ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మనిషికి.. మనిషిలోని మృగానికి యుద్ధమే 'జల్లికట్టు' - లిజో జోస్‌ పెల్లిసరీ

'జల్లికట్టు' చిత్రం అందరి అంచనాలకు పక్కకు నెట్టి భారతదేశం నుంచి ఆస్కార్​కు ఎంపికైంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం అకాడమీ అవార్డుల రేసుకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా 'జల్లికట్టు' సినిమా గురించి కొన్ని ప్రత్యేక విశేషాలను తెలుసుకుందాం.

Why Lijo Jose's Jallikattu deserves to be India's Oscars 2021 entry
మనిషికి.. మనిషిలోని మృగానికి యుద్ధమే 'జల్లికట్టు'
author img

By

Published : Nov 27, 2020, 1:08 PM IST

Updated : Nov 27, 2020, 1:17 PM IST

సినిమా:జల్లికట్టు

దర్శకుడు: లిజో జోస్‌ పెల్లిసరీ

విడుదల: 2019

నటీనటులు: ఆంటోని వర్గీస్‌, చెంబన్‌ వినోద్‌, సబుమన్‌ అబ్దుసమద్‌, శాంతి బాలచంద్రన్‌ తదితరులు

నిడివి:1 గంట 31 నిమిషాలు

ఎక్కడ చూడొచ్చు:అమెజాన్‌ ప్రైమ్‌(మలయాళం), ఆహా(తెలుగు)

భారత్‌ నుంచి ఆస్కార్‌కు వెళ్లిన 'జల్లికట్టు' సినిమాను మలయాళ దర్శకుడు లిజో జోస్‌ పెల్లిసరీ తెరకెక్కించారు. గతంలో ఆయన తీసిన 'అంగమలి డైరీస్‌', 'ఈమాయు' చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. 2019లో విడుదలయిన 'జల్లికట్టు' మానవుడిలో అంతర్లీనంగా దాగి ఉన్న మృగాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. దీనికి కథను అందించింది ఎస్‌. హరీశ్​. ఆయన రాసిన చిన్న కథ ఆధారంగానే జల్లికట్టు తెరకెక్కింది. చెప్పాలంటే ఇది దర్శకుడి ఒక్కడి సినిమానే కాదు. ప్రేక్షకులను దున్నపోతు వెంట పరిగెత్తేలా చేసిన కెమెరామెన్‌ గిరీశ్​ గంగాధరన్‌, ఆ రాత్రి చీకటిలో అడవిలోని రహస్య శబ్దాలను, జంతువులు, కీచురాళ్లు, క్రిమికీటకాల ధ్వనులను స్పష్టంగా వినిపిస్తూనే, అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించిన ప్రశాంత్‌ పిల్లైలకూ ఇందులో సమానమైన అర్హత ఉంటుంది. విడుదలకు ముందే పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శనలకు ఎంపికై సత్తా చాటిన 'జల్లికట్టు'.. ఇప్పుడు మన దేశం నుంచి ఆస్కార్‌ బరిలోకి దిగబోతోంది. ఆ సినిమాలోని దర్శకుడు చెప్పిన కథేంటీ.. అసలు ఏం చెప్పే ప్రయత్నం చేశాడో చూద్దాం.

కథేంటంటే!

కేరళలోని ఒక మారుమూల అటవీ గ్రామంలో ఈ కథ నడుస్తుంది. అక్కడ అంటోని అనే కసాయి ఉంటాడు. ఊరంతా అతడి దగ్గరే గేదె మాంసాన్ని కొంటుంటారు. ఇలా నరికేందుకు తెచ్చిన ఓ నాటు దున్న భయంతో తప్పించుకోవడం వల్ల ఊరంతా గందరగోళం రేగుతుంది. ఊర్లో పంటలను నాశనం చేస్తూ, అడ్డొచ్చిన వారిని తన కొమ్ములతో కుమ్మేస్తూ పరుగులు పెడుతుంది. ఆ గ్రామంలో రేగిన అలజడిని అదుపు చేసేందుకు పోలీసులు వస్తారు. ఇళ్లలోంచి ప్రజలు ఆ దున్నను పట్టుకునేందుకు గుంపులుగా బయటకొచ్చి చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దాన్ని పట్టుకునే క్రమంలో కుట్టచ్చాన్‌, ఆంటోనిల మధ్య ఆధిపత్య పోరు చెలరేగుతుంది. బృందాలుగా విడిపోయి వారు చేసే ప్రయత్నాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. వీరంతా కలిసి ఆ దున్నను పట్టుకున్నారా? లేదా? అన్నది మిగతా కథ.

