Directors As anchors: ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే.. బిహైండ్ ది స్క్రీన్ డైరెక్టర్ డిక్టేట్ చేస్తాడు. ఇది సినిమాలు మొదలైనప్పటి నుంచి ఉన్న ఫార్ములా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఎప్పుడు తెర వెనుక కూర్చొని, హీరోహీరోయిన్లకు, నటీనటులకు.. స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ డైరెక్ట్ చేసే కెప్టెన్లు ఇప్పుడు ఆన్ ది స్క్రీన్ కూడా అదరగొడుతున్నారు. అభిమానులను తెగ అలరిస్తున్నారు. అయితే వారు నటులుగా మారడం చూశాం కానీ యాంకర్లుగా మాత్రం చూడలేదు. దర్శకులు చాలా పొదుపుగా మాట్లాడుతుంటారని ఎప్పటి నుంచో ఓ నానుడి కూడా ఉంది. కానీ ఇప్పుడు వారు దాన్ని చెరిపేస్తున్నారు. ప్రేక్షకులను డైరెక్ట్‌గా నవ్వించేందుకు సిద్ధమైపోతున్నారు. ప్లాట్‌ఫామ్ ఏదైనా చురుగ్గా ఉంటూ తమ వాక్చాతుర్యంతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. సరదాగా సెట్టైర్లు, పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు.
చాలా కాలంగా.. ఓ సినిమా ప్రమోషన్ కోసం ఇతర చిత్రాల హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు చీఫ్ గెస్ట్‌గా వచ్చే ఆనవాయితీ ఉంది. కానీ కరోనా తర్వాత ఈ ట్రెడిషన్ చాలా ఎక్కువైందనే చెప్పాలి. మరోవైపు తెలుగు సినిమాల పరిధి కూడా పెరుగుతోంది. దీంతో ఒకరి చిత్రాల పబ్లిసిటీ కోసం మరొకరు రంగంలోకి దిగుతున్నారు. చిన్న సినిమాలను స్టార్స్ ప్రమోట్ చేయడం, ఓ బడా హీరో సినిమాకు మరో ప్రముఖ కథానాయకుడు ప్రమోషన్ చేయడం వంటివి జరుగుతున్నాయి.
ఓ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను మరో సినీప్రముఖుడు రిలీజ్ చేయడం, ట్రైలర్‌ను మరొకరు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఇంకొకరు రావడం.. ఇలా ఒక్క మూవీకే పలువురు సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు బాధ్యతగా ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఇప్పటివరకు ఓ మూవీ రిలీజ్‌కు ముందు.. చిట్‌చాట్ పేరుతో చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించి పలు విశేషాలను పంచుకోవడం సహజమే. అయితే ఈ చిట్‌చాట్ షోలో మరో కొత్త ట్రెండ్ వచ్చింది. అదే ఓ డైరెక్టర్ యాంకర్ లేదా హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తడం. సగటు ప్రేక్షకుడికి ఓ సినిమాపై మరింత ఆసక్తి పెరగడానికి ఇది ఓ కారణం అని చెప్పొచ్చు.