సినిమా రంగంలో పనిచేసే మహిళలు అనగానే ఒకప్పుడు చిన్నచూపు ఉండేది. నేటికీ కొందరిలోనూ ఉంది. చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లను సినిమా రంగంలోకి పంపడానికి జంకుతారు. ఇప్పుడు కాస్త ఆ పరిస్థితి మారింది. తారలు గౌరవంగా ఉండే స్థాయికి చేరుకున్నారు.
ఆమెకూ ప్రాధాన్యం...
ఒకప్పుడు సినిమా తారల పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవుట్ డోర్ షూటింగ్లకి వెళ్లినపుడు వాష్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ కూడా లేని పరిస్థితి ఉండేదని సీనియర్ కథానాయికలు ఎందరో చెప్పారు. కానీ నేటి తారలకు ఆ దుస్థితి లేదు. హీరోయిన్లు కొన్ని సౌకర్యాలను ధైర్యంగా అడగగలుగుతున్నారు. వారి గౌరవానికి భంగం కలగకుండా పనిచేసే స్థాయికి ఎదిగారు. నాడు స్టార్‌డం అంటే కేవలం హీరోలకే మాత్రమే ఉండేది. తెరపై, తెర వెనుక కథానాయకులకే అధిక ప్రాధాన్యం ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. హీరోయిన్లకు ప్రాధాన్యం ఉన్న ఎన్నో పాత్రలను తెరపై చూడొచ్చు.
వెన్నుల్లో వణుకు పుట్టించే 'మీటూ'
తార అనగానే పబ్లిక్ ఫిగర్ అనేకునే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇక వాళ్లతో పనిచేసే వ్యక్తుల నుంచి చేదు అనుభవాలు ఎదుర్కొన్న పరిస్థితులను ఎందరో కథానాయికలు తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మారింది. గౌరవంగా ఉంటూ సినిమాల్లో సంతోషంగా నటిస్తున్నారు. కథానాయిక తను పాత్రను తాను నిర్ణయించుకునే స్థాయికి చేరింది. తనకు నచ్చని సన్నివేశాలను నిరభ్యంతరంగా తిరస్కరిస్తోంది. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాటిని పంచుకోవడానికి అనేక వేదికలొచ్చాయి. మీ టూ వంటి ఉద్యమాలు హీరోయిన్లను వంకరగా చూసే వారి వెన్నులో వణుకు పుట్టించాయని చెప్పొచ్చు.