కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడం వల్ల వరుస సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఇప్పటికే విడుదలైన చాలా చిత్రాలు హిట్ టాక్ అందుకోగా.. మరికొన్ని బ్లాక్బస్టర్లుగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించాయి. సంక్రాంతి నుంచి మొదలైన ఈ విజయపరంపర తాజాగా విడుదలైన 'గాలి సంపత్', 'జాతిరత్నాలు' వరకు కొనసాగుతూనే ఉంది. ఇదే జోష్‌తో ఏప్రిల్‌లోనూ పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' కూడా ఉండటం విశేషం. మార్చి ముగిసి ఏప్రిల్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాలేంటో చూద్దాం.
ఏప్రిల్ 2
వైల్డ్ డాగ్
కింగ్ నాగార్జున ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మగా నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్ల(గోకుల్ చాట్-2007, దిల్సుఖ్నగర్-2013) నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 2న థియేటర్లలో రిలీజ్ కానుంది.
సుల్తాన్
'రెమో' సినిమాతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ మెప్పించిన యువ దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్. ఆవారా, ఊపిరి, ఖైదీ వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దగ్గరైన నటుడు కార్తి. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం 'సుల్తాన్'. రష్మిక కథానాయికగా నటించింది. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది.
ఏప్రిల్ 9
వకీల్‌సాబ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. రాజకీయాల కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారారు. ఈయన రీఎంట్రీ ఇస్తున్న చిత్రం 'వకీల్‌సాబ్'. హిందీలో ఘనవిజయం సాధించిన 'పింక్'కు రీమేక్‌గా రూపొందింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, శ్రుతి హాసన్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏప్రిల్ 16
లవ్‌స్టోరీ