తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాలీవుడ్ వెంటపడుతున్న టాలీవుడ్.. ఎందుకు? - పవన్​కల్యాణ్ వకీల్​సాబ్

ఇటీవల కాలంలో మలయాళ సినిమాల్ని ఎక్కువగా తెలుగులో రీమేక్​ చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. వాటిలో అగ్రహీరోలు నటించనున్నారనే విషయం ఆసక్తికర అంశం. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఎందుకు ఈ భాషా చిత్రాలే ఎక్కువగా రీమేక్​ చేయాలనుకుంటున్నారు?. అనే విషయాలను చూద్దాం.

మాలీవుడ్ వెంటపడుతున్న టాలీవుడ్.. ఎందుకు?
తెలుగులో మలయాళ రీమేక్​లు

By

Published : Jul 13, 2020, 6:45 PM IST

'ప్రేమమ్' అని మలయాళ సినిమా ఒకటి వచ్చింది చూశావా? అందులో హీరోయిన్​ అనుపమ.. ఏముందిరా బాబు. అసలు మైండ్​లో నుంచి పోవట్లేదు. ఆమె నవ్వు, రింగురింగుల జట్టు.. అబ్బో సూపర్​ అంతే. 'మలర్' టీచర్​ను అయితే అసలు నువ్వు మర్చిపోవేమో! త్వరగా సినిమా చూడరా బాబు లేదంటే చాలా మిస్ అవుతావ్.

-కొన్నేళ్ల క్రితం దక్షిణాదిలోని సినీ ప్రేక్షకుడిని ఎవరిని కదిపినా ఇవే మాటలు. 'ప్రేమమ్' అంత బాగుందా? ఇంతకీ హీరో హీరోయిన్లు ఎవరు? కథేంటి? ఇలా రకరకాల ఆలోచనలతోనే చాలామంది తెలుగు వాళ్లు ఆ సినిమాను చూశారు. భాష అర్ధం కాకపోయినా, భావం అర్ధం చేసుకుని అందులో లీనమయ్యారు. మలయాళ సినిమాల్లో ఉన్న మజాను తెలుసుకున్నారు. అప్పటి నుంచి తెలుగుతో పాటే ఆ భాషా చిత్రాలను చూడటం మొదలుపెట్టారు. ఈ విషయాన్నే గమనించిన కొందరు తెలుగు దర్శక నిర్మాతలు.. అక్కడి సినిమాల్ని తెలుగులోకి రీమేక్​ చేస్తే బాగుంటుందని భావించారు. ఈ క్రమంలోనే మలయాళంలో సూపర్​హిట్​లుగా నిలిచిన కొన్ని చిత్రాల హక్కులను ఇప్పటికే చేజిక్కుంచుకున్నారు. ఈ ట్రెండ్​ ఎప్పటి నుంచో నడుస్తున్నా.. ఈ మధ్య కాలంలో అదికాస్త ఎక్కువైంది. టాలీవుడ్ స్టార్​ హీరోలు కూడా ఈ రీమేక్​ల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తుండటం మరో విశేషం.

ఇంతకీ ఆ సినిమాలేంటి?

'లూసిఫర్', 'డ్రైవింగ్ లైసెన్స్', 'అయ్యప్పనుమ్ కోషియుమ్', 'హెలెన్', 'కప్పెలా', 'మహిశింతే ప్రతీకారమ్'.. ఇవే త్వరలో తెలుగులో రీమేక్ కాబోయే మలయాళ సినిమాలు. వీటికి సంబంధించిన రైట్స్​ కొనుగోలు చేసిన పలు నిర్మాణ సంస్థలు.. కొన్ని చిత్రాల ప్రీ ప్రొడక్షన్స్ పనుల్ని మొదలుపెట్టాయి.

మలయాళ సినిమాలే ఎక్కువగా ఎందుకు?

