ఒకప్పుడు రచయితలు కథను అందిస్తే వాటి ఆధారంగా దర్శకులు సినిమాను తెరకెక్కించేవారు. తర్వాత కాలంలో దర్శకులే కథలు, మాటలు రాస్తూ వచ్చారు. ఇప్పటికీ కథలు అందించే వారున్నా సొంతంగా రాసుకుంటున్న దర్శకులే ఎక్కువ. ఇప్పుడు తరం మారింది. కొందరు అగ్ర దర్శకులు పెద్ద హీరోలతో పనిచేస్తూనే వారు చెప్పాలనుకుని, భారీ స్థాయిలో చేయలేని కథలను చిన్న సినిమాలుగా అందిస్తున్నారు. కథలు తాము రాసి.. వేరే యువ దర్శకులకు సినిమా తెరకెక్కించే బాధ్యతను అప్పగిస్తున్నారు. అవసరమైతే స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
సుక్కు మార్క్ లెక్క
సుకుమార్ సినిమాల శైలే వేరుగా ఉంటుంది. అందుకే పరిశ్రమలో సుక్కు లేక్కే వేరు అంటుంటారు. ఆయన కథలు ఓ పజిల్‌లా మనల్ని ఆలోచింపచేసేలా సాగుతుంటాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇలా అగ్రనటులతో భారీ హంగులతో సినిమాలు తీస్తుంటారు. అలాంటి ఆయన కొన్ని కథలను తమ శిష్యులకు అప్పగించి తెరకెక్కిస్తుంటారు. స్వతంత్ర భావాలున్న ఈ తరం అమ్మాయి కథతో కుమారి 21ఎఫ్‌ను అలాగే అందించారు. దానికి కథ, స్క్రీన్‌ప్లే రాసి, నిర్మాణ బాధ్యతలూ తీసుకున్నారు.. రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సూర్యప్రతాప్ తెరకెక్కించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం తోడవడం వల్ల ఆ ఏడాది ఈ చిత్రం విజయాన్ని సాధించింది. అలా సినిమాలు తెరకెక్కించడంలోనే కాదు, సినిమాలు నిర్మించడంలోనూ పర్ఫెక్షనిస్టుని అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో పుష్ప తెరకెక్కిస్తున్న సుకుమార్, తన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఉప్పెన సినిమా నిర్మాణ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పంచుకున్నారు. అలాగే కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న 18పేజెస్‌ను నిర్మిస్తున్నారు. నిఖిల్, అనుపమపరమేశ్వరన్ నాయక, నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సుకుమారే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.
త్రివిక్రమ్... కథా ప్రపంచం
అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ తొలుత మంచి కథకుడు. స్వయంవరం, నువ్వునాకు నచ్చావ్, జైచిరంజీవ చిత్రాలకు కథ, మాటలు అందించి తన కలం బలం ఏమిటో తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. లోతైన భావాలతో, ఆకట్టుకునే ప్రాసలతో అలరించే త్రివిక్రమ్ తర్వాత కాలంలో దర్శకుడిగా మారారు. అగ్ర కథానాయకులతో చిత్రాలు చేస్తూనే అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు కథలు, మాటలు అందిస్తుంటారు. తన స్నేహితుడు సునీల్ హీరోగా నటించిన అందాలరాముడుకు కథ, మాటలు రాశారు. అలాగే పవన్‌కల్యాణ్ తీన్మార్ చిత్రానికి మాటలు అందించారు. నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్‌రంగా చిత్రానికి కథ త్రివిక్రమే. ఈ సినిమాకు దర్శకుడు కృష్ణ చైతన్య.
మాటలు పూరిస్తూ...