అమ్మగా.. గృహిణిగా.. కుమార్తెగా ఇలా మహిళలు కేవలం ఇంటి బాధ్యతలకే కాకుండా ఉద్యోగినిగా ఎన్నో రంగాల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు. పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. ఇక, సినీపరిశ్రమ విషయానికొస్తే తెరపైన నటీమణులుగా రాణిస్తున్న ఎంతోమంది మహిళలను మనం చూస్తున్నాం. వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే, కేవలం తెరపై నటిగానే కాకుండా తెర వెనుక వివిధ విభాగాల్లోనూ నారీమణులు కీలకపాత్ర పోషిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దర్శకత్వం, నిర్మాణ, సంగీతం.. ఇలా పలు విభాగాల్లో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న నారీశక్తి గురించి తెలుసుకుందాం..!
మహానటి..!
సావిత్రి, సౌందర్య, సమంత, కీర్తిసురేశ్.. ఇలా చెప్పుకొంటూ వెళ్తే ఎంతోమంది మహిళలు ముఖానికి రంగులద్దుకుని వెండితెర వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా కథానాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనూ నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతి నాయకురాలిగా సినీ ప్రియుల మదిలో చెరగని ముద్ర వేస్తున్నారు. అలా, ఈ మధ్యకాలంలో ప్రతినాయకురాలి పాత్రల్లో మెప్పించి.. తన నటనతో ఈలలు వేయిస్తున్నారు నటి వరలక్ష్మి శరత్‌కుమార్.
కెప్టెన్స్ ఆఫ్ ది షిప్..
దర్శకుడి శక్తి సామర్థ్యాలపై సినిమా ఆధారపడి ఉంటుంది. అందుకే డైరెక్షన్ అంత సులభం కాదు అంటుంటారు. అలాంటి కీలకరంగంలోనూ మహిళలు మెప్పిస్తున్నారు. దర్శకురాలిగా మారి సినిమాలు తీర్చిదిద్దుతున్నారు. అలనాటి తారలు సావిత్రి, విజయ నిర్మలా, భానుమతి దర్శకత్వ రంగంలోనూ రాణించి వాళ్లే. అలాగే, ఈ మధ్యకాలంలో దివంగత దర్శకురాలు బి.జయ, నందినిరెడ్డి, సుధా కొంగర తమ సినిమాలతో సినీ విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల సుధాకొంగర దర్శకత్వం వహించిన ‘ఆకాశం నీ హద్దురా’ వివిధ విభాగాల్లో ఆస్కార్ స్క్రీనింగ్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
లచ్చిందేవిలు..!
సినీ నిర్మాణమనేది ఎన్నో కష్టనష్టాలతో కూడుకున్న వ్యవహారం. బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కొన్నిసార్లు అనర్థాలు తప్పవు. అలాంటి క్లిష్టమైన ఆర్థిక అంశాల్లోనూ మేము తక్కువకాదు అంటున్నారు కొంతమంది నారీమణులు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని పరిశ్రమలోకి వచ్చిన స్వప్నాదత్, ప్రియాంక దత్.. 'మహానటి'తో నిర్మాతలుగా భేష్ అనిపించారు. నటుడు నాగశౌర్య తల్లి ఉషా సైతం నిర్మాతగా రాణిస్తున్నారు. ఇక, కంగనా రనౌత్, దీపికా పదుకొణె, అవికాగోర్‌లు నిర్మాతలుగా మారారు. చిరు కుటుంబం నుంచి సుస్మిత, అక్కినేని కుటుంబం నుంచి సుప్రియ కూడా నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటున్నారు.
నటరాజు ముద్దుబిడ్డలు..!
డ్యాన్స్ అనగానే మనందరికీ ప్రభుదేవా, లారెన్స్.. ఇలా ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లు గుర్తుకువస్తారు. వాళ్ల నుంచి స్ఫూర్తి పొందిన కొంతమంది మహిళా డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. బృందా, యానీ మాస్టర్లు ఇటీవల కాలంలో తమ స్టెప్పులతో ప్రేక్షకుల్ని మెప్పించారు.
తాళం.. పల్లవి..!
సంగీతం విషయానికి వస్తే జానకి, సుశీల, వాణీ జయరామ్, లతా మంగేష్కర్ ఇలా ఎంతో మంది గాయనీ మణులు తమ పాటలతో సంగీత ప్రియుల్ని అలరించారు. ఇప్పటికాలంలో చిత్ర, సునీత, శ్రేయాఘోషల్, అంజనా సౌమ్య, రమ్య బెహరా, మంగ్లీ, గీతా మాధురి ఇలా ఎంతోమంది సింగర్స్ తమ స్వరంతో యువతను ఆకర్షిస్తున్నారు. స్మిత, ఎం.ఎం.శ్రీలేఖ.. కేవలం సింగర్స్ గానే కాకుండా కంపోజర్స్‌గా కూడా అలరిస్తున్నారు.
ఇవి మాత్రమే కాకుండా క్యాస్టూమ్స్ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు ఆయన సతీమణి రమా రాజమౌళి. కీరవాణి సతీమణి వల్లి కూడా రాజమౌళి చిత్రాలకు సంబంధించి కీలక బాధ్యతలు చూసుకుంటారు. ఇక సెలబ్రిటీ డిజైనర్ నీతూలుల్లా గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఎంతో మంది మహిళలు తెరపైనే కాకుండా తెర వెనుక కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ పురుషులకు దీటుగా అడుగులు వేస్తున్నారు.
ఇదీ చూడండి: రిలీజ్‌కు రెడీగా ఉన్న లేడి ఓరియేంటెడ్ మూవీస్ ఇవే