. అమ్మ దిష్టి తీసింది. ఆ తర్వాతి రోజు థియేటర్‌ దగ్గర టికెట్లు దొరక్క కొట్టుకుంటున్నారని తెలిసింది. నా ఫ్రెండ్‌ కారు ఉంటే దాన్ని తీసుకుని థియేటర్‌కు వెళ్లి అద్దంలో నుంచే అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయా. ‘మేము ఏదో పుణ్యం చేసుకుంటే నువ్వు పుట్టావు. మమ్మల్ని ఫలానా ఆలీ తల్లిదండ్రులు అన్న పేరు తీసుకొచ్చావు. చాలా సంతోషం’ అని అమ్మ అంది. సాధారణంగా కొడుకుని తండ్రి ‘అరేయ్‌ ఇటు రారా.. అటు వెళ్లరా’ అంటూ సంబోధించడం సర్వసాధారణం. కానీ, ‘యమలీల’ విడుదలైన తర్వాత జనాల ఫాలోయింగ్‌ చూసి, మా నాన్న నన్ను ‘రా’ అనడం మానేశారు. ‘ఏవండీ ఆలీగారు’ అనడం మొదలుపెట్టారు. ఇప్పుడు 26ఏళ్ల తర్వాత ‘యమలీల ఆ తర్వాత’ మనం సీరియల్‌ చేస్తున్నాం.

ఎస్వీ కృష్ణారెడ్డి: ఈటీవీ సీరియల్‌కు సంబంధించిన ఫస్ట్‌ ఎపిసోడ్‌లన్నీ చూశా. నేను దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నా. ‘యమలీల’కు ఆర్టిస్ట్‌లు ఏ విధంగానైతే అందరూ చక్కగా సరిపోయారో.. ఈ సీరియల్‌ కూడా అంత బాగా సెట్‌ అయ్యారు. ఆరు ఎపిసోడ్‌లు చూసిన తర్వాత అన్నీ తెలిసిన నేనే ఏడవకుండా ఉండలేకపోయాను.

ప్రముఖ దర్శకనిర్మాత ఎస్పీ కృష్ణారెడ్డి

‘టాప్‌ హీరో’ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ఎన్టీఆర్‌ ‘మీ దర్శకత్వంలో మేం సినిమా చేద్దామనుకుంటున్నా’ అన్నారట. ఆ సినిమా ఎందుకు పట్టాలెక్కలేదు?

ఎస్వీ కృష్ణారెడ్డి: అవును. అన్నారు. కానీ, ఆ తర్వాత ఆయన సీఎంగా బిజీ అయిపోయారు. ‘టాప్‌ హీరో’ షూటింగ్‌ ప్రారంభోత్సవానికి ఆయన్ను పిలవడానికి నేను వెళ్లా. ‘మీ గురించి చాలా విన్నాం కృష్ణారెడ్డి. ఇలాగే అద్భుతాలు చేయాలి’ అన్నారు. ‘సర్‌.. మీతో కూడా సినిమా చేయాలని ఉంది’ అని చెప్పా. ‘ఆరోజు కూడా వస్తుందేమో చేద్దాం’ అన్నారు. దటీజ్‌ ఎన్టీఆర్‌.

బాలకృష్ణతో ‘టాప్‌ హీరో’ఎందుకు చేయాల్సి వచ్చింది?

ఎస్వీ కృష్ణారెడ్డి: కృష్ణగారితో సినిమా చేశా. బాలకృష్ణతో కూడా సినిమా చేద్దామని అనిపించింది. వెళ్లి అడిగితే ‘మీరు ఎప్పుడు అంటే అప్పుడు రంగంలోకి దూకేద్దాం’ అన్నారు. ఆయన ఇంటికి వెళ్తే, ఇప్పటికీ ఆ సినిమా పాటలు నాకు చూపిస్తారు. మంచి పాటలు ఇచ్చారని మెచ్చుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే.. సెట్‌ దర్శకుడికి ఎంతో మర్యాద ఇస్తారు. అది ఆయన గొప్పతనం.

మీ సినిమాలకు కాకుండా, బయట దర్శకులు ఎవరైనా పాటలు చేసిపెట్టమని అడిగారా?

ఎస్వీ కృష్ణారెడ్డి: మహానుభావుడు రాఘవేంద్రరావుగారు చిరంజీవి సినిమా కోసం అడిగారు. అప్పట్లో కుదరలేదు. అంత గొప్ప వ్యక్తి నన్ను అడగటం నిజంగా నా అదృష్టం.

