చిత్రం: జాతిరత్నాలు; నటీనటులు: నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ తదితరులు; సంగీతం: రధన్; నిర్మాత: నాగ్ అశ్విన్; దర్శకత్వం: కె.వి. అనుదీప్; నిర్మాణ సంస్థ: స‌్వప్న సినిమా; విడుదల తేదీ: 11-03-2021
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో హీరోగా తొలి అడుగులోనే అందరి దృష్టినీ ఆకర్షించారు నటుడు నవీన్ పొలిశెట్టి. ఆ సినిమాలో ఫన్నీ ఏజెంట్‌గా తనదైన కామెడీ టైమింగ్‌తో ఆయన పంచిన వినోదం సినీ ప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది. అందుకే ఇప్పుడాయన్ని 'జాతిరత్నాలు' చిత్రంతో మరోసారి నవ్వులు పంచే రత్నంలా చూపించే ప్రయత్నం చేశారు నాగ్ అశ్విన్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ వంటి వైవిధ్యభరిత చిత్రాలతో జాతీయ స్థాయిలో మెరిసిన దర్శకుడాయన. ఈ సినిమా కోసం నిర్మాతగా మారారు. కె.వి.అనుదీప్ దర్శకుడిగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు వినోదభరితంగా ఉండటం వల్ల సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి మహాశివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియులకు ఏమేర నవ్వించింది? నాగ్ అశ్విన్ నిర్మాతగా తొలి విజయాన్ని అందుకున్నారా? నవీన్ ఖాతాలో మరో విజయం చేరిందా?
కథేంటంటే:శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి), శేఖర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ) చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. తమను తాము తెలివైన వాళ్లమని భావించుకునే తింగరి కుర్రాళ్లు. జోగీపేటలో అల్లరి చిల్లరగా తిరుగుతూ జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటారు. లైఫ్‌లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్లతో ఛాలెంజ్ చేసి జోగిపేట నుంచి హైదరాబాద్‌కు వస్తారు. కానీ, ఇక్కడికి వచ్చాక అనుకోని పరిస్థితుల్లో వాళ్ల జీవితాలు పెద్ద సమస్యలో చిక్కుకుంటాయి. స్థానిక ఎమ్మెల్యే చాణక్య (మురళి శర్మ)పై జరిగిన హత్యాయత్నం కేసులో ఈ ముగ్గురు అన్యాయంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మరి ఆ మర్డర్ కేసులో ఈ ముగ్గురిని ఇరికించిందెవరు? ఈ కేసు నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? మధ్యలో చిట్టి - శ్రీకాంత్ ప్రేమకథ ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: కథగా చెప్పుకోవాలంటే ఇది చాలా చిన్నలైన్. ముగ్గురు సిల్లీఫెలోస్‌ని ఓ పెద్ద క్రైంలో ఇరికిస్తే ఏమవుతుంది? దాని వాళ్లెలా బయటపడ్డారు? అన్నది అసలు కథ. ఆరంభం నుంచి ముగింపు వరకూ సినిమా ఆద్యంతం వినోదం పంచడమే లక్ష్యంగా కొనసాగుతుంటుంది. అలాగని కథలో ఎక్కడా బలవంతంగా ఇరికించిన కామెడీ ట్రాక్‌లు ఉండవు. శ్రీకాంత్, శేఖర్, రవిల పాత్రల్ని దర్శకుడు తీర్చిదిద్దుకున్న విధానంలోనే చక్కటి వినోదం నిండి ఉంటుంది. అమాయకత్వంతో నిండిన అవతారాలతో తింగరి పనులు చేస్తూ వాళ్లు పంచే వినోదం ప్రేక్షకుల్ని కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఆరంభంలో ఈ ముగ్గురి పాత్రల్ని పరిచయం చేస్తూ వచ్చే సన్నివేశాలతో దర్శకుడు ప్రేక్షకుల్ని మెల్లగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ముగ్గురూ హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగే ప్రతి ఎపిసోడ్ సరదాగా సాగిపోతుంటుంది. శ్రీకాంత్ తొలి చూపులోనే చిట్టిని ఇష్టపడటం.. అతని అమాయకమైన చేష్టలకు ఆమె కూడా ప్రేమించటం.. ఈ నేపథ్యంలో చిట్టి తండ్రికి శ్రీకాంత్‌కీ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో ఎలాంటి మలుపులు లేకుండా కథను ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. ముఖ్యంగా వచ్చీరాని ఇంగ్లీష్ మాట్లాడుతూ నవీన్ చేసే హంగామా.. ఫోన్‌లో సువర్ణ అనే గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ రాహుల్ చేసే అల్లరి.. మధ్య మధ్యలో వంట పేరుతో ప్రియదర్శి పంచే నవ్వులు అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఎమ్మెల్యేపై హత్యాయత్నంతో విరామ ముందు కథను మలుపు తిప్పాడు దర్శకుడు.
ప్రథమార్ధంలో నవ్వులు పంచుతూనే కథను పరుగులు పెట్టించిన దర్శకుడు.. ద్వితీయార్ధంలో ఆ నవ్వుల సందడిలో పడి కథను పూర్తిగా పక్కదారి పట్టించాడనిపిస్తుంది. ముఖ్యంగా సీరియస్ సాగాల్సిన చాలా ఎపిసోడ్లను సరదాగా, లాజిక్కులకు దూరంగా నడిపించేశాడు. అయితే ఓవైపు కథ గాడి తప్పినట్లు అనిపిస్తున్నా.. నవీన్, రాహుల్, దర్శిలు పంచే వినోదంలో ఆ లాజిక్కులు పెద్దవిగా కనిపించవు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఇంట్రాగేషన్ సీన్‌లో, క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సన్నివేశాల్లో నవీన్ కామెడీ టైమింగ్ అందరినీ కట్టిపడేస్తుంది. నిజానికి సీరియస్‌గా సాగాల్సిన ఈ సన్నివేశాల్ని కాస్త పకడ్బందీగా రాసుకునే ప్రయత్నం చేస్తే ద్వితీయార్ధం, క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉండేవి.