నిలిచిపోయిన సినిమా చిత్రీకరణలు షురూ కానున్నాయి. మూతపడిన థియేటర్లు క్రమంగా తెరుచుకోనున్నాయి. రాష్ట్రాల వారీగా సినిమా సందడి మెల్లమెల్లగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు చిత్రసీమ(Tollywood) కార్యకలాపాల పునరుద్ధరణకు రంగం సిద్ధం చేసుకొంటోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటం వల్ల రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇస్తున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య(Covid cases in MH) ఆధారంగా ఆయా ప్రాంతాల్ని స్థాయిలవారీగా విభజించి లాక్‌డౌన్ నిబంధనల్ని ఎత్తివేసింది. పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. అక్కడ థియేటర్లలో సినిమా ప్రదర్శనలకూ అనుమతులు ఇచ్చింది. దాంతో చివరి దశలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయడం కోసం ఈ నెల 7 నుంచే బాలీవుడ్ వర్గాలు చిత్రీకరణలకు సిద్ధం అవుతున్నాయి.
టైగర్‌ష్రాఫ్ 'టైగర్ 3' మొదలుకొని షారుఖ్‌ఖాన్ 'పఠాన్'(pathan), అజయ్ దేవగణ్ 'మే డే'(May Day), సంజయ్ లీలా భన్సాలీ 'గంగూబాయి కతియావాడి'(gangubai kathiawadi).. రణ్‌బీర్‌కపూర్, అలియాభట్‌ల 'బ్రహ్మాస్త్ర'(Brahmastra), ప్రభాస్ 'ఆదిపురుష్'(Adipurush) తదితరాలు చిత్రీకరణ దశలోనే ఆగిపోయాయి. వాటని పునరుద్ధరించేందుకు బాలీవుడ్(Bollywood) వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. అయితే నిబంధనల దృష్ట్యా అన్ని సినిమాల చిత్రీకరణలు ఇప్పట్లో ప్రారంభం కాలేవని, నిర్మాతలు తమ చిత్రబృందాలకు టీకాలు వేయించడంపై దృష్టిపెట్టారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
టాలీవుడ్ రెడీ
తెలుగు చిత్రసీమలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలోనూ కొన్ని సినిమాల చిత్రీకరణలు సాగాయి. లాక్‌డౌన్ తర్వాతే పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణల్ని పునః ప్రారంభించేందుకు పలు చిత్రబృందాలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. సమంత ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న 'శాకుంతలం'(sakunthalam) సినిమా సెట్ పనులు మొదలయ్యాయి.