ఈ ఏడాది సినీ డైరీ చివరి పేజీలకు చేరుకుంది. బాక్సాఫీస్ లెక్కలు సరిచూసుకునే సమయం ఆసన్నమైంది. వెండితెరపై సందడి చేసిన చిత్రాలెన్ని.. వాటిలో హిట్టు మాట వినిపించిన సినిమాలెన్ని? అంటూ ఆరాలు మొదలైపోయాయి. మరోమారు కరోనా విజృంభించడం వల్ల.. గతేడాది పరిస్థితులే ఈ ఏడాది కనిపించాయి. సినీ క్యాలెండర్‌లో మరో నాలుగు నెలలు కరోనా ఖాతాలో కొట్టుకుపోయాయి. అడపాదడపా పెద్ద సినిమాల సందడి కనిపించినా.. ఈ ఏడాదంతా చిన్న చిత్రాల జోరే ఎక్కువ కనిపించింది. ఇందులో తొలి ప్రయత్నంలోనే హిట్టు మాట వినిపించిన దర్శకులూ ఉన్నారు. మరి ఈ ఏడాది తెరపై తళుక్కున మెరిసిన ఆ కొత్త కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం పదండి.
మారుతున్న సినీప్రియుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కథలతో వినోదాలు వడ్డించడంలో కొత్త దర్శకులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే కొత్త ప్రతిభ తెరపై మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా వారి వైపు ఓ కన్నేస్తుంటారు. కొన్నేళ్లుగా తెలుగు తెరపై ఈ కొత్త కెప్టెన్లదే జోరంతా.
ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాదీ ఫిబ్రవరి నుంచే కొత్త దర్శకుల హవా కనిపించింది. ఈనెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన వైష్ణవ్ తేజ్.. 'ఉప్పెన', అల్లరి నరేష్.. 'నాంది' సినిమాలు విజయ పతాకం ఎగురవేశాయి. ముఖ్యంగా 'ఉప్పెన' చిత్రం రూ.70కోట్ల వసూళ్లు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సినిమాతోనే దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా. కులం.. పరువుల మధ్య నలిగిన ఓ అందమైన ప్రేమకథను.. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు చక్కగా ఆవిష్కరించిన తీరు అందరినీ మెప్పించింది. అల్లరి నరేష్ నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’తో దర్శకుడిగా వెండితెరపై మెరిశారు విజయ్ కనకమేడల. అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన ఓ బాధితుడు.. న్యాయశాస్త్రంలోని 211సెక్షన్‌తో తనని తప్పుడు కేసులో ఇరికించిన వాళ్లపై ఎలా పగ తీర్చుకున్నాడో సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.
మార్చిలో చిన్న సినిమాలు వెల్లువలా వచ్చినా.. వాటిలో హిట్టు మాట వినిపించినవి శర్వానంద్.. 'శ్రీకారం', నవీన్ పొలిశెట్టి.. 'జాతిరత్నాలు'. రాబోయే తరాలకు వ్యవసాయమే మంచి ఉపాధి వనరవుతుందని తెలియజేస్తూ.. బి.కిషోర్ తెరకెక్కించిన ‘శ్రీకారం’ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతిరత్నాలు' బాక్సాఫీస్ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో.. అనుదీప్ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇదే నెలలో విడుదలైన 'షాదీ ముబారక్' సినిమాతో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు దర్శకుడు పద్మశ్రీ. సరైన ప్రచారం లేని కారణంగా థియేటర్లలో ఎక్కువ మందికి చేరువ కాలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీలో విడుదలయ్యాక సత్తా చాటింది.