తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీ బాట పడుతోన్న టాలీవుడ్.. కారణమేంటో?

థియేటర్లలో పెద్ద తెరపై చూస్తామనుకున్న సినిమాలు ఇక ఇంటికే రానున్నాయా? కొత్త సినిమాలు నేరుగా ఓటీటీ మాధ్యమాల్లో సందడి చేయనున్నాయా? చిత్రసీమలో పరిస్థితులు చూస్తుంటే అదే ఖాయం అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ చిత్రాలు ఓటీటీలోకి వచ్చే అవకాశముందో చూద్దాం..

OTT
ఓటీటీ

By

Published : Jun 28, 2021, 7:11 AM IST

Updated : Jun 28, 2021, 9:33 AM IST

థియేటర్లు తెరుచుకుంటున్న వేళ సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. లాక్​డౌన్​ ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా? అని ఇన్నాళ్లూ ఎదురు చూస్తూ వచ్చిన నిర్మాతలు...ఇప్పుడు ఉన్నట్టుండి నిర్ణయం మార్చుకునే పనిలో పడ్డారు. తమ సినిమాలకు వస్తున్న ఆఫర్లపై ఆలోచిస్తున్నారు. నేరుగా ఓటీటీ వేదికల్లో విడుదల కోసం జోరుగానే బేరసారాలు సాగుతున్నాయి. కొన్ని ఒప్పందాలు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది.

మాస్ట్రో

ఎదురుచూసి..

తొలి లాక్​డౌన్​ సమయంలో పలు చిత్రాలు నేరుగా ఓటీటీ వేదికల్లో విడుదలయ్యాయి. రెండో లాక్​డౌన్​ సమయంలో మాత్రం ఓటీటీ ఒప్పందాల ఊసే వినిపించలేదు. అందుకు కారణం.. తొలి లాక్​డౌన్​ తర్వాత విడుదలైన కొన్ని కొత్త సినిమాలు బాక్సాఫీసు దగ్గర సంచలన విజయాల్ని సొంతం చేసుకోవడమే. ఆ వసూళ్లు చిత్ర నిర్మాతల్ని ఊరించాయి. అందుకే రెండో లాక్​డౌన్​ సమయానికి సినిమాలు సిద్ధమైనా.. ఓటీటీకి ఇవ్వకుండా వేచి చూశారు. థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. 'టక్ జగదీష్', 'లవ్ స్టోరి', 'విరాట పర్వం', 'ఇష్క్' ఇలా పలు చిత్రాలు విడుదలకు ముంగిట ఆగిపోయినప్పటికీ థియేటర్ల పునః ప్రారంభం గురించి ఎదురు చూశాయి.

విరాట పర్వం

కొన్ని బేరసారాలు

'ఏక్ మినీ కథ', 'థ్యాంక్ యూ బ్రదర్' లాంటి పరిమిత వ్యయంతో రూపొందిన ఒకట్రెండు సినిమాలే ఓటీటీ వేదికల్లో విడుదలయ్యాయి. మిగతావన్నీ లాక్​డౌన్​ తర్వాత థియేటర్లలోనే సందడి చేస్తాయని ఊహించారంతా. ప్రస్తుతం పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. లాక్​డౌన్​ తొలగించినా.. థియేటర్లు త్వరలోనే తలుపులు తెరుచుకోనున్నా.. నేరుగా ఓటీటీ వేదికల్లో విడుదల కోసం బేరసారాలు ఊపందుకున్నాయి. ఓటీటీ సంస్థలు, నిర్మాతల మధ్య వ్యాపార చర్చలు జోరుగా సాగుతున్నాయి.

నితిన్ కథానాయకుడిగా నటించిన 'మాస్ట్రో' దాదాపుగా పూర్తయినట్టే అని తెలిసింది. 'నారప్ప', 'దృశ్యం' చిత్రానికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. ఏ సమయంలోనూ ఒప్పందం పూర్తి కావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రానా కథానాయకుడిగా నటించిన 'విరాటపర్వం' కోసమూ ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు. నాని కథానాయకుడిగా నటించిన 'టక్ ​జగదీష్'​కు ఆఫర్లు తలుపుతడుతున్నట్లు తెలిసింది.

నారప్ప

అనిశ్చితే కారణమా?

థియేటర్ల విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి వల్లే సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయనేది పరిశ్రమ వర్గాల మాట. తెలుగు సినిమా రెండు రాష్ట్రాలతో ముడిపడింది. తెలంగాణలో లాక్​డౌన్​ ఎత్తేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్​లో ఇంకా కొనసాగుతోంది. అక్కడ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయనే విషయంలో స్పష్టత లేదు. తెలంగాణలో ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ ఇంకా ప్రదర్శనలు మొదలు కాలేదు. రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన పరిస్థితులు ఉంటేనే కొత్త సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకొస్తారు. మరి ఆ పరిస్థితులు ఎప్పుడొస్తాయనేది సందిగ్ధంగా మారింది. ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా యాభై శాతం ప్రేక్షకులతోనే ప్రదర్శనలు కొనసాగాలంటే పెద్ద సినిమాలకు చిక్కులే. కొవిడ్ మూడోదశ భయాందోళనల మధ్య థియేటర్లకు వస్తారో? లేదో అనే భయాలు ఎక్కువయ్యాయి. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకాలు నిర్మాతల్లో కనిపించడం లేదు. అదే జరిగితే అగ్ర తారల చిత్రాలకు చాలా నష్టం కలుగుతుంది. ఇలా పలు కారణాలతో నేరుగా ఓటీటీల్లో విడుదల చేయడమే మేలని భావిస్తున్నారు నిర్మాతలు.

మోస్ట్​ ఎలిజబుల్​ బ్యాచిలర్​

ఇదే సమయంలో ఓటీటీ వేదికలు మంచి ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. దీంతో గట్టెక్కడం మేలు కదా అనే లెక్కలతో నిర్మాతలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. జులై, ఆగస్టు మాసాల్లో పరిస్థితులు అనుకూలంగా కనిపించకపోతే మరికొన్ని చిత్రాలు ఓటీటీలో విడుదల కానున్నాయని తెలుస్తోంది. జీఏ2 నిర్మాణ సంస్థలో ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', '18 పేజీస్' చిత్రాలు రూపొందుతున్నాయి. 'రానున్న రెండు నెలల్లో పరిస్థితుల్ని బట్టి తమ చిత్రాలు విడుదల విషయంలో నిర్ణయం తీసుకుంటామ'ని నిర్మాత బన్నీ వాసు 'ఈనాడు సినిమా'తో తెలిపారు. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితులు కనిపించకపోతే ఓటీటీ వేదికల్లోనే విడుదల చేస్తామని ఆయన అన్నారు.

ఇదీ చూడండి: RGV: 'దావుద్​ కూతురు.. లాడెన్​ మనవరాలంటే ఇష్టం'

Last Updated : Jun 28, 2021, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details