OTT Cinemas: ఈ వారం విడుదలయ్యే సినిమాలివే - ఆహాలో పొగరు
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి సాధారణ స్థితికి వస్తోంది. అన్ని చిత్ర పరిశ్రమల్లో షూటింగ్‌లూ మొదలయ్యాయి. ముంబయిలో థియేటర్లకు అనుమతి ఇచ్చినా, ప్రస్తుతం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లను తెరిచేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో సినీ ప్రియులు ఇంకొన్ని రోజులు ఓటీటీల్లో వచ్చే సినిమాలను ఆస్వాదించక తప్పదు. మరి ఈ వీక్‌లో ఏ ఓటీటీల్లో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయో తెలుసుకుందామా.
OTT Cinemas: ఈ వారం విడుదలయ్యే సినిమాలివే
By
Published : Jun 28, 2021, 10:01 PM IST
థియేటర్ల అనిశ్చితి ఇంకా కొనసాగుతుండటం వల్ల కొన్ని సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. భారీ చిత్రాలూ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి డిజిటల్ వేదికలను ఎంచుకుంటున్నాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ చిత్రాలు.. అవి విడుదలయ్యే డిజిటల్ వేదికలేంటో చూద్దాం!
కోల్డ్ కేస్ (అమెజాన్ ప్రైమ్)
'కోల్డ్ కేస్' సినిమా పోస్టర్
కరోనా కారణంగా ఓటీటీ బాట పట్టిన సినిమా 'కోల్డ్ కేస్'. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ నటిస్తున్న చిత్రమిది. 'అరువి' ఫేమ్ అదిత్ బాలన్ ముఖ్యపాత్రలో నటిస్తోంది. తను బాలక్ దర్శకుడు. 'మెమొరిస్', 'పోలీస్ పోలీస్', 'సెవన్త్ డే', 'రావణ్' సినిమాల్లో పోలీసుగా అదిరిపోయేలా నటించిన పృథ్వీరాజ్ మరోసారి ఈ సినిమా కోసం ఖాకీ చొక్కా తొడిగాడు. ఓ మర్డర్ కేసును పరిష్కరించే పోలీసు ఆఫీసర్ సత్యజిత్గా ఇందులో ఆయన కనిపించనున్నాడు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 30న విడుదల కానుంది.
హసీన్ దిల్‌రూబా (నెట్‌ఫ్లిక్స్)
'హసీన్ దిల్‌రూబా' సినిమా పోస్టర్
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో జోరుమీదుంది తాప్సీ. మరోసారి అలాంటి చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. కరోనా కారణంగా విడుదల ఆలస్యమవుతూ వచ్చిన 'హసీన్ దిల్‌రూబా' చివరకు ఓటీటీ బాట పట్టింది. జులై 2న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతోంది. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తాప్సీకి జోడిగా విక్రాంత్ మాస్సే నటిస్తున్నాడు. ఇందులో తెలుగు నటుడు హర్షవర్ధన్ రాణె కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. వినీల్ మాథ్యూ దర్శకుడు. మునుపెన్నడు కనిపించని విధంగా ఇందులో కొత్తగా కనిపిస్తోంది తాప్సీ. సస్పెన్స్, యాక్షన్ కలగలిసిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే జులై 2న చూసి తెలుసుకోవాల్సిందే.
పొగరు (ఆహా)
'పొగరు' సినిమా ఓటీటీ రిలీజ్ పోస్టర్
'కేజీయఫ్' చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించిన నాటి నుంచి కన్నడ హీరోలు తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కన్నడ సినిమాలు 'యువరత్న', 'రాబర్ట్', 'పొగరు' తెలుగులోకి అనువాదాలుగా ఈ ఏడాదే విడులయ్యాయి. వీటిలో ధ్రువ్ సార్జా నటించిన 'పొగరు' ఆకట్టుకుంది. అయితే, ఎక్కువ థియేటర్‌లలో విడుదలకాకపోవడం, కరోనా పరిస్థితులు కారణంగా పెద్దగా టాక్ తెచ్చుకోలేదు. ఇప్పుడీ చిత్రం డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జులై 2న తెలుగు ఓటీటీ 'ఆహా' వేదికగా విడుదలవుతోంది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది.
లోకి :తెలుగు(డిస్నీ హాట్ స్టార్)
'లోకి' వెబ్‌సిరీస్
ఇప్పటికే ఇంగ్లీష్‌లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్ 'లోకి: ది మిస్చీఫ్'. మార్వెల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగులో కాస్త ఆలస్యంగా జూన్ 30న విడుదల కాబోతుంది. ఇంగ్లీష్ వెర్షన్‌లో ఇప్పటివరకు మూడు ఎపిసోడ్లు విడుదలయ్యాయి. నాలుగో ఎపిసోడ్ జూన్ 30న విడుదలవుతోంది. అదే రోజున తెలుగు, తమిళం భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'లోకి' అలరించేందుకు సిద్ధమైంది.
ఈ వారంలో రానున్న మరికొన్ని చిత్రాలు
'30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా రిలీజ్ పోస్టర్