నటీనటులు:అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిశోర్, లక్ష్మి, రావు రమేశ్
దర్శకుడు:రాహుల్ రవీంద్రన్
సంగీతం:చైతన్య భరద్వాజ్
నిర్మాణ సంస్థలు:వయకామ్ 18 స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
తండ్రి బాటలోనే పయనిస్తూ టాలీవుడ్ మన్మథుడు అనిపించుకుంటోన్న అక్కినేని నాగార్జున నటించిన చిత్రం 'మన్మథుడు-2'. గతంలో వచ్చిన నాగార్జున హిట్ చిత్రం 'మన్మథుడు'కన్నా 'మన్మథుడు-2' పెద్ద విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఎంతో నమ్మకం పెట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
ఇదీ కథ
పోర్చుగల్‌లో స్థిరపడిన భారతీయ కుటుంబంలో సామ్ అలియాస్ సాంబశివరావు (అక్కినేని నాగార్జున)కు పెళ్లంటే పడదు. తల్లి, ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, బావలు ఉన్నా ఒంటరిగానే జీవితం గడుపుతుంటాడు. వయసు పెరుగుతున్నా పెళ్లికి దూరంగా ఉండటం వల్ల.. సామ్‌కు పెళ్లి చేయాలని తపన పడుతుంటారు అతడి కుటుంబ సభ్యులు. ఇది నచ్చని సామ్, ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో వెయిట్రెస్‌గా పనిచేస్తున్న అవంతిక (రకుల్ ప్రీత్ సింగ్)తో రెండు వారాలు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ ఒప్పందం ఏంటి, తన జీవితంలోకి వచ్చిన ఆమె నిజంగానే అలా చేసిందా? పెళ్లే వద్దనుకున్న అతడిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేదే ఈ చిత్ర కథ.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో కింగ్ నాగార్జున ఎలా ఉందంటే?
'గీతాంజలి' తర్వాత నాగార్జున నటించిన ఫీల్ గుడ్ ప్రేమకథ చిత్రం 'మన్మథుడు'. కానీ ఆ సినిమాకు, దీనికి ఎక్కడా సంబంధం లేదు. ఈ కథంతా పోర్చుగల్‌లో జరుగుతుంటుంది. ప్రథమార్థం నాగార్జున, వెన్నెల కిశోర్‌ల హాస్యంతో సాగిపోగా... ద్వితీయార్థం సామ్, అవంతికల ఒప్పందంతో సాగుతుంది. ఇందులో ద్వందార్థాలతో కూడిన సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినా... నాగార్జున నుంచి అలాంటి డైలాగులు ఊహించరు.
వైద్యులు, ప్రతిపాదన, ఒప్పందం, శుభ మధ్యాహ్నం లాంటి తెలుగు పదాలు ఫ్రెంచ్ భాష మధ్య నలిగిపోయాయి. ఆరు పదుల వ్యక్తిని పాతికేళ్ల అమ్మాయి ఎలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనేది చెప్పడానికి పోర్చుగల్ వరకు వెళ్లిన దర్శకుడు.. రియాల్టీ షోను చిత్రీకరించినట్లు కనిపిస్తుంటుంది.
మన్మథుడు-2 సినిమాలోని ఓ సన్నివేశంలో నాగార్జున ఎవరెలా చేశారు?
సామ్ అలియాస్ సాంబశివరావుగా నటించిన నాగార్జున... ఆరు పదులు దాటినా ఇంకా తనలోని యవ్వనపు ఛాయాలు పోలేదని గుర్తుచేస్తుంటాడు. ముద్దులకు వయసుతో పనిలేదని చెప్పిన నాగ్... హద్దులన్నీ చెరిపేసి పోర్చుగల్‌లో రెచ్చిపోయాడు. దర్శకుడు రాహుల్.. టైటిల్ కు తగినట్లుగానే ఆ కోణంలో పలు సన్నివేశాలను తీర్చిదిద్దాడు.
అవంతికగా రకుల్... నాగ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా నటించింది. తన పాత్రకు న్యాయంచేసేందుకు ప్రయత్నించింది.
'నిన్నే పెళ్లాడతా' తర్వాత నాగార్జున తల్లిపాత్రలో సీనియర్ నటి లక్ష్మి మెప్పించారు. సినిమాలో నాగార్జున పాత్రకు వ్యక్తిగత సహాయకుడిగా నటించిన వెన్నెల కిశోర్ నటన.. మన్మథుడు-2కు ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, సమంత, బ్రహ్మానందం అతిథి పాత్రల్లో కనిపించడం విశేషం.
బలాలు
మాటలు
వెన్నెల కిశోర్ నటన
బలహీనతలు
కథ
కథనం
సంగీతం
గమనిక: ఇది సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది. ఇది అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.