దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లు ఒకేసారి తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని తెలుగు సినీపరిశ్రమ నిర్మాతలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మాతలు డి.సురేశ్‌బాబు, వివేక్ కూచిభొట్ల, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్‌మరార్, ప్రశాంత్, రవి, బాపినీడు, దర్శకుడు తేజ తదితరులతో శనివారం కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కిషన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
థియేటర్లు తెరవడానికి రెండునెలలు ముందుగా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, అప్పుడే పరిశ్రమ నిలదొక్కుకుంటుందని, అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు ఒకేసారి తెరవాలని సురేశ్‌బాబు సూచించగా.. దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. షూటింగుల అనుమతి, థియేటర్లు, క్యాప్టివ్ పవర్, పైరసీ, ఓటీటీలో సినిమాల విడుదల, రీజనల్ జీఎస్టీ, టీడీఎస్, సినిమా కార్మికుల ప్యాకేజీ, టైలర్‌మేడ్ బీమా, బ్యాంకు రుణాలు తదితర అంశాలు కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఓటీటీలో వచ్చే సినిమాలకు సెన్సార్ లేదని, సినీ పరిశ్రమలో వివక్ష ఉండకూడదని సురేశ్‌బాబు కోరారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్, చెన్నారెడ్డిలు ప్రాంతీయ భాషల సినిమాలకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని ప్రస్తావించారు. హాలీవుడ్‌కు, అసోం లాంటి ప్రాంతీయ భాషా చిత్రాలకు ఒకే తరహా జీఎస్టీ సరికాదని తెలిపారు. సినిమా అంటేనే ఎక్కువ జనం ఉంటారని ఈ నేపథ్యంలో థియేటర్లు, షూటింగ్‌లపై కొన్ని భద్రత ప్రమాణాలను రూపొందించామని తేజ తెలిపారు.