తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లైఫ్​లో హైదరాబాద్​ చూడగలవా అన్నారు: మోహన్​బాబు - mohan babu ntr

తన వ్యక్తిగత, సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆటుపోట్ల గురించి సీనియర్ నటుడు మోహన్​బాబు చెప్పారు. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరై అలీ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అవేంటో మీరు చదివేయండి.

mohan babu
మోహన్​బాబు

By

Published : Sep 29, 2021, 9:49 AM IST

ఆయన మాట అగ్నిపర్వతం, మనసు మంచు పర్వతం. తన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 500 వందలకు పైగా సినిమాలతో, ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అశేష అభిమానగణాన్ని ఉర్రూతలూగించిన మహానటుడాయన. అల్లుడుగారిలా అల్లరి చేయాలన్నా, పెదరాయుడిలా రాజసాన్ని ఒలికించాలన్నా ఆయనకే చెల్లింది. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఎందరికో స్ఫూర్తిదాయకం కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు జీవితం. 'ఆలీతో సరదాగా' కార్యక్రమం 250వ ఎపిసోడ్‌కు ఆయన అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు చెప్పిన విశేషాలు మీకోసం.

ఆలీతో సరదాగా షోలో మోహన్​బాబు

250వ ఎపిసోడ్‌కు స్వాగతం

మోహన్‌బాబు: నీ మూడో సినిమాకు మనం తొలిసారి కలిసి పనిచేశాం. ఇప్పుడు ఇక్కడిదాకా వచ్చాం. గతాన్ని నెమరేసుకుంటే తెలియని దుఃఖం వస్తోంది. నేను ఎంత కఠినంగా కనిపిస్తానో, అంత సున్నితమైనవాడిని. ఇంత సుదీర్ఘ ప్రయాణం సాగుతుందని జీవితంలో ఎప్పుడూ కలగనలేదు.

నటుడిగా జీవితం ఎలా ప్రారంభమైంది?

మోహన్‌బాబు: ముందు నటుడు అవ్వాలనే ఆలోచన వచ్చింది. మంచి విలన్‌ అవుదామని పరిశ్రమలోకి అడుగుపెట్టాను. 1975 నవంబర్‌ 22న నా మొదటి చిత్రం 'స్వర్గం నరకం' విడుదలైంది. ఇన్ని సంవత్సరాలు ఉంటానని అనుకోలేదు. విజయవాడలో ఈ సినిమా షూటింగ్‌ కోసం గురువు దాసరిగారు అడగకుండానే నా పేరును మోహన్‌బాబుగా మార్చారు.

విష్ణు, లక్ష్మీ(mohan babu family) చెబితేనే ఈ షోకు వచ్చారా? నా మీద ప్రేమతో వచ్చారా?

మోహన్‌బాబు: నీ మీద ప్రేమ లేకుంటే ఎలా వస్తాను. నీకంటే ఎక్కువ మీ అమ్మగారి మీద గౌరవంతో వచ్చాను. ఆమె నాకు అమ్మలాంటిది. ఆ మహాతల్లి ఎక్కడ కనిపించినా పాదాలకు నమస్కారం చేశాను. నీలాంటి వాళ్లు నమస్కారం పెట్టినట్లు నటిస్తారు.

నాకు అన్నలు లేరు. మా అమ్మ మోహన్‌బాబు నా పెద్ద కొడుకు అని చెప్పేది. మీ మీద నాకు అలాంటి ప్రేమే ఉంది.

మోహన్‌బాబు: కాళ్లకు నమస్కారం పెట్టించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. ప్రేమనేది మనసులో ఉండాలి.

మోదుగులపాలెం నుంచి మద్రాసు ప్రయాణం ఎలా జరిగింది?

