తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెంకటేష్ బర్త్​డే: ఈ విషయాలు ఎంతో ఆసక్తికరం!

అగ్ర కథానాయకుడు వెంకటేష్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం. ప్రస్తుతం వెంకీ 'నారప్ప' సినిమాలో నటిస్తున్నారు.

victory venkatesh birthday story news
వెంకటేష్ బర్త్​డే

By

Published : Dec 13, 2020, 5:24 AM IST

దగ్గుబాటి వెంకటేష్ ఆయన పేరు అయినా సరే తెలుగు ప్రేక్షకులకు మాత్రం విక్టరీ వెంకటేష్‌గానే సుపరిచితుడు. 34 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్‌లో 73 సినిమాల్లో నటించారు. ఎన్నో విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్​గా నిలిచిన వెంకీమామ.. బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో కనిపించారు. వెంకీ ఆదివారం(డిసెంబరు 13) 60వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర సంగతులు మీకోసం.

కుటుంబ నేపథ్యం

మూవీ మొగల్‌గా పేరు తెచ్చుకున్న నిర్మాత, మాజీ ఎంపీ రామానాయుడు కుమారుడే వెంకటేష్‌. తల్లి పేరు రాజేశ్వరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. సురేష్‌ బాబు సోదరుడు. ఈయన సురేష్‌ ప్రొడక్షన్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. సోదరి పేరు లక్ష్మి. వెంకీ పాఠశాల విద్యాభ్యాసం చెన్నైలో జరిగింది. చెన్నై లయోలా కాలేజ్​లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. యూఎస్‌లో మాంటెస్సోరిలోని మిడిల్‌బరీ ఇన్​స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత హీరోగా మారారు. 1985లో వెంకటేష్, నీరజల వివాహమైంది. హయవాహిని, ఆశ్రిత, భావన ముగ్గురు అమ్మాయిలు, అర్జున్‌ రామంత్‌ కుమారుడు.

అగ్ర కథానాయకుడు వెంకటేశ్​

బాలనటుడిగా తెరంగేట్రం

1971లో వచ్చిన 'ప్రేమ్‌ నగర్‌'లో బాలనటుడిగా వెంకటేష్‌ చేశారు. 1986లో వచ్చిన 'కలియుగ పాండవులు' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యారు. ఇందులో హీరోయిన్​గా చేసిన ఖుష్బూకు దక్షిణాదిలో ఇది మొదటి చిత్రం.

అనంతరం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 'స్వర్ణకమలం'లో వెంకీ నటించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం వెంకటేష్​కు చాలా తొందరగా వచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని 1989 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రదర్శించారు. 1988లో వచ్చిన మ్యూజికల్‌ రొమాంటిక్‌ చిత్రం 'ప్రేమ'లో నటించారు. 'బ్రహ్మ పుత్రుడు', 'బొబ్బిలి రాజా' లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.

అతిలోక సుందరితో

రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన 'క్షణ క్షణం' సినిమా చేశారు వెంకటేష్‌. సెకండ్‌ రన్‌లో బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకొన్న ఈ చిత్రం.. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. 1991లో ఫ్యామిలీ డ్రామా 'చంటి'లో నటించారు. దానిని హిందీలో 'అనారి'గా రీమేక్‌ చేశారు. ఇందులోనూ వెంకటేష్‌ హీరోగా.. హీరోయిన్​గా కరిష్మా కపూర్‌ చేశారు. ఇది హిందీలో వెంకీకి మొదటి చిత్రం. తెలుగు, హిందీ భాషల్లోనూ ఇది హిట్​గా నిలిచింది. ఆ ఏడాదే 'శత్రువు', 'సూర్య ఐపీఎస్‌'తో పాటు 'చినరాయుడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అగ్ర కథానాయకుడు వెంకటేశ్​

1995లో బాలీవుడ్​లో 'తాక్దీర్‌ వాలా' సినిమాలో రవీనా టాండన్‌తో కలిసి నటించారు వెంకీ. ఇది 1994లో తెలుగులో ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన 'యమలీల' సినిమాకు రీమేక్‌. 1996లో, 'ధర్మచక్రం' సినిమాలో రమ్యకృష్ణ, ప్రేమలతో ఆడిపాడారు. టాలీవుడ్‌లో సౌందర్య, విక్టరీ వెంకటేష్‌ కాంబినేషన్‌ అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటి. వీరిద్దరూ ఏడు సినిమాల్లో నటించగా ఆరు సినిమాలు విజయవంతమయ్యాయి. తెరపై వెంకటేష్, సౌందర్యల కెమిస్ట్రీ, నటనకు కమర్షియల్‌ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా బాగా అందాయి.

ప్రేమ సినిమాల హీరో

'ప్రేమించుకుందాం రా'లాంటి విజయవంతమైన రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాలలో నటించారు, అలరించారు, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వెంకటేష్‌. ఈయన ఖాతాలో 'ప్రేమతో రా', 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మల్లీశ్వరి' లాంటి రొమాంటిక్‌ సినిమాలు ఉన్నాయి. 2005లో యాక్షన్‌ ఫిల్మ్‌ 'ఘర్షణ'లో నటించారు. 'సంక్రాంతి', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'చింతకాయల రవి' ఫ్యామిలీ డ్రామాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవలే 'ఎఫ్‌2' సినిమాలో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం 'నారప్ప'లో నటిస్తున్నారు.

అగ్ర కథానాయకుడు వెంకటేశ్​

వాణిజ్య ప్రకటనలు

2010 ఏప్రిల్‌ 24న ఓ ఫైనాన్స్ సంస్థకు బ్రాండ్​ అంబాసిడర్​గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు వెంకటేష్. అలాగే రూమ్ క్లీనర్ యాడ్‌, కాటన్‌ పంచెల వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తున్నారు.

ఏడు నంది పురస్కారాలు

వెంకటేష్‌ను నంది పురస్కారాలు ఏకంగా ఏడుసార్లు వరించాయి. 'కలియుగ పాండవులు'కు బెస్ట్‌ మేల్‌ డెబ్యూగా, 'స్వర్ణ కమలం' సినిమాకు బెస్ట్‌ యాక్టర్‌ స్పెషల్‌ జ్యూరీగా, 'ప్రేమ', 'ధర్మ చక్రం', 'గణేష్‌', 'కలిసుందాం రా', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు. ఫిలింఫేర్‌ పురస్కారాలకు వెంకీ అంటే ఎంత ఇష్టమో చెప్పడం కష్టం. 'బ్రహ్మపుత్రుడు', 'ధర్మ చక్రం', 'గణేష్', 'జయం మనదే రా' సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ పురస్కారాలను అందుకున్నారు. 'కలిసుందాం రా' చిత్రానికి ఫిలింఫేర్‌ స్పెషల్‌ జ్యూరీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. 'గురు' చిత్రానికి ఫిలింఫేర్‌ బెస్ట్‌ యాక్టర్‌ క్రిటిక్స్‌ పురస్కారాన్ని దక్కించుకున్నారు.

నారప్ప సినిమాలో వెంకటేశ్​

ABOUT THE AUTHOR

...view details