తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దూకుడుగా టాలీవుడ్.. 2022 బుక్ అవుతోంది! - 2022లో ఆదిపురుష్

టాలీవుడ్​లో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు జోరుగా సాగుతున్నాయి. కరోనా వల్ల ఓ ఏడాది తుడిచి పెట్టుకుపోయిన కారణంగా ఢీలా పడిన దర్శకనిర్మాతలు.. వారివారి కొత్త చిత్రాలతో దూకుడు పెంచారు. హీరోలూ అదే జోరుతో షూటింగ్​ల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాది సినీ క్యాలెండర్​ ఫుల్ అయిపోగా.. 2022ను కూడా బుక్ చేసేశారు అగ్రతారలు.

Tollywood movies which will release in 2022
దూకుడుగా టాలీవుడ్.

By

Published : Mar 13, 2021, 7:32 AM IST

కరోనా సంక్షోభం తర్వాత తెలుగులో సినిమాల ఉద్ధృతి పెరిగింది. 2020 అంతా తుడిచి పెట్టుకుపోవడం వల్ల ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. ఆ ప్రభావం 2021లో స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఆగిపోయిన సినిమాలన్నీ మళ్లీ ముస్తాబై వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. రానున్న చిత్రాల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా నిర్మాతలు ముందుగానే విడుదల తేదీల్ని ఖరారు చేసేస్తున్నారు. అలా 2021పై దాదాపు కర్చీఫ్‌లు పడిపోయాయి. ఇప్పుడు 2022పై దృష్టి పడింది. వచ్చే ఏడాదిలోనూ ఇప్పటికే విడుదల తేదీలు ఖరారైపోయాయి.

కథానాయకులు ఒకొక్కరూ రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. గతేడాది కరోనా వల్ల అందరూ కొన్ని నెలలపాటు ఖాళీగా గడిపారు. ఆ సమయంలో కొత్తగా కథలు విని వాటికి పచ్చజెండా ఊపేశారు. కథలు పక్కాగా సిద్ధం కావడం.. దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉండటం వల్ల కథానాయకులు కూడా వేగం పెంచేశారు.

పవన్ వర్సెస్ మహేష్​

2022 సంక్రాంతి బెర్తులు ఇప్పటికే ఖాయమయ్యాయి. మహేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ తెరకెక్కిస్తున్న 'సర్కారు వారి పాట' వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఆ విషయాన్ని సినిమా చిత్రీకరణ మొదలు పెట్టిన వెంటనే ప్రకటించింది చిత్రబృందం. పవన్‌కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ తెరకెక్కిస్తున్న 'హరిహర వీరమల్లు' వచ్చే సంక్రాంతికే విడుదల కానుంది. అగ్ర హీరోల చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదల కావడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి మహేష్‌, పవన్‌ కల్యాణ్‌ చిత్రాలు బరిలోకి దిగనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పవన్-మహేష్

ప్రభాస్‌ చిత్రాలు రెండు

పాన్‌ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్న ప్రభాస్‌ వచ్చే ఏడాది కోసం ఇప్పటికే రెండు తేదీల్ని బుక్‌ చేసేశారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న 'సలార్‌' వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న రానుంది. ఇటీవలే ఆ చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. ప్రభాస్‌ నటిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌' విడుదల కూడా ఖాయమైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.

సలార్, ఆదిపురుష్

అవీ చెప్పేస్తే

2022లో అంటూ అల్లు అర్జున్‌ - కొరటాల శివ, విజయ్‌ దేవరకొండ-సుకుమార్‌ కలయికలో సినిమాల్ని ఇదివరకే ప్రకటించేశాయి ఆయా చిత్రబృందాలు. ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కలయికలో సినిమా ఇంకా పట్టాలెక్కలేదు కాబట్టి అదీ వచ్చే ఏడాదిని లక్ష్యంగా చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ తదితర అగ్ర హీరోలు ఇప్పటికే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఎలాగో విడుదల తేదీలు ముందే ఫిక్స్ అయిపోతున్నాయి కాబట్టి ఆయా సినిమాలు ఓ తేదీని అనుకున్నాయంటే 2022లో రానున్న అగ్ర తారల సినిమాలపై ముందే ఓ అంచనాకి వచ్చేయొచ్చు.

అల్లు అర్జున్-కొరటాల చిత్రం

ABOUT THE AUTHOR

...view details