ఎప్పుడూ సినిమా చిత్రీకరణలు, ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతుంటారు సినీ తారలు. కరోనా ప్రభావం వల్ల అందరూ కొన్నాళ్లుగా ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ విరామాన్ని గుర్తుండిపోయేలా మార్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. తమ పిల్లలతో కలిసి గడుపుతున్న ముచ్చటైన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ.. ఈ లాక్‌డౌన్ కాలంలో అందరూ తమ కుటుంబాలతో కలిసి సురక్షితంగా గడపండి అంటూ అభిమానులకు సందేశాలిస్తున్నారు.
సరదా సరదాగా గడుపుతోన్న సినీ తారలు - raviteja with his family
సినిమా షూటింగ్లతో ఎప్పుడూ బిజీగా ఉండే సినీ తారలు లాక్‌డౌన్ సమయాన్ని అందిపుచ్చుకుంటున్నారు. వారి వారి కుటుంబాలతో సరదాగా గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు.
కథానాయకులు మహేశ్ బాబు, రవితేజ ఈ నిర్బంధ కాలంలో తమ పిల్లలతో ఉల్లాసంగా గడుపుతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. మహేశ్ తన ముద్దుల తనయ సితారతో కలిసి సరదాగా అల్లరి చేస్తున్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటూ "ఈ క్వారంటైన్ రాత్రులు అందిస్తున్న మరపురాని క్షణాలివి" అని సంతోషం వ్యక్తం చేశారు. రవితేజ తన ఇద్దరు పిల్లలు మహాధన్, మోక్షదలతో కలిసి ఆనందంగా గడుపుతున్న చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "ఈ క్వారంటైన్ సమయంలో రోజూ ఆదివారం లాగే ఉంది" అంటూ ఈ చిత్రానికి తనదైన శైలిలో ఓ సరదా వ్యాఖ్యనూ జోడించారు రవితేజ.