తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2020, 8:03 AM IST

ETV Bharat / sitara

'నేనూ రాకెట్‌లాంటి అమ్మాయినే కదా'

తళతళలాడే కొత్త టపాకాయ్‌లా కనిపిస్తోంది కృతిశెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన 'ఉప్పెన' చిత్రంతో ఆమె కథానాయికగా పరిచయమవుతోంది. దీపావళి సందర్భంగా ఆమె 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ...

uppena movie heroine kruthi shetty specail interview with ennadu cinema
'నేనూ రాకెట్‌లాంటి అమ్మాయినే కదా'

తొలి సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ... పరిశ్రమని ఊరిస్తోంది హీరోయిన్​ కృతిశెట్టి. కుర్రాళ్లనీ తెగ ఆకర్షిస్తోంది. మరి ఆమె చేసే సందడిని ఆస్వాదించాలంటే 'ఉప్పెన' విడుదల కావల్సిందే. మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌కు జోడీగా ఈ సినిమాలో నటించింది కృతి.

ఈసారి దీపావళి పండగని ఎక్కడ, ఎలా జరుపుకొంటున్నారు?
నేను పుట్టి పెరిగిన ముంబయిలోనే ఉన్నా. ప్రతిసారీ పండగకి బయటికి వెళ్లి కావల్సిన స్వీట్లు తెచ్చుకునేవాళ్లం. ఈసారి ఇంట్లోనే రకరకాల స్వీట్లు తయారు చేశాం. కొద్దిమంది బంధువుల్ని, స్నేహితులతో కలిసి ఈసారి సంబరాలు జరుపుకొంటాం.
మీరు టపాకాయలు కాలుస్తారా?
టపాకాయాలు కాలుస్తుంటే చూడటం ఇష్టం. భయం వల్ల నేనెప్పుడూ కాల్చలేదు. ఇంట్లో దీపాలు వెలిగించి, అలంకరణ చేస్తాం.
అమ్మాయిలు ఎక్కువగా చిచ్చు బుడ్లు, కాకర పువ్వొత్తులు కాలుస్తుంటారు కదా...?
వాటి జోలికి కూడా నేను వెళ్లను. అయితే రాకెట్‌ బాంబులంటే చాలా ఇష్టం. నేనూ రాకెట్‌లాంటి అమ్మాయినే కదా (నవ్వుతూ). అవి పైకి వెళ్లి రంగులతో కూడిన కాంతుల్ని వెదజల్లుతుంటాయి. ఆ రంగుల్ని, కాంతుల్ని చూస్తూ ఆస్వాదించడం చాలా ఇష్టం.

"దీపావళి అనగానే అందరం లక్ష్మీ పూజ చేస్తాం. సత్యభామ ఏం చేసిందో గుర్తు చేసుకుంటాం. లక్ష్మీ విష్ణు దేవుడి భార్య. అంత పెద్ద దేవుడి భార్య అయినా, ఆమె శక్తులు ఆమెకి ఉన్నాయి. అలా ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ వాళ్లదైన ప్రత్యేకత, ప్రతిభ, అందంతో ఉంటుంది. దాన్నే నమ్ముకోవాలి. అన్నిటికంటే సమానత్వంపై నాకు ఎక్కువ నమ్మకం. మహిళకి మరెవరో సాయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి మహిళ మరో మహిళకి చేయూత అందించినా చాలు. ప్రపంచమే మారి పోతుంది."

--కృతిశెట్టి హీరోయిన్​.

తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ముందే వచ్చా?
'ఉప్పెన' సినిమా సెట్లోనే నేర్చుకున్నా. మా ఇంట్లో తుళు మాట్లాడతాం. కన్నడ, తుళు భాషలు తెలుగుకి దగ్గరగా ఉంటాయి. దాంతో నాకు తొందరగానే తెలుగు వచ్చేసింది. ఆరంభంలో మాత్రం బాగా కష్టపడ్డా. సెట్లో అందరూ నాకు తెలుగు నేర్పించారు.
'ఉప్పెన' కంటే ముందు తెలుగు సినిమాలు చూశారా?
తెలుగు సినిమాల గురించి, చిత్ర పరిశ్రమ గురించి నాకు మంచి అవగాహన ఉంది. వ్యక్తిగతంగా రామ్‌చరణ్‌ అంటే ఇష్టం. ఆయన సినిమాలు చాలానే చూశా. అయితే తెలుగు సినిమాతోనే కథానాయికగా పరిచయం అవుతానని అనుకోలేదు. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయన కథ చెప్పేటప్పుడే నేను ఎంత అందమైన పాత్రలో కనిపించబోతున్నానో అర్థమైంది.
నటించాలనే కోరిక చిన్నప్పుడే ఉండేదా? మీ కుటుంబ నేపథ్యం గురించి చెబుతారా?
కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించా. నేను సెట్‌ వాతావరణాన్ని బాగా ఇష్టపడేదాన్ని. అలా సినిమాలపై మక్కువ పెరిగింది. అమ్మానాన్నలూ ప్రోత్సహించారు. నాన్న వ్యాపారం చేస్తుంటారు. అమ్మ ఫ్యాషన్‌ డిజైనర్‌.
ప్రేమకథలో నటించారు కదా. ప్రేమ గురించి మీ అభిప్రాయమేమిటి?
ప్రేమ అనంతమైనది. శాశ్వతంగా నిలిచిపోయేది. నా వ్యక్తిగత అభిప్రాయం ఇదే. మా సినిమాలో ఈ అంశాన్నే స్పృశించారు దర్శకుడు.
తెలుగులో కొత్తగా ఒప్పుకొన్న సినిమాలేమిటి?
నాని కథానాయకుడిగా తెరకెక్కనున్న 'శ్యామ్‌ సింగరాయ్‌'లో నటిస్తున్నా. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. కొత్త అవకాశాల కంటే కూడా, 'ఉప్పెన' విడుదల గురించి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. తొలి సినిమాని ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడాలనీ, ఆ స్పందనని ఆస్వాదించాలని తహతహగా ఉంది. ప్రస్తుతం పాటలకి వస్తున్న స్పందనని ఆస్వాదిస్తూ గడుపుతున్నా.

ఇదీ చూడండి:కృతి.. నీకోసం అభిమానులు వెయిటింగ్!

ABOUT THE AUTHOR

...view details