పల్లెటూరు... పట్టణం.. నగరం.. మెగా సిటీ. ప్రాంతమేదైనా సరే! అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ.. మహిళెవరైనా సరే... ప్రతిఒక్కరినీ స్టార్‌ను చేసింది 'స్టార్ మహిళ' కార్యక్రమం. 2008లో ఈటీవీలో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. 2019 జనవరి 26న ముగిసింది. 11 ఏళ్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ బుల్లితెర సన్సేషన్.. 3,181 ఎపిసోడ్లతో భారత దేశంలోనే అతిపెద్ద రెండో ఆటల కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. ఇప్పుడీ 'స్టార్ మహిళ' చిన్న గ్యాప్ తర్వాత ఆగస్టు 17, సోమవారం నుంచి ఈటీవీలో తిరిగి ప్రారంభం కాబోతుంది. సుమ గలగల మాటలతో ప్రతి ఇళ్లూ మళ్లీ సందడిగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే కార్యక్రమ విశేషాలను, ఈ షోతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని 'ఈనాడు సినిమా'తో పంచుకుంది సుమ.
మీరిప్పటి వరకు ఎన్నో టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 'స్టార్ మహిళ' అనగానే మీకు ప్రత్యేకంగా అనిపించిందేంటి?
'స్టార్ మహిళ' దశాబ్ద కాలానికి పైగా కొనసాగింది. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో నన్ను ఎంతో మంది కుటుంబాలకు దగ్గర చేసింది ఈ ప్రోగామ్. ఇన్నేళ్ల పాటు వారంలో ఆరు రోజులు నన్ను చూస్తుండటం వల్ల ప్రతి ఒక్కరికీ నేను సొంతింటి మనిషిలా మారిపోయా. అంతకు ముందు నేను 'మహిళలు మహారాణులు'.. ఇతరత్రా కార్యక్రమాలతో అందరికీ తెలిసినప్పటికీ, నన్ను ప్రతి ఇంటి ఆడపడుచులా సుపరిచితం చేసింది ఈ కార్యక్రమమే. అందుకే నాకు 'స్టార్ మహిళ' చాలా ప్రత్యేకం.
'స్టార్ మహిళ' షోలో బాగా గుర్తుండిపోయిన మధురానుభూతులు?
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేనెంతో మంది మహిళల్ని నేరుగా కలుసుకోగలిగా. పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లయిన యువతులు, అమ్మలు, అమ్మలు, తాతమ్మలు.. ఇలా అనేక మందిని కలిశా. ఉద్యోగం చేసే మహిళలకు వృత్తితో పాటు మరో వ్యాపకమేదైనా ఉంటుంది. కానీ, ఇంట్లోనే ఉండే ఆడవాళ్ల దృష్టంతా భర్తకు ఎలాంటి వంటలు చేసి పెట్టాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి.. వంటి విషయాల చుట్టూనే తిరుగుతుంటుంది. అలాంటి వాళ్లు 'స్టార్ మహిళ' షోకు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉండటాన్ని చూశా. ఎందుకంటే వాళ్లలో చాలా మంది గాయకులు, డ్యాన్సర్లు ఉండొచ్చు. ఆ ప్రతిభను చూపించడానికి గతంలో ఎప్పుడూ అవకాశం రాకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్లంతా 'స్టార్ మహిళ' వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించినప్పుడు చాలా సంతోష పడటాన్ని స్వయంగా చూశా. కొంత మంది అమ్మాయిలకు ఈ 'స్టార్ మహిళ'లో చేసిన తర్వాత సంబంధాలు కుదిరాయట. ఇలా పెళ్లిళ్లయ్యాక తమ భర్తలతో కలిసి షోకు వచ్చిన వాళ్లున్నారు. చదువుకునే రోజుల్లో వచ్చి.. పెళ్లి తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్లను చూశా. అమ్మలుగా వచ్చిన వాళ్లు మళ్లీ అమ్మమ్మలుగా షోకు వచ్చిన వాళ్లున్నారు. ఇలా 'స్టార్ మహిళ'తో రెండు తరాల్ని చూశా (నవ్వుతూ).
ఇప్పుడు రెండో సీజన్లో ఎలాంటి లక్ష్యాలతో వస్తున్నారు?
నిజం చెప్పాలంటే.. 2008లో 'స్టార్ మహిళ'ను మొదలు పెట్టినప్పుడు 'ఇన్నేళ్ల పాటు కొనసాగించాలి, ఇన్ని ఎపిసోడ్లు చేయాలి' అనుకొని చేసింది కాదు. ఈటీవీలో ఉండే గొప్పతనం ఏంటంటే.. కొత్తగా ప్రారంభించే ఏ కార్యక్రమం విషయంలోనైనా అది పూర్తిగా ప్రేక్షకుల్లోకి చేరువయ్యే వరకు ఓపికగా ఎదురుచూస్తారు. ఎప్పుడూ ఒకే విధంగా చక్కగా కొనసాగిస్తారు. తొందర పాటు నిర్ణయాలు తీసుకొని షోలను అకస్మాత్తుగా రద్దు చేయరు. అలాగే ఈటీవీ షో టైమింగ్స్ విషయంలోనూ చక్కటి సమయపాలన కనిపిస్తుంటుంది. ఒక టైంలో వర్కవుటవ్వట్లేదని మరో టైంకు మార్చడం.. రోజుల్ని మార్చడం వంటి పనులతో ప్రేక్షకుల్ని ఎప్పుడూ గందరగోళానికి గురిచేయరు. ఇప్పుడు 'స్టార్ మహిళ సీజన్ 2' కోసం ఇలాంటి చక్కటి ప్రణాళికనే రూపొందించి ఉంచారు. మరి ఈసారి ఎన్నేళ్లు నడుస్తుందన్నది భగవంతుని ఆశీర్వాదాన్ని బట్టీ ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో.
ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి రౌండ్లు డిజైన్ చేశారు?