‘వినోదం’ సమయంలో స్టోరీ విషయంలో వివాదం జరిగిందట.

ఎస్వీ కృష్ణారెడ్డి: తమిళంలో కార్తీక్‌, రంభ జంటగా నటించిన ‘ఉళ్లత్తే, అళ్లత్తే’ సూపర్‌హిట్. అది నాకు బాగా నచ్చింది. దీంతో నిర్మాతకు ఫోన్‌ చేసి, ‘సినిమా రేటు ఎంత’ అని అడిగా. ‘రూ.3లక్షలు అయితే ఇచ్చేస్తా’ అన్నారు. ‘వచ్చి తీసుకెళ్లండి’ అని చెప్పా. వాళ్లు రాలేదు. మళ్లీ ఫోన్‌ చేస్తే, ‘లేదండీ.. రూ.6లక్షలు ఇవ్వండి’ అన్నారు. ‘పోనీలే వచ్చి ఆరు లక్షలు తీసుకెళ్లండి’ అని చెప్పా. మళ్లీ రాలేదు. ఫోన్‌ చేస్తే, ‘ఇప్పుడు రూ.9లక్షలు అయితే ఇస్తామండీ’ అన్నారు. నాకు కాస్త కోపం వచ్చింది. ‘తెలుగువాడు మీకెలా కనపడుతున్నాడు. మాకు చేతకాదని మిమ్మల్ని అడుగుతున్నామనుకుంటున్నావా? నీ సినిమా కన్నా గొప్ప సినిమా చేస్తా. ఇప్పుడు నువ్వు రూ.3లక్షలకు కాదు కదా. మూడు రూపాయలకు ఇచ్చినా నేను కొనను’ అని ఫోన్‌ పెట్టేశా. అప్పుడే ‘వినోదం’ సినిమా చేశా. అయితే వివాదం ఎందుకొచ్చిదంటే.. ఆ కథతో మోహన్‌బాబుగారితో ఈవీవీగారు చేద్దామనుకున్నారు. ‘ఉళ్లత్తే అళ్లత్తే’ను మోహన్‌బాబుగారు కొన్నారు. అదే ‘వీడెవడండీ బాబూ’. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో మోహన్‌బాబుగారు ఫోన్‌ చేసి, ‘తమిళ నిర్మాతతో ఏదో జరిగిందట కదా’ అన్నారు. జరిగిన విషయమంతా ఆయనకు చెప్పా. ‘సర్‌.. నా సినిమా షూటింగ్‌ పూర్తవుతోంది. అయిన వెంటనే మీకు షో వేస్తా. మీరు ఓకే అంటేనే విడుదల చేస్తా’ అని చెప్పాను. ‘అయ్యో.. అలా ఏమీ లేదు. మీపై మాకు నమ్మకం ఉంది’ అన్నారు. నిజంగా ఆయన లెజెండ్‌. ఆ తర్వాత మొదటి కాపీ వచ్చిన తర్వాత ఆయనకు చూపించా. ‘అసలు ఆ సినిమాకు దీనికి సంబంధం లేదు కదా. నువ్వు ఇచ్చిన వార్నింగ్‌కు ఆ నిర్మాత భయపడినట్టు ఉన్నాడు’ అని అన్నారు. అంతే జరిగింది. పెద్ద వివాదం ఏమీ లేదు.

రాజేంద్రప్రసాద్‌తో వరుసగా మూడు సినిమాలు తీశారు. కానీ, ఆ తర్వాత మీరు ఆయనతో సినిమా చేయలేదు. ఆయనతో గొడవైందని ఇండస్ట్రీలో టాక్‌. నిజమెంత?

ఎస్వీ కృష్ణారెడ్డి: చిన్న చిన్న వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తి తలచుకోకుండా ఉండి ఉంటే, ఎస్వీ కృష్ణారెడ్డి అనేవాడు డైరెక్టర్‌ అయ్యేవాడు కాదు. ఎందుకంటే అంతకుముందు నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎక్కడా పనిచేయలేదు. విపరీతంగా సినిమాలు చూడటం తప్ప నాకు పెద్దగా నాలెడ్జ్‌ లేదు. అలాంటి నన్ను డైరెక్టర్‌గా ఒప్పుకోవడం నిజంగా అద్భుతం. ఆయనంటే ఇప్పటికీ నాకు గౌరవం ఉంది. ప్రస్తుతం ఆయన తండ్రి పాత్రల్లో అదరగొడుతున్నారు. ఆయన మెయిన్‌ లీడ్‌గా నేను కూడా ఒక స్క్రిప్ట్‌ రాసుకుంటున్నా. అన్నీ కుదిరితే సినిమా చేస్తాం.

