నటీనటులు: ఆశిష్, అనుపమ పరమేశ్వరన్, విక్రమ్ సహిదేవ్, కార్తిక్ రత్నం, కోమలీ ప్రసాద్ తదితరులు; సంగీతం:దేవిశ్రీ ప్రసాద్; దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి; నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్; విడుదల తేదీ: 14-01-2022.
సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో కుటుంబ కథా చిత్రాలు, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల హంగామానే ఎక్కువ కనిపిస్తుంది. కానీ, ఈ పెద్ద పండక్కి ‘రౌడీబాయ్స’ రూపంలో ఓ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ కూడా ప్రేక్షకుల్ని పలకరించింది. ‘హుషారు’ వంటి విజయం తర్వాత శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాతోనే ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమయ్యారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. యువతరం మెచ్చే కాలేజీ నేపథ్య కథాంశంతో రూపొందిన సినిమా కావడం.. అందుకు తగ్గట్లుగానే పాటలు, ప్రచార చిత్రాలు ఊరించేలా ఉండటం వల్ల సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏమేర అందుకుంది. ఆశిష్‌కు హీరోగా తొలి ప్రయత్నంలోనే విజయం దక్కిందా?
కథేంటంటే..
ఏ బాధ్యతా తెలియని, జీవితం పట్ల ఓ స్పష్టత లేని కుర్రాడు అక్షయ్ (ఆశిష్). లెగసీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతుంటాడు. కాలేజీలో చేరిన తొలిరోజే కావ్య (అనుపమ పరమేశ్వరన్)ను చూసి మనసు పారేసుకుంటాడు. కానీ, కావ్య మెడికల్ స్టూడెంట్. ఆశిష్ చదువుతున్న ఎదురు కాలేజీలోనే చదువుతుంటుంది. అయితే ఆ రెండు కాలేజీల విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ నడుస్తుంటుంది. ఎప్పుడు ఎదురు పడినా కొట్టుకుంటూనే ఉంటారు. కావ్య క్లాస్‌మేట్ విక్రమ్ (విక్రమ్ సహిదేవ్) కూడా ఆమెను ప్రేమిస్తుంటాడు. కావ్యను అక్షయ్ ఇష్టపడుతున్నాడని తెలిశాక.. విక్రమ్ అతడిపై పగ సాధించే ప్రయత్నం చేస్తాడు. ఓరోజు రహస్యంగా మెడికల్ కాలేజీలోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన అక్షయ్‌ను పట్టుకొని కొడతాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కావ్య, అక్షయ్‌తో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండేందుకు అంగీకరిస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? వాళ్ల ప్రేమకు ఎలాంటి సవాళ్లెదురయ్యాయి? ఆఖరికి ఈ రౌడీబాయ్స్ కథలు ఏ కంచికి చేరాయి? అన్నది తెరపై చూడాలి.
ఎలా సాగిందంటే
కాలేజీ కథలకు సినీప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రేమదేశం నుంచి హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం చిత్రాల వరకూ ఈ తరహా కథాంశాలతో రూపొంది.. బాక్సాఫీస్ ముందు ఘన విజయాల్ని అందుకున్న చిత్రాలు అనేకం ఉన్నాయి. కొత్త కథానాయకుల్ని తెరకు పరిచయం చేయడానికి ఇదొక బెస్ట్ జానర్. అందుకే దిల్ రాజు తన కుటుంబ వారసుడిని పరిచయం చేయడానికి ఈ కాలేజీ కథాంశాన్నే ఎంచుకున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన కాలేజీ కథల్లాగే ఇదీ ఇంచుమించు ఒకే నేపథ్యంలో సాగుతుంటుంది. అల్లరి చిల్లరగా తిరిగే ఓ ఇంజినీరింగ్ విద్యార్థి.. తన కంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయితో ప్రేమలో పడటం.. ఈ క్రమంలో ఆమెని