రాక్షసానందం

కాలం ముందుకు కదులుతుందని సంకేతం వచ్చేలా గడియారం శబ్దంతో ఊరి ప్రజలను నిద్రలేపుతున్న సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. అదే సినిమా చివరకు వచ్చే సరికి సమూహం వెర్రెక్కిపోయి ఒక గుట్టలా పేరుకుపోయాక.. మనల్ని ఆదిమానవుల కాలానికి తీసుకెళ్తాడు దర్శకుడు. అంటే మన నాగరిక జీవితంలో ముందుకు వెళుతున్నామా? లేక వెనక్కివెళ్తున్నామా? అనే ప్రశ్నను ఈ సన్నివేశాల ద్వారా లేవనెత్తుతాడు. ఓ మూగజీవాన్ని చంపడంలోనే మనిషిలోని రాక్షస ప్రవృత్తిని చూపించలేదు. చాలా పాత్రలు, సన్నివేశాలతో ఈ విషయాన్ని మన హృదయాలపై ముద్రించాడు దర్శకుడు. ఊరంతా భయపడుతుంటే పాత బాకీని వడ్డీతో సహా ఇమ్మనే వ్యాపారి, అదే వ్యాపారిని ఎవరికీ అనుమానం కలగకుండా దున్న ముందుకు తోసే సన్నివేశం, ఇంట్లో భార్యను ఇష్టమొచ్చినట్లు తిడుతూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడే పోలీసు, పశువుని ఉచ్చులో బిగించానని చెప్పి ఒంటరి ఆడదాన్ని లొంగదీసుకునే ప్రయత్నం చేసే ఆంటోని, ఊరంతా అల్లకల్లోలం అవుతుంటే వీరి అసహాయతను హేళన చేసే పక్కఊరి కుర్రకారు. ఇలా చాలా సన్నివేశాల్లో మనలో నిగూఢంగా దాగి ఉన్న రాక్షసత్వాన్ని కళ్లకు కట్టారు.

మనమింకా జంతువులమేనా?

దున్నపోతు, మనిషి పాదముద్రలను ఒక ఫ్రేములో చూపిస్తూ ఇంత అభివృద్ధి సాధించిన ఈ నాగరిక ప్రపంచంలో మనమింక జంతు సమానులమే అని చెప్పే ప్రయత్నం చేశాడు. వీటితో పాటు దున్నపోతును రక్షించేందుకు బావిలోకి దిగే సన్నివేశంలో మనిషి జంతువుల స్థాయికి దిగజారిపోతున్న వైనాన్ని తన కెమెరాతో పట్టి చూపిస్తాడు. ఆ చిట్టచివరి సన్నివేశంతో ఈ సృష్టిలో జీవాలన్నింటికన్నా మనిషే అత్యంత ప్రమాదకరమని తేల్చేశాడు. కథ పరంగా చిన్నదే కానీ విశ్లేషిస్తే వీడని చిక్కుముడులెన్నో?

మనకు మనతోనే పోరాటం

దర్శకుడి ఆలోచనకు కెమెరామెన్‌, సంగీత దర్శకుడు ప్రాణం పోశారు. సినిమాలో ఒక్క పాట లేకున్నా నేపథ్య సంగీతంతో కావాల్సిన నాటుదనాన్ని, పశుతత్వాన్ని అందించాడు ప్రశాంత్‌ పిల్లై. దున్నపోతు వెంట పరిగెడుతున్న జనం. వారిని వెంటాడుతూ కెమెరా.. వేలమంది గుంపును ఆ అంధకార అడవిలో కెమెరా కన్నుతో పట్టుకోవడం గంగాధరన్‌ ప్రతిభకు నిదర్శనం.

ఈ సినిమా చూశాక అనిపించేది ఒక్కటే...ఇది మనిషికి, దున్నకు మధ్య జరిగే పోరాటం కాదు. మనిషికి మనిషిలోని మృగానికి మధ్య జరిగే అంతర్యుద్ధమని!

ఇదీ చూడండి... భారత్​ నుంచి ఆస్కార్​ రేసులో 'జల్లికట్టు'

Last Updated : Nov 27, 2020, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details