ఆయన సినిమాలు నవజీవన బృందావనాలు.. ఆ చలనచిత్రాలు చిట్టి కోయిలల కుహు కుహూ గానాలు. ఆశల రెక్కలతో పైకి ఎగసే పుష్పక విమానాలు. జాబిల్లిని అందించే జానపదాలు. సాంకేతిక అద్భుతాలు. ఆ సినిమాలు హరిచందనాల..కుందనాల బొమ్మలు. తెలుగు లోగిళ్ల వెలుగుపారాణులు. అలాంటి అపురూప కళాఖండాల సృష్టికర్త, అద్భుతాల ఆవిష్కర్త. కళాత్మక, కథాత్మక చిత్రాల దర్శకుడు, సంస్కృతికీ, శాస్త్రీయతకూ పట్టం కట్టి చిరస్మరణీయ సినిమాలు అందించిన సినీ మాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావు.
మేళకర్తల రాగాల సమ్మేళనమే సంగీతం. లలిత కళలన్నీ రాశులు పోస్తే సింగీతం. తొంభై వసంతాలు పలకరిస్తున్నా నిత్యయవ్వనుడిలా ఉన్న సింగీతం సినీజీవనయానం ఎంతో ఆసక్తిదాయకం. తన స్వస్థలం.. నెల్లూరు జిల్లా ఉదయగిరినే కళా హృదయగిరిగా చేసుకుని ముందుకు సాగారు. తల్లి శకుంతల వయొలిన్ విద్వాంసురాలు. తండ్రి ప్రధానోపాధ్యాయుడు. ఆ ఇంట సంగీత, సాహిత్య, సాంస్కృతిక స్పర్శతో సింగీతం... తను చదివే స్కూల్లో లవకుశ నాటకంలో లవ పాత్ర వేశారు. అదే సమయంలో టూరింగ్ టాకీస్ లో చూసిన 'సీతాకల్యాణం', 'శ్రీకృష్ణ లీలలు' సినిమాలు ప్రగాఢ ముద్రవేశాయి. అప్పుడే ఆకాశవాణిలో సాలూరి రాజేశ్వరరావు పాడిన లలితగీతం చల్లగా మనసు తాకింది. ఆ తీయని మధుర భావనలను సింగీతం హృదయంలో భద్రపర్చుకున్నారు. ఉదయగిరిలో పదోతరగతి, గూడూరులో ఇంటర్ పూర్తిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్‌లో బీఎస్సీ ఫిజిక్స్. అటు తర్వాత సూళ్లూరు పేటలో కొంతకాలం టీచరుగా ఉద్యోగం. చిన్నప్పుడు చూసిన భక్తపోతన సినిమా హృద్యంగా వెంటాడేది. కేవీరెడ్డి దర్శక ప్రతిభ, ప్రతిఫ్రేములో తీసుకున్న శ్రద్ధ ఆకర్షించాయి. మనిషి పాఠం చెబుతున్నా మనసేమో మెగాఫోన్ పట్టాలని ఉవ్విళ్ల్లూరేది. సింగీతం ఈ క్రమంలో మద్రాసు వెళ్లి కష్టపడి కేవీ రెడ్డి దగ్గర అసిస్టెంటుగా చేరారు. అద్భుత కళాఖండం 'మాయాబజారు' చిత్రానికి సహాయ దర్శకుడయ్యారు. పెళ్లినాటి ప్రమాణాలు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం తదితర చిత్రాల్లో పనిచేస్తూ దర్శకత్వ నైపుణ్యాలు నేర్చారు.
దర్శకుడికి స్క్రీన్‌ప్లే కూడా తెలిసి ఉంటే చేసే కృషి వెండితెరపై ప్రతిఫలిస్తుందని ప్రపంచ సినీ దిగ్గజం అకిరా కురసోవా నేర్చిన పాఠం సింగీతానికి స్ఫూర్తినిచ్చింది. తన దర్శకత్వ ప్రతిభను ప్రేక్షకలోకానికి చాటాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్న సమయం అది. ఎట్టకేలకు ఆ అవకాశం రానే వచ్చింది. కృష్ణంరాజు-కాంచన కాంబినేషన్ తో 1972లో నీతి-నిజాయతీ సినిమా తీశారు. ఈ చిత్రంలో సింగీతం దర్శక ప్రతిభను గుర్తిస్తూ మరో అవకాశం వచ్చింది. అదే జమీందారుగారి అమ్మాయి. 1974లో సింగీతం తెరకెక్కించిన జమీందారు గారి అమ్మాయి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ గీతాలు సంగీత ప్రియుల హృదయ తంత్రులు మీటాయి.
ప్రయోగాలు, సాహసాలు సినీమాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావుకు ప్రాణప్రదం. మరీ చెప్పాలంటే అదే ఆయన పథం. ఆధునికతకు పట్టంకడుతూనే సంప్రదాయ చిత్రాలు, జనపదాలో, ‘గాన పదాలో’ తీయటం దృక్పథం. అది తను పాటించే రిథం.. టాకీ సినిమా రోజులలో మూకీ సినిమా తీసి.. భారతీయ ఛార్లీ చాప్లిన్‌ను కమల హాసన్‌లో చూపించారు. ఆయన సినీ దర్శక ప్రయాణంలో పుష్పక విమానం సహా, ఆదిత్య 369, భైరవ ద్వీపం వేటికవే విశిష్టమైనవి. ప్రశస్థమైనవి.
టాకీయుగం లో మూకీ సినిమా తీయటం సాహసం. సాహసాలను ప్రేమించిన సింగీతం శ్రీనివాసరావు. వెండితెరపై సంచలనం సృష్టించిన నిశ్శబ్ద చిత్రం పుష్పక విమానం. ఘోషతోనే తప్ప, భాషతో సంబంధం లేని ఈ సినిమా..దేశ ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ఇందులో కమలహాసన్ నటన నభూతో నభవిష్యతి. నిరుద్యోగి చిత్త ప్రవృత్తికి చిత్రం. నిరుద్యోగి కంటే యాచకుడి బ్రతుకే నయం అన్న అర్ధంలో తీసిన ఈ దృశ్యంలో కమలహాసన్, సీనియర్ నటుడు పీఎల్ నారాయణ అపూర్వంగా నటించారు. అదే నిరుద్యోగి అతడికి జవాబివ్వటం దర్శక ప్రతిభకు నిదర్శనం.
తెలుగు చిత్రసీమలో ఓ అపూర్వ ప్రయోగం, తొలి పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369. టెక్నాలజీ అంతగా లేని కాలంలో సెల్యులాయిడ్ సైంటిస్ట్ సింగీతం సృష్టి ఈ సినిమా. వెండితెరపై వైజ్ఞానిక అద్భుతం. సినీ ప్రేక్షకులను రాయల కాలానికి తీసుకెళ్లింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా, శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ అభినయం భళాభళి అన్పించింది. స్వర మాంత్రికుడు ఇళయరాజా, తెరమాంత్రికుడు సింగీతం కలిశారు. ఇక వరవీణల నృత్యగానాలే మరి. పెళ్లిని టీవీలో చూసి ఆనందించాలని భర్తతో ఇల్లాలు చెబుతున్న మాటలు ఈ కాలనికీ వర్తించటం యాదృచ్ఛికం. ఇంజనీర్ కృష్ణమోహన్ చెబుతున్న ప్రజాస్వామ్య కబుర్లకు ఆశ్చర్యపోవటం రాయలవారి వంతైంది.