మోహన్‌బాబు: నాన్న ఎలిమెంటరీ టీచర్‌. సినిమాకు నటీనటులు కావాలి అని పేపర్లో ఒక ప్రకటన వచ్చింది. నాన్న అప్పు చేసి వంద రూపాయలిస్తే ఫొటో స్టూడియోకెళ్లి ఫొటోలు దిగి దరఖాస్తు చేశాను. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకరోజు అమ్మానాన్నలకు చెప్పకుండా దొంగబండి ఎక్కి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌లో దిగిపోయాను. తెలిసీ తెలియని వయసు. అక్కడ నాకేమీ తెలియదు. కొద్దిగా తమిళం మాత్రం వచ్చు. కానీ, భయమేసి మళ్లీ వెనక్కి వచ్చేందుకు రైలెక్కాను. టీసీ వస్తే బాత్రూంలో దాక్కున్నాను. అయినా పట్టుకుని మధ్యలోనే దింపేశారు. ఆ తర్వాత ఎలాగోలా ఇంటికి చేరుకున్నాను. ఈ విషయాన్ని నాన్నతో చెబితే చితకబాదారు.

మోహన్​బాబు

అప్పటికీ మీ వయసెంత?

మోహన్‌బాబు: అప్పుడు నా వయసు 14 ఏళ్లు.

మీ కుటుంబంలో మొత్తం ఎంత మంది?

మోహన్‌బాబు: మేం మొత్తం ఐదుగురం. నేనే పెద్దవాన్ని. మా అమ్మకు మొదట్లో సంతానం కలగలేదు. మాది తిరుపతి, కాళహస్తిలకు మధ్యనుండే ఏర్పేడు అనే చిన్నగ్రామం. మా ఊరు నుంచి 4 కి.మీ. పొలాల్లో నడిచి వెళ్తే ఓ గ్రామం వస్తుంది. అక్కడి నుంచి మరో నాలుగు కిలోమీటర్లు అడవిలో నడిచి, రెండు కి.మీ. కొండెక్కితే శివాలయాన్ని చేరుకుంటాం. ఆ ఆలయంలో మా అమ్మ సంతానప్రాప్తి కోసం పూజలు చేసింది. ఆ తర్వాత ఐదుగురికి జన్మనిచ్చింది. మా అమ్మకు చెవులు వినిపించవు. 8 కి.మీ.లు నన్ను భుజానమోసి నడిచింది. ఇప్పుడు ఆ కొండపై రెండువేల మెట్లు కట్టించాను.

సినిమా నటుడు అవడానికి స్ఫూర్తి ఎవరు?

మోహన్‌బాబు: అన్నగారి (ఎన్టీఆర్‌) సినిమాలు చూసేవాన్ని. నేను చూసిన మొదటి సినిమా 'రాజమకుటం'. కాలినడకన థియేటర్‌కు వెళ్లి చూసిన సినిమా అది. దానికి హీరో అన్నగారే. విలన్‌గా నటించాలనేది నా కోరిక. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా రూ.140 జీతంతో ఓ స్కూల్‌లో పనిచేశాను. వేరే కులమని నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. ఈ విషయమే నాన్నకు చెప్పాను. ఉన్న నాలుగెకరాల్లో వ్యవసాయం చేసుకోమన్నారు. 1000 ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయం అంటారేంటి నాన్నా? అని అడిగితే నన్ను కొట్టారు. చేతనైతే సంపాదించి పెట్టు అని కోప్పడ్డారు.

ఇండస్ట్రీలోకి అడుగెలా పడింది?

మోహన్‌బాబు: చెన్నైలోని పాండిబజార్‌లో సాయంత్రమైతే సినిమా తారలు కనిపించేవారు. ఆ సమయంలోనే గిరిబాబు పరిచమయ్యాడు. సంవత్సరంలోనే స్కూల్‌లో ఉద్యోగం పోయింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మొదలుపెట్టి, మెల్లగా అవకాశాలు వెతుక్కోవచ్చని భావించాను. ఆర్టిస్ట్‌ ప్రభాకర్‌రెడ్డి గారు నేనుంటున్న చోటుకు దగ్గరే ఉండేవారు. ఆయన్ని కలిసి నా పరిస్థితేంటో వివరించాను. ఆయన బాగా ఆలోచించి 'కూతురు కోడలు' అనే సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం ఇప్పించారు. దానికి దాసరి నారాయణ కథా రచయిత. అక్కడ ఆరు నెలలకు వచ్చిన జీతం రూ.50. ఇంత తక్కువ ఇస్తున్నారేంటని అడిగితే కొంత అవమానకరంగా మాట్లాడారు. అప్పుడు సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. నీ జీవితంలో హైదరాబాద్‌ చూడగలవా? అన్నారు. సరే అని సర్దుకుని పనిచేశాను. ఆవిధంగా నా సినీ జీవితం ప్రారంభమైంది.

