Prabhas project K