ఒక భాషలోని సినిమాల్ని మరో భాషలో రీమేక్​ చేయడం కొత్తేమి కాదు. ఎప్పటినుంచో జరుగుతున్నదే. కాకపోతే ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలపై దృష్టి సారించిన తెలుగు నిర్మాతలు.. వాటిని ఇక్కడా తిరిగి తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

నిజజీవిత సంఘటనలు, మన చుట్టూ జరిగే రోజువారీ అనుభవాలే మలయాళ సినిమాల్లో దాదాపు కథా వస్తువులు. వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. చాలా తక్కువ లొకేషన్లలోనే చిత్రీకరిస్తారు. ఇలాంటి అంశాలనే పరిగణలోకి తీసుకుంటున్న తెలుగు దర్శకనిర్మాతలు.. వాటిని మన దగ్గర తెరకెక్కిస్తే తక్కువ మొత్తంతో ఎక్కువ లాభం పొందొచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రేక్షకాదరణ దక్కించుకోవచ్చని అనుకుంటున్నారు.

ఏ సినిమాలో ఎవరు?

  1. లూసిఫర్- రాజకీయ నేపథ్య కథతో తీసిన ఈ మలయాళ సినిమా ఘనవిజయం సాధించింది. ఇప్పుడే దీనినే మెగాస్టార్ చిరంజీవితో రీమేక్​ చేయనున్నారు. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకుడు. ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే సంవత్సరం ప్రారంభంలో షూటింగ్ మొదలుపెట్టొచ్చు.
  2. అయ్యప్పనుమ్ కోషియుమ్- ఓ పోలీస్, రిటైర్డ్ ఆర్మీ అధికారి మధ్య అహం వల్ల గొడవలు వస్తే ఏంటనేది ఈ చిత్రకథ. మాతృకలో పృథ్వీరాజ్, బిజు మేనన్ అద్భుతంగా నటించారు. తెలుగులో రవితేజ, రానాలు ఆ పాత్రల్లో నటించనున్నారు.
    అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా పోస్టర్
  3. కప్పెలా- సామాజిక కథాంశంతో, తక్కువ బడ్జెట్​తో తీసిన ఈ సినిమా మలయాళంలో సూపర్​హిట్​గా నిలిచింది. దీని తెలుగు రీమేక్​లో​ విశ్వక్​సేన్.. ఓ కథానాయకుడిగా నటిస్తున్నారు.
    కప్పెలా సినిమా పోస్టర్
  4. డ్రైవింగ్ లైసెన్స్-ఓ సినీ హీరోకు, ఓ ఆర్టీవో అధికారికి మధ్య జరిగిన ఓ సంఘటన వారిద్దరి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసింది? చివరకు ఏమైంది? అనేదే ఈ సినిమా. దీని తెలుగు హక్కులు కొణిదెల ప్రొడక్షన్స్ దక్కించుకుంది. కానీ ఎప్పుడు, ఎవరితో తీస్తున్నారనేది మాత్రం వెల్లడించలేదు.
    డ్రైవింగ్ లైసెన్స్ సినిమా పోస్టర్
  5. హెలెన్- ఓ అమ్మాయి అనుకోకుండా డీప్ ఫ్రిజర్​లో దాదాపు ఐదు గంటలపాటు చిక్కుకుపోతుంది? ఇంతకీ ఆమె బతికాందా? చివరకు ఏమైంది అనేది చిత్రకథ. దీని తెలుగు హక్కులు పీవీపీ సంస్థ దక్కించుకుంది. కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
    హెలెన్ సినిమా పోస్టర్

ఇతర భాషా సినిమాలు రీమేక్​లుగా

మలయాళం సినిమాలతో పాటే ఇతర భాషల్లోని సినిమాలు తెలుగులో జోరుగా తెరకెక్కుతున్నాయి. పవన్​కల్యాణ్ వకీల్​సాబ్(పింక్-హిందీ) వెంకటేశ్ 'నారప్ప'(అసురన్-తమిళం), రామ్ 'రెడ్'(తడమ్-తమిళం), నితిన్ రీమేక్ (అంధాదున్-హిందీ) సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఓటీటీల ప్రభావం

సినీ ప్రేక్షకులు.. ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులోకి రావడం వల్ల అన్ని భాషా చిత్రాల్ని చూసేస్తున్నారు. ఈ క్రమంలోనే రీమేక్​లుగా ప్రకటించిన మలయాళ సినిమాల మాతృకల్ని వీక్షిస్తున్నారు. దీంతో సాధారణ సినీ వీక్షకుడితో పాటు వీరినీ మెప్పించాలంటే రీమేక్​ చేయబోయే తెలుగు దర్శక నిర్మాతలకు కత్తిమీద సామే.

ABOUT THE AUTHOR

...view details