'కన్నవారి కలలు' సినిమా టైటిల్స్‌లో మీ పేరు ఎమ్‌. భక్త చౌదరి అని ఉంటుంది. కదా?

మోహన్‌బాబు: నేను అన్ని కులాలను గౌరవిస్తాను. కానీ నా కులమే గొప్పది అనేదాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. నేను స్థాపించిన శ్రీవిద్యానికేతన్‌లో చేరాలంటే కులం ఉండకూడదు. దేశంలోనే కులాన్ని తొలగించిన మొదటి వ్యక్తిని.

మోహన్​బాబు

ఈ ఆలోచన మీకు వచ్చిందా? ఎవరైనా చెబితే వచ్చిందా?

మోహన్‌బాబు: నాకు కలిగిన ఆలోచనే. ఒకసారి కులం కారణంగా ఉద్యోగంలోంచి తీసేశారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. విద్యానికేతన్‌ ప్రారంభోత్సవానికి శివాజీ గణేషన్‌, చిరంజీవి వచ్చారు.

ఏ సంవత్సరంలో చేశారిదీ?

మోహన్‌బాబు: 1992లో.

అప్పుడు నేను ఎందుకు గుర్తులేను?

మోహన్‌బాబు: నువ్వూ గుర్తున్నావు. నువ్వు మంచి నటుడివని చెప్పడానికి గర్వపడతాను. అందులో సందేహం లేదు.

మీ నాన్న గారు చెప్పినట్లు వేయి ఎకరాలు సంపాదించారా?

మోహన్‌బాబు: లేదు. మంచి పేరు తెచ్చుకున్నాను.

మీరంటే భయంవల్లే చాలామంది గౌరవమిచ్చినట్లు నటిస్తారనేది ఎంత వరకు నిజం?

మోహన్‌బాబు: నిజం. నూటికి 99శాతం నిజమే.

హీరోగా మొదటి సినిమా మీ బ్యానర్‌లోనే చేశారు కదా?

మోహన్‌బాబు: కాదు. అంతకన్నా ముందే గురువు దాసరిగారు ‘కేటుగాడు’తో హీరోని చేశారు. ఆ తర్వాత ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన ‘గృహప్రవేశం’ చేస్తే 25 వారాలు ఆడింది. మూడో చిత్రంగా నా బ్యానర్లో ‘ప్రతిజ్ఞ’ చేశాను.

ఇప్పటి వరకు సినిమాల్లో ఎన్ని రేపులు చేసి ఉంటారు?

మోహన్‌బాబు: దీనికి సమాధానం చెప్పేముందు ‘సన్నాఫ్‌ ఇండియా’ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంది. ‘మామూలు వాడు రేప్‌ చేస్తే వెంటనే ఎన్‌కౌంటర్‌ చేస్తారు. మనమంతా శభాష్‌ అంటూ భుజాలు ఎగరేస్తాం. అదే బడాబాబులు, వాళ్ల బుడ్డబాబులు చేస్తే 24 ఏళ్లైనా న్యాయం జరగదు. దట్‌ ఈజ్‌ ఇండియా’. నిజజీవితంలో రేప్‌ అనే పదమే వినాలన్నా అసహ్యం. అది క్షమించరాని నేరం. సినిమాల్లో విలన్‌గా దాదాపు 100కుపైగా అలాంటి సన్నివేశాలుంటాయి. అయితే అది రేప్‌ కాదు. రేప్‌ చేసే ప్రయత్నాలు మాత్రమే.

‘సన్నాఫ్‌ ఇండియా’ చేయడానికి కారణం?

మోహన్‌బాబు: డైమండ్‌ రత్నబాబు చెప్పిన కథ నచ్చింది. ఛాలెంజింగ్‌గా చేశాను. భారతీయ సినీ చరిత్రలో ఎవరూ చేయని సాహసం చేశాను. 24 మంది ఆర్టిస్ట్‌లున్నారు. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. కులాలు, పురాణాల గురించి అర్థమయ్యే శైలిలో చూపించే ప్రయత్నం చేశాం.