తన వైపు తిప్పుకోవడానికి రకరకాల వేషాలు వేయడం.. ఇలా సరదాగా సాగిపోతుంటుంది. ఇందులో ఉన్న కొత్తదనమేంటంటే.. ఆ ప్రేమకథకు రెండు కాలేజీల మధ్య సాగే గ్యాంగ్ వార్ నేపథ్యం. సినిమా ప్రథమార్ధమంతా వీటి చుట్టూనే సాగుతుంది. ఆరంభంలో ఆశిష్ పాత్రను పరిచయం చేసిన తీరు చాలా సింపుల్‌గా ఉంది. కాలేజీలోకి ఎంట్రీ ఇస్తూనే.. కావ్యను చూసి ఇష్టపడటం.. ఆ వెంటనే ప్రేమ లేఖ ఇవ్వడం.. ఈ క్రమంలో ఇరు కాలేజీ విద్యార్థులకు మధ్య గొడవ జరగడం.. వంటి సన్నివేశాలతో కథ చకచకా పరుగులు తీస్తుంటుంది. అయితే కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, కావ్యను ఇంప్రెస్ చేసేందుకు ఆశిష్ చేసే ప్రయత్నాలు అంత ఆసక్తికరంగా అనిపించవు. ఎందులోనూ సరైన ఫీల్ కనిపించదు. దీనికి తోడు కథనమంతా ఊహలకు తగ్గట్లుగా సాగిపోతుంటుంది. కావ్య, అక్షయ్‌తో కలిసి డేట్ నైట్‌కు వెళ్లిందని తెలిశాక.. విక్రమ్‌కు, అక్షయ్‌కు మధ్య నడిచే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. విరామానికి ముందు అక్షయ్‌పై విక్రమ్ గ్యాంగ్ దాడి చేయడం.. కావ్య, అక్షయ్‌తో లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉండేందుకు అంగీకారం తెలపడంతో ద్వితీయార్ధం ఏం జరగబోతుందా? అన్న ఆసక్తి పెరుగుతుంది.
ప్రథమార్ధమంతా కాస్తో కూస్తో కాలక్షేపాన్నిస్తూ సాగిన కథనం.. ఆ తర్వాత సాగతీత వ్యవహారంలా మారిపోతుంది. లివ్-ఇన్ రిలేషన్‌లో భాగంగా కావ్య, అక్షయ్‌ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు యువతరానికి నచ్చేలా ఉంటాయి. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ కాస్త అతిగా అనిపిస్తుంది. కావ్యను చదివించడం కోసం అక్షయ్ ఓ ఆర్కెస్ట్రాలో జాయిన్ అవడం.. ఈ క్రమంలో వచ్చే పాటల సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ముగింపునకు ముందు కావ్య తండ్రికిచ్చిన మాట కోసం అక్షయ్ ఆమెను వదిలి పెట్టడం.. ఈ క్రమంలో వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. ఇక చివర్లో కావ్య, అక్షయ్ తిరిగి కలిసిన తీరు మరీ రొటీన్ వ్యవహారంలా కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే:
అక్షయ్ పాత్రలో ఆశిష్ చక్కగా ఒదిగిపోయాడు. తొలి సినిమా అయినా నటనలో పరిణతి కనబర్చాడు. డ్యాన్సులు, ఫైట్‌లు మంచి ఈజ్‌తో చేశాడు. కావ్య పాత్రలో అనుపమ ఎంతో అందంగా కనిపించింది. ద్వితీయార్ధంలో ఆమె పాత్ర కాస్త బోల్డ్‌గా కనిపించింది. ముద్దు సన్నివేశాల్లో మొహమాటం లేకుండా చెలరేగిపోయింది. విరామానికి, క్లైమాక్స్‌కు ముందొచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన నటనతో చెలరేగిపోయింది. విక్రమ్ పాత్రలో సహిదేవ్ చక్కగా నటించాడు. కార్తిక్ రత్నం, తేజ్ కూరపాటి, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ పాత్రలు పరిధి మేర ఆకట్టుకుంటాయి. శ్రీహర్ష రాసుకున్న కథలో కాస్త కొత్తదనమున్నా.. దాన్ని మనసులకు హత్తుకునేలా ఆవిష్కరించగలగడంలో తడబడ్డాడు. కాలేజీ నేపథ్యంలో వచ్చే గ్యాంగ్ వార్ సన్నివేశాల్ని ఆకట్టకునేలా తెరకెక్కించాడు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం. కాలేజీ నేపథ్యానికి తగ్గట్లుగా మది ఛాయాగ్రహణం బాగుంది. ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సింది. కథకు తగ్గట్లుగా నిర్మాణ విలువలు బాగున్నాయి.