The Kashmir Files: చిన్న సినిమాగా మొదలై సంచలనంగా మారిన 'ది కశ్మీర్ ఫైల్స్' గురించి బాలీవుడ్ నుంచి స్పందన లేకపోవడంపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. అది అంత ముఖ్యం కాదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ అంశం గురించి తన వద్ద చాలా సమాచారం ఉందని, త్వరలోనే దీనిపై ఓ సిరీస్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించారు.
"భారత్ మారుతోంది. పాత వ్యవస్థలు దిగివచ్చి, కుప్పకూలుతున్నాయి. సినిమాలోనూ అందుకు సంబంధించి ఓ సన్నివేశం ఉంది. 'అధికార పీఠంపై ఎవరున్నా.. వ్యవస్థ మాత్రం మాదే (నడిపించేది మేమే)' అని పల్లవి జోషీ చెప్పే ఓ డైలాగ్ ఉంది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి చివరి దశకు చేరుకుంది. ఎందుకంటే.. వాస్తవాలు, నిజాలు బయటకు వస్తున్నాయి. కశ్మీర్ ఫైల్స్ అనేది వాస్తవం. అది నిజమైన వ్యక్తులకు జరిగిన విషాదం. బాలీవుడ్ మాట్లాడకపోతేనేం? దీని గురించి ప్రజలు మాట్లాడుతున్నారు."
- వివేక్ అగ్నిహోత్రి, దర్శకుడు
కంగనా, అక్షయ్ ప్రశంసలు..
సినిమాలో పుష్కర్‌నాథ్ పండిట్‌గా నటించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా.. "బాలీవుడ్ అని కాదు.. ఇవి నిజమైన కథలు. దీని గురించి ఎవరు మాట్లాడినా, మాట్లాడకపోయినా ఫర్వాలేదు." అని అన్నారు. అయితే కంగనా రనౌత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు మధుర్ భండార్కర్ వంటివారు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.