సహజమైన అందానికి, అభినయానికి చిరునామా సాయిపల్లవి. తెరపై ఆమె కనిపించే విధానం చూస్తుంటే మన ఇంట్లో మనిషినో.. పక్కింటి పిల్లనో చూస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఆమె తొలి చిత్రం 'ప్రేమమ్' నుంచి ఆ మధ్య వచ్చిన 'పడిపడి లేచే మనసు' వరకు ప్రతి చిత్రంలోనూ ఈ తరహా సహజత్వం నిండిన పాత్రలతోనే అలరించింది.
'ఫిదా'తో
తెలుగులో ఆమె తొలి సినిమా 'ఫిదా' అయితే మరింత ప్రత్యేకం. తనకది తొలి చిత్రమే అయినప్పటికీ తెలంగాణ గడుసు పిల్లలా కనబర్చిన హావభావాలు, తెలంగాణ యాసలో పలికిన సంభాషణలు సినీప్రియుల మదిలో చెరగని ముద్ర వేశాయి. ఇటీవలే సాయిపల్లవి.. 'ఫిదా' గురించి మాట్లాడుతూ అందులోని ఓ సన్నివేశం గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తాను ట్రాక్టర్ నడిపిన సన్నివేశం తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన ఎపిసోడ్ అంది.