అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ 2021 బరిలో మలయాళ చిత్రం 'జల్లికట్టు' నిలిచింది. 2019లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ దక్కించుకుని.. భారత్ తరపున ఆస్కార్ రేసుకు చేరింది. ఈ చిత్రాన్ని ఇప్పటికే బుసాన్ ఫిల్మ్ఫెస్టివల్ సహా టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శించారు. 'జల్లికట్టు' సినిమా ఉత్తర అమెరికా హక్కులను ప్రస్తుతం XYZ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆస్కార్ వేదికగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలనూ ఇదే సంస్థ నిర్వహించనుంది.
కథేంటంటే!
కేరళలోని ఒక మారుమూల అటవీ గ్రామంలో ఈ కథ నడుస్తుంది. అక్కడ అంటోని అనే కసాయి ఉంటాడు. ఊరంతా అతడి దగ్గరే గేదె మాంసాన్ని కొంటుంటారు. ఇలా నరికేందుకు తెచ్చిన ఓ నాటు దున్న భయంతో తప్పించుకోవడం వల్ల ఊరంతా గందరగోళం రేగుతుంది. ఊర్లో పంటలను నాశనం చేస్తూ, అడ్డొచ్చిన వారిని తన కొమ్ములతో కుమ్మేస్తూ పరుగులు పెడుతుంది. ఆ గ్రామంలో రేగిన అలజడిని అదుపు చేసేందుకు పోలీసులు వస్తారు. ఇళ్లలోంచి ప్రజలు ఆ దున్నను పట్టుకునేందుకు గుంపులుగా బయటకొచ్చి చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దాన్ని పట్టుకునే క్రమంలో కుట్టచ్చాన్, ఆంటోనిల మధ్య ఆధిపత్య పోరు చెలరేగుతుంది. బృందాలుగా విడిపోయి వారు చేసే ప్రయత్నాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. వీరంతా కలిసి ఆ దున్నను పట్టుకున్నారా? లేదా? అన్నది మిగతా కథ.