లోక్సభ ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ఓటెయ్యాలని ప్రజలను కోరారు ప్రముఖ రంగస్థల నటులు. ఈ మేరకు ఎన్డీఏ పాలనకు వ్యతిరేకంగా లేఖ రాశారు. మొత్తం 12 భాషల్లో 'ఆర్టిస్ట్ యునైట్ ఇండియా' వెబ్సైట్లో ఈ ఉత్తరాన్ని ప్రచురించారు. అమోల్ పాలేకర్, నసీరుద్దీన్ షా, గిరీశ్ కార్నాడ్, ఉషా గంగూలీతో కలిపి మొత్తం 600 మంది నటీనటులు ఈ లేఖపై సంతకాలు చేశారు. ఇప్పుడు జరగనున్న లోక్సభ ఎన్నికలుదేశ చరిత్రలో ఎంతో క్లిష్టమైనవిగా పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగుతోందని లేఖలో ఆరోపించారు. మతతత్వ, విద్వేషపూరిత, నిర్లక్ష్య వైఖరికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
ఉత్తరంలో ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శించారు రంగస్థల తారలు.
" ఆయన... తన ప్రభుత్వ విధానాలతో దేశంలోని ఎంతోమంది ప్రజల జీవితాలను నాశనం చేశారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. నల్లధనాన్ని తిరిగి తెస్తామని హామీ ఇచ్చారు. కానీ, అందుకు బదులుగా మోసగాళ్లు దేశాన్ని దోచుకుని పారిపోతున్నారు. దేశంలో ధనికుల సంపద గణనీయంగా పెరిగింది. పేదవారు మరింత పేదరికంలో మగ్గుతున్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, సమానత్వం, సామాజిక న్యాయం పెంపొందించేందుకు, అనాగరికతను ఓడించే దిశగా, స్వేచ్ఛను, వాతావరణాన్ని కాపాడుకునేందుకు, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించేందుకు, లౌకిక ప్రజాస్వామ్య భారతదేశాన్ని నిర్మించే దిశగా ఆలోచించి ఓటేయ్యాలని దేశ పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నాం."
- ఆర్టిస్ట్ యునైట్ ఇండియా వెబ్సైట్లోని లేఖ సారాంశం
సంతకాలు చేసిన మరికొంతమంది నటీనటులు వీరే
శాంతా గోఖలే, మహాష్ ఎల్ కుంచ్వారా, మహేశ్ దత్తానీ, అరుంధతీ నాగ్, క్రితి జైన్, అభిషేక్ మజుందార్, కొంకణా సేన్ శర్మ, రత్న ప్రతాప్ షా, లిల్లెట్టే దూబే, మితా వశిత, ఎంకే రైనా, మకరంద్ దేశ్పాండే, అనురాగ్ కశ్యప్ తదితర నటీనటులు ఈ లేఖపై సంతకాలు చేశారు.