‘మాయలోడు’లో బాబూమోహన్‌తో పాట ముందుగానే అనుకున్నారా?

ఎస్వీ కృష్ణారెడ్డి: అనుకోకుండా చేశాం. (మధ్యలో ఆలీ అందుకుని ఆ పాట నాతో చేయించొచ్చు కదా) అప్పుడు ఆ ఆలోచన రాలేదు. బాబూమోహన్‌ అద్భుతంగా చేశారు. ఇలాంటివన్నీ జరగడానికి ఎక్కడో ఒక సెంటిమెంట్‌ లింక్‌ ఉంటుంది. ‘యమలీల’ సౌందర్య తిరస్కరించడంతో ఆ తర్వాత ఒకసారి మాటల్లో ‘మీరు ఎప్పుడైనా నా సినిమాలో చేయకుండా ఉంటారా?’ అని అన్నాను. ‘పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయనే కారణం తప్ప. మీ సినిమా చేయడానికి మరో కారణం ఏమీ లేదండీ’ అని చెప్పింది. ‘మరి బాబూమోహన్‌ పక్కన సాంగ్‌ ఉంది చేస్తావా’ అని అడిగితే, ‘మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నారు’ నిజంగా ఆమె గ్రేట్‌. ఆ తర్వాత వాన పాటకు ‘శుభలగ్నం’లో మీరు(ఆలీ) సౌందర్యతో చేశారు. ఇదంతా ఒకదానితో మరొకటి లింక్‌. ఒకరిపట్ల ఒకరికి ఎప్పుడూ పగలు, ప్రతీకారాలు లేవు.

రజనీ-శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’లో హీరోయిన్‌ను రోబో ప్రేమిస్తుంది. ‘ఘటోత్కచుడు’లో ఈ కాన్సెప్ట్‌ మీరు ఎప్పుడో చూపించారు.

ఎస్వీ కృష్ణారెడ్డి: అవును. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

‘దీర్ఘ సుమంగళిభవ’ హిట్టా?

ఎస్వీ కృష్ణారెడ్డి: సూపర్‌హిట్‌ కాదు కానీ, పర్వాలేదు. ఈ సినిమా విషయంలో కొందరు మహిళా ప్రేక్షకులు నిరాశ చెందారు.

మీరు, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలు దాదాపు ఒకటే రోజున విడుదలయ్యేవి కారణం?

ఎస్వీ కృష్ణారెడ్డి: అనుకోకుండా అలా జరిగేది. వృత్తిపరమైన పోటీ తప్ప, వ్యక్తిగతంగా మంచి స్నేహితులం. ఆయన తీసే సినిమాల కథ నాకు, నేను తీసే సినిమా కథ ఆయనకు చెప్పుకొనేవాళ్లం. ‘మీ అబ్బాయి హీరోగా చేస్తున్నాడు కదా! కావాలంటే ఆ సినిమాకు సంగీతం అందిస్తా’ అని కూడా చెప్పా.

చిరంజీవితో సినిమా ఎందుకు చేయలేదు?

ఎస్వీ కృష్ణారెడ్డి: ఒక కథ అనుకున్నాం కానీ, పట్టాలెక్కలేదు. అప్పటికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తీయాల్సిన కథ అది. వర్కవుట్‌ కాదేమోనని పక్కన పెట్టేశాం. ఈ రోజుల్లో అయితే, ఈజీగా చేసేయొచ్చా. ఈ సినిమాకు బదులు నిర్మాత అశ్వనీదత్‌ కోసం ‘శుభలగ్నం’ చేశా.

కె.విశ్వనాథ్‌తో ఒక సినిమా చేసినట్లున్నారు?

ఎస్వీ కృష్ణారెడ్డి: ‘శుభ సంకల్పం’తో ఆయన నటించడం మొదలు పెట్టారు. తొలుత బయట సినిమాలు చేసేవారు కాదు. నా విన్నపం మేరకు ‘వజ్రం’లో నటించేందుకు ఒప్పుకొన్నారు. ‘ఆదుర్తి సుబ్బారావుగారి తర్వాత అంత స్పష్టత ఉన్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిని చూశా’ అని ఆయన ఇచ్చి కితాబును మర్చిపోలేను.

