"యువతకు దేహ దారుఢ్యంతో పాటు మానసిక బలం చేకూరేందుకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయి. వీటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరం" అని చెప్పారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. శుక్రవారం నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు, పలు గిన్నిస్ బుక్ రికార్డులు సాధించిన ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సత్కరించారు.
"మన దేశంలోనూ పలు సంప్రదాయ యుద్ధ కళలు ఉన్నాయి. వాటితోపాటు పలు ఆసియా దేశాల మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి వీటిని బాలబాలికలకు నేర్పిస్తే ఆత్మ రక్షణతో పాటు మనోస్థైర్యంగా ఇవి ఉపయోగపడతాయి. 'వింగ్ చున్' అనే మార్షల్ ఆర్ట్ మన దేశంలో ఉన్న శిక్షకుల గురించి బ్రౌజ్ చేస్తుంటే ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ వివిధ దేశాల్లో శిక్షణ పొంది, రికార్డులు సాధించిన ప్రభాకర్ పెద్ద నగరాలకు వెళ్లిపోకుండా తన ఊరిలోనే ఉంటూ యువతకు శిక్షణ ఇవ్వడం సంతోషం. ఇలాంటి వారిని మనం ప్రోత్సహించాలి. ఈ క్రమంలోనే మా ట్రస్ట్ ద్వారా ఆయనకు ఆర్థిక తోడ్పాటు అందించాం" అని పవన్ కల్యాణ్ తెలిపారు.