తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​ సినిమా ఫ్లాప్​పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..!

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు కెరీర్​లో ఓ సినిమా ఊహించని ఫలితాన్నిచ్చింది. అప్పటికే ఎన్నో విజయాలు ఖాతాలో వేసుకున్న ప్రిన్స్​.. ఆ చిత్ర ఫలితం చూసి కంగుతిన్నాడు. ఈ విషయంపై తాజాగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు దర్శకుడు తేజ.

మహేశ్​ సినిమా ఫ్లాప్​పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..!

By

Published : Oct 12, 2019, 2:29 PM IST

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు విలక్షణ నటనతో పేరుతెచ్చుకున్న చిత్రం 'నిజం'. తేజ దర్శకత్వం వహించాడు. 'ఒక్కడు' వంటి బ్లాక్​ బస్టర్​ తర్వాత విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే బాక్సాఫీస్​ వద్ద నిరాశపర్చింది.

తండ్రి చావుకు కారణమైన అవినీతి, లంచగొండి అధికారులు, సంఘ విద్రోహ శక్తులను తల్లి ప్రోత్సాహంతో... సీతారాం అనే యువకుడు ఎలా అంతమొందించాడనేదే ఈ చిత్ర కథాంశం.

ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయినా మహేశ్‌ నటనకు బాగా ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నాడు ప్రిన్స్​. అయితే సినిమా ఫ్లాప్‌ కావడానికి కారణాలను ఓ సందర్భంలో వెల్లడించాడు దర్శకుడు తేజ.

" మహేశ్‌బాబు కాకుండా ఇంకెవరైనా కొత్త కుర్రాడు అయితే 'నిజం' బాగా ఆడేదేమో. అయితే ఫ్లాప్‌ కావడానికి మహేశ్‌ కారణం కాదు. ఎందుకంటే ఈ సినిమా కన్నా ముందు వచ్చిన 'ఒక్కడు' భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఆయనకు ఒక కమర్షియల్‌ ఇమేజ్‌ వచ్చింది. ఆ తర్వాత నిజం విడుదల కావడం వల్ల ఈ సినిమా ఆ స్థాయిని అందుకోలేకపోయింది". --తేజ, సినీ దర్శకుడు

'నిజం'లో మహేశ్​బాబు కాకుండా వేరే నటుడు ఎవరైనా అయితే సూపర్​స్టార్​ అంత ప్రదర్శన ఇవ్వలేకపోయేవారని మరో అభిప్రాయం వ్యక్తం చేశాడు తేజ.

"నిజం సినిమా మహేశ్‌బాబు కాకుండా వేరే నటుడితో తీస్తే ఎవరూ ఆ స్థాయిలో నటించే వారు కాదు. కొత్తవారి నుంచి అంత నటన రాబట్టుకోవడం కష్టం. మహేశ్‌బాబు నటనకు ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతా. కానీ ప్రిన్స్​కు వచ్చిన స్టార్‌డమ్‌ కారణంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఎక్కలేదు".--తేజ, సినీ దర్శకుడు

'బాబి' తర్వాత 'నిజం' కోసం మహేశ్‌ను ఎంపిక చేసినట్లు తేజ చెప్పాడు. ఈ రెండింటి మధ్యలో 'ఒక్కడు' వచ్చింది అన్నింటినీ మార్చేసిందని అభిప్రాయపడ్డాడు. ఆ సినిమా వల్లే మహేశ్​కు కమర్షియల్‌ ఇమేజ్‌ పెరిగిందన్నాడు. తప్పు తనదీ కాదు, మహేశ్‌బాబుదీ కాదని చెప్పిన ఈ ప్రముఖ దర్శకుడు.... ప్రేక్షకుల దృష్టిలో ప్రిన్స్​ పెద్ద హీరో అయిపోవడమే కారణమని తెలిపాడు. ఇదే మా పాలిట దురదృష్టంగా మారిందని అన్నాడు తేజ.

ABOUT THE AUTHOR

...view details