దర్శకుడిగా ఓ స్థాయికి వెళ్లి మీరు హీరోగా మారడానికి కారణం ఏంటి?

ఎస్వీ కృష్ణారెడ్డి: అసలు హీరో అవుదామనే నేను ఇండస్ట్రీకి వచ్చా. ఫొటోలు పట్టుకుని కూడా తిరిగా. జంధ్యాలగారు, దాసరిగారి వద్దకు వెళ్లాను. ఇండస్ట్రీలో చాలా ప్రయత్నాలు చేశా. ఒక దశకు వచ్చిన తర్వాత ‘మనకు ఎవరూ వేషాలు ఇవ్వరు’ అని అర్థమైంది. అప్పుడే అచ్చిరెడ్డిగారు. ‘ఎందుకురా ఆ ప్రయత్నాలు.. మనం ప్రొడక్షన్‌ హౌస్‌ పెడదాం’ అని మనీషా బ్యానర్‌ స్థాపించాం. వీడియో రైట్స్‌, డబ్బింగ్‌ సినిమాలు కొనడం దగ్గరి నుంచి సొంతంగా సినిమా తీసే స్థాయికి ఎదిగాం. నేను దర్శకత్వం బాగా చేస్తానని అచ్చిరెడ్డిగారు భావించారు. అలా సినిమాలు చేయడం, అవి సూపర్‌హిట్‌లు కావడం జరిగిపోయాయి. అప్పుడు సక్సెస్‌, డబ్బు, అన్నీ వచ్చాయి. అదే సరైన సమయమనుకుని హీరోగా చేశా. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేశాం. అదే సమయంలో బయట నిర్మాతతో చేయలేదు.

మీకు బాగా తెలిసిన ఒక కుటుంబంలో ఆ ఇంటి యజమాని ఫొటో పక్కన మీ ఫొటో పెట్టుకుని రోజూ తలచుకుంటారట!

ఎస్వీ కృష్ణారెడ్డి: కృష్ణగారని చక్రవర్తిగారి వద్ద చాలా సినిమాలకు పనిచేశారు. నన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌ను చేసింది ఆయనే. ఒక రోజు నా దగ్గరకు వచ్చి ‘ఏవండీ మీలో మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఉన్నారు. చక్రవర్తిగారికి ఉన్న క్వాలిఫికేషన్లు మీలో ఉన్నాయి’ అని అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే ‘కొబ్బరి బొండాం’కు ప్రయత్నించాం. సక్సెస్‌ అయింది. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘యమలీల’ ఇలా వరుస సినిమాలకు చేశాం.

‘యమలీల’లో ఒక్క సాంగ్‌ మాత్రమే చేయడానికి హీరో కృష్ణ ఒప్పుకొన్నారా?

ఎస్వీ కృష్ణారెడ్డి: అది ఆయన గొప్పతనం. సాంగ్‌ ప్రారంభంలో క్లాత్‌తో మూమెంట్స్‌ ఉంటాయి. అవన్నీ సింగిల్‌ టేక్‌లో చేశారు. అదే కాదు, ‘నెంబర్‌ వన్‌’లో చార్లీ చాప్లిన్‌ వేషం వేసి, ‘ఈ వేషం నాకు బాగుంటుంది’ అన్నారు. ఆయనపై ఆయనకు నమ్మకం అది.

మీ మైండ్‌లో ఏదైనా క్రేజీ ప్రాజెక్టు ఉందా?

ఎస్వీ కృష్ణారెడ్డి: ఇప్పటివరకూ ఏ చిత్ర పరిశ్రమలోనూ రాని ఒక సబ్జెక్ట్‌ ఉంది. పరిస్థితులు చక్కబడిన వెంటనే అందుకు సంబంధించిన పనులు మొదలు పెడదాం. భారీ బడ్జెట్‌ చిత్రం అవుతుంది. దీంతో పాటు, మరో సబ్జెక్ట్‌ కూడా సిద్ధం చేస్తున్నాం. ‘వినోదం’ పేరుతో వరుస సినిమాలు చేస్తాను.

ABOUT THE AUTHOR

...view details