తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమా విశేషాలతో పాటు, ఆ రోజుల్లో జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నాటి అందాల కథానాయిక ముచ్చర్ల అరుణ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
"1980లో ఇండస్రీ సిస్టర్స్, సినిమా సిస్టర్స్ అని కొంతమందిని పిలుస్తుండేవాళ్లం. వారిలో వరలక్ష్మి, పూర్ణిమ, ముచ్చర్ల అరుణ, జ్యోతి, లతాశ్రీ, మధురిమ ఇలా ఐదారుగురు ఉండేవారు. మేం అప్పట్లో 15, 20 సినిమాలకు కథలు రాస్తుండేవాళ్లం. ఏ సినిమాలో ఎవరు చెల్లెలుగా నటిస్తే బాగుంటుంది? అని అనుకుని ఆ పాత్రను రాసేవాళ్లం. అలా బాలయ్య చిత్రాల్లో మధురిమ చెల్లెలు పాత్రలు వేసేది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదటిసారి 'బొబ్బిలి బ్రహ్మన్న'లో ముచ్చర్ల అరుణ - కృష్ణంరాజు చెల్లెలిగా నటించింది. మాతో ఆమె ఎన్నో సినిమాలు చేసింది. అప్పట్లో నేను చాలా సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించా. ముఖ్యంగా 'భారతంలో అర్జునుడు'లో అరుణ దివ్యాంగురాలు. అయినా సరే ఆమెను పాడు చేసేందుకు ప్రయత్నిస్తే, నా నుంచి తప్పించుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ సన్నివేశంలో మా అన్నయ్య 'ఎందుకురా ఫీలవుతున్నావు. నీకు మానభంగాలు చేయడం కొత్తా? లేక మర్డర్లు చేయడం కొత్తా?' అని డైలాగ్ చెబుతాడు. అప్పుడు నేను 'ఏమీ చేయకుండానే చనిపోయిందని బాధగా ఉంది' అని సమాధానం ఇస్తా. థియేటర్‌లో ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఒకటే ఈలలు, గోలలు. దాంతో ఈతరం బాబూరావు' అన్నా మీకు దండం పెడతా. మీరు విలన్ పాత్రలు వేయకండి. మీ ఇమేజ్ మారిపోయింది" అన్నారు. ఇక అప్పటి నుంచి విలన్ వేషాలు వేయడం తగ్గించేశాను. ఒక రకంగా చెప్పాలంటే నేను విలన్ వేషాలు వేయకుండా ఉండటానికి ఆ సినిమా, ముచ్చర్ల అరుణే కారణం. వాటి తర్వాత రెండు మూడు చిత్రాలు చేశా. ఎన్టీఆర్ సినిమాలో కామెడీ విలన్‌గానూ చేశా. 'శశిరేఖా పరిణయం' చిత్రంలోనూ హాస్య ప్రతినాయకుడిగా చేశా. చాలా మంచి పేరొచ్చింది"