'అడవి దొంగ', 'అడవి రాముడు', 'అడవి దొర', 'అడవి రాజా', 'అడవి సింహాలు', 'బొబ్బిలిరాజా', 'అడవి'... ఇలా అడవి చుట్టూ సాగిన తెలుగు సినిమాలెన్నెన్నో. చెట్టు చేమలు, కొండ కోనల మధ్యే కథను నడుపుతూ మాస్ ప్రేక్షకుల్ని అలరించారు దర్శకులు. కాలక్రమంలో ట్రెండీ కథలదే హవా కావడం వల్ల ఆ నేపథ్యంలో సినిమాలు రావడం తక్కువైంది. ఒకట్రెండు సన్నివేశాలు మినహా పూర్తిస్థాయిలో అడవి చుట్టూ సాగిన సినిమాలు తక్కువ. కానీ ఇప్పుడు మరోసారి మన హీరోలు అడవి బాట పట్టారు. కొత్తదనం కోసం దర్శకులు ఆ నేపథ్యంలో కథల్ని విరివిగా తయారుచేస్తున్నారు.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న 'ఆచార్య'లోనూ అటవీ నేపథ్యం ఉంటుందని సమాచారం. ఇలా అడవి బాట పట్టిన మన హీరోలు ఎలాంటి వినోదం అందిస్తారో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఈ నేపథ్యం అలరించిందంటే ఈ బాటలో మరికొన్ని కథలు ప్రయాణం చేస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్ - రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' దేశభక్తి, స్నేహం ప్రధానంగా సాగే కథని సమాచారం. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలతో ఓ కల్పిత గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అల్లూరి, కొమరం... ఈ ఇద్దరూ మన్యం వీరులే. దీంతో ఈ కథ ఎక్కువగా అడవుల నేపథ్యంలోనే ఉండనుందని సమాచారం.