ఓ పాట.. ఆడపిల్లల భుజాలపై అందంగా జాలువారే అల్లరి పైట. ఓ పాట.. కొత్తగా మీసమొచ్చిన కుర్రకారు గుండె గొంతుకలో కొట్టుమిట్టాడే కూనిరాగం. ఓ పాట .. కొండాకోనల్లో ఒక్కసారిగా దుమికే ప్రేమ జలపాత ప్రవాహం. ఇంకో పాట.. గుండెల్ని పిండేసే విరహ గీతి. రక్తి, భక్తి, విరక్తి.. ఇలా పాట పాటకో నేపథ్యం. ఆశలు, ఆశయాల సాధన కోసం ప్రజలందరినీ సామూహికంగా కట్టి పడేసే ఉద్యమ గీతాలు కొన్ని. శిశుర్వేత్తి, పశుర్వేత్తి గాన రస:పణి అన్నట్లు.. ప్రతి ఒక్కరిని అలరించే పాటలు జీవితాల్ని ప్రభావితం చేసేవే.
కవులంతమందీ అన్ని రకాల పాటలూ రాయలేరు. కొన్ని పాటలు మాత్రమే రాయడంలో లబ్ధప్రతిష్టులవుతారు. ప్రముఖ సినీ కవి శ్రీ వేటూరిలాంటి వారు మాత్రమే.. తమ కలంతో ఎలాంటి సన్నివేశాన్ని అయినా సునాయాసంగా రక్తి కట్టించగలరు. అక్షర సరస్వతి పారాణి పాదాలని పాటల సిరిసిరి మువ్వలతో అలంకరించగలరు. ఔను.. ఆయన అలనాటి శ్రీనాధుడికి అచ్చమైన, స్వచ్ఛమైన వారసుడు. ఈ యుగం నాదే అని సగర్వంగా ప్రకటించిన మనతరం మహాకవి శ్రీశ్రీని సందర్భానుసారం ఆవహించుకోగల సర్వ సమర్థుడు. ఆయనే.. వేటూరి.
తొలుత పాత్రికేయుడిగా పనిచేసి... తరువాత తెలుగు సినిమా తల్లి అర్చనలో అనేకానేక అనర్ఘ గీత రత్నాలను అందంగా పొదిగి... సినీ గేయరచయితగా జీవితాన్ని సాఫల్యం చేసుకున్న మహా మనిషి. ఆయనే ఓ గీతంలో ప్రస్తావించినట్లు.. కృషి ఉంటే మసుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు.. అన్నట్లే తన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు. నానృషి కురుతే కావ్యం.. అన్నది ఆర్యోక్తి. ఆ రకంగా చూస్తే.. మన మధ్య మనతోనే కదలాడిన ఋషితుల్యుడు వేటూరి సుందర రామ్మూర్తి. ఈరోజు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా వేటూరి గురించి కొన్ని విషయాలు..
జీవన నేపథ్యం
1936 జనవరి 29న కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లిలో వేటూరి సుందరరామ్మూర్తి జన్మించారు. మద్రాస్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియేట్, విజయవాడలో డిగ్రీ పూర్తి చేసిన వేటూరి పండిత వంశానికి చెందినవారు. సుప్రసిద్ధ కవి వేటూరి ప్రభాకరశాస్త్రి కుటుంబానికి చెందినవారు. అప్పట్లో దైతా గోపాలం నటన, కథ, కవిత, గాన, దర్శకత్వ శాఖల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేవారు. వేటూరి కూడా ఆయన దగ్గర తొలి పాఠాలు నేర్చుకున్నారు. తర్వాత మల్లాది దగ్గర కూడా శిష్యరికం చేశారు. ఆపై.. ఆంధ్రప్రభ దినపత్రికలో పాత్రికేయుడిగా 1956 నుంచి సుమారు 16 సంవత్సరాలు పనిచేశారు.
సాహిత్యాభిలాషతో వేటూరి ఆకాశవాణి కోసం కొన్ని గేయ నాటికలు రాశారు. అందులో ఆయనకు బాగా పేరు తెచ్చింది.. సిరికాకుళం చిన్నది అన్న గేయ నాటిక. శ్రీ కృష్ణ దేవరాయలనాటి తెలుగు సంస్కృతిని, అప్పటి జీవన శైలిని అక్షరీకరించిన ఈ నాటిక పండిత పామరులను ఎంతగానో మెప్పించింది. ప్రబంధ కవుల పదబంధ విన్యాసాలు, ఆధునిక కవుల లలిత కవనాలు పుక్కిట పట్టిన వేటూరి మొదటినుంచి సినిమా అవకాశాల కోసం తహతహలాడలేదు. ఎన్టీఆర్తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నా.. ఆయనే స్వయంగా కొంతమంది సినీ ప్రముఖుల దగ్గరకు వెళ్లమని బలవంతపెట్టినా.. తప్పించుకు తిరిగేవారు తప్ప అవకాశాల్ని అంది పుచ్చుకోవాలన్న తాపత్రయం చూపించలేదు. కారణం సినిమా సంస్కృతి తనకు సరిపడదనే భావనే. అదే ఆయన్ని తొలినాళ్లలో సినీ రంగానికి ఆయన్ని దూరంగా ఉంచింది.
1974 దశకంలో వేటూరి సినీ ప్రస్థానం అనివార్యమైనది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'ఓ సీత కథ' చిత్రం వేటూరికి సినీ స్వాగతం పలికింది. ఆ చిత్రంలో 'భారత నారి చరితం' అనే హరికథ వేటూరిలోని పండితీ ప్రకర్షకు నిదర్శనం. ఆ హరికథ అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. తొలి చిత్రంతోనే... యావత్ సినీ సాహితీ లోకాన్ని మంత్రముగ్దుల్ని చేసిన వేటూరి... ఆపై తన కలం బలంతో విజృంభించిన తీరు అనితర సాధ్యం.