దాసరి గారు ఏ ధైర్యంతో మిమ్మల్ని హీరోగా పెట్టారు?

మోహన్‌బాబు: మా గురువుగారు ఇప్పుడు లేరు. ఈ ప్రశ్నను ఆయన్నే అడగాల్సింది. విలన్‌గా, క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా పరిచయం చేసింది ఆయనే.

ఇద్దరబ్బాయిలను పరిచయం చేశారు. లక్ష్మి ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరు కారణం?

మోహన్‌బాబు: విష్ణు ప్రోత్సాహం వల్ల వచ్చింది. అమెరికా నుంచి వచ్చి తనేంటో నిరూపించుకుంది.

మీ ప్రతి సినిమాలో జేసుదాసు గారి పాట ఉంటుంది. ఇదేమైనా సెంటిమెంటా?

మోహన్‌బాబు: 1982 వచ్చిన ‘గృహప్రవేశం’తో జేసుదాసు పరిచయం అయ్యారు. అందులో పాడిన ‘దారి చూపిన దేవత’ పాటకు మంచి స్పందన లభించింది. ఆ గొంతు నాకు బాగుంటుందని ప్రతి సినిమాలో పాడించాను. నాకు మంచి సన్నిహితుడు. అలాగే బాలసుబ్రహ్మణ్యం, నేను ఒకే పాఠశాలలో చదువుకున్నాం. నన్నుశిశుపాల అని పిలిచేవాడు. ఆయన వెళ్లిపోవడం భారతదేశానికి తీర్చలేని లోటు.

లక్ష్మీకి మీరు నేర్పించిన పాఠమేంటి?

మోహన్‌బాబు: జీవితం ఇంతే అనుకుంటే నరకం, ఎంతో అనుకుంటే స్వర్గం అని చెప్పాను. అమ్మానాన్నలెవరైనా చనిపోతే వాళ్లు వాడిన వస్తువులను ఉంచకూడదని అంటారు. మరీ వారి సంపదననూ తాకకూడదు కదా!

ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్‌లతో కలిసి పనిచేశారు. వీరందరిలో కనిపించే కామన్‌పాయింట్‌?

మోహన్‌బాబు: అందరూ మంచివారే.

ఎవరు గొప్ప?

మోహన్‌బాబు: అన్నగారే గొప్పవాడవుతాడు. తారక్‌ ఎలా గొప్పవాడవుతాడు.

ఆర్జీవీకి మీకు ఎలా కుదిరింది?

మోహన్‌బాబు: ఆర్జీవీ తండ్రి నాకు సన్నిహితుడు. రామ్‌గోపాల్‌ వర్మను డైరెక్టర్‌గా బాగా ఇష్టపడతాను. టెక్నిషియన్‌గా ఆర్జీవీకి హాట్సాఫ్‌.

ఎస్వీ రంగారావు గారితో నటించారా?

మోహన్‌బాబు: ‘కత్తుల రత్తయ్య’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను.

తెలుగు భాష ఉచ్చారణ అద్భుతంగా ఉంటుంది. మీకిది పుట్టుకతో వచ్చిందా? ఎవరైనా నేర్పించారా?

మోహన్‌బాబు: వేషాలు అడుక్కుంటున్న రోజుల్లో ‘రాయలసీమ వాడివి. నీకు భాష తెలియదు’ అని అన్నారు. అన్నగారి(సీనియర్‌ ఎన్టీఆర్‌) సినిమాలు చూసి, పుస్తకాలు చదివి నాకూ భాష వచ్చని నిరూపించాను. కసి, పట్టుదల, దీక్షతో సాధించాను. తెలియదంటే ఒప్పుకోను.

ఈ ఒక్క ఎపిసోడ్‌లో మీ చరిత్ర మొత్తం చెప్పలేం. అందుకే మీ సినీ, జీవిత చరిత్రపై మరిన్ని విశేషాలతో వచ్చేవారం మళ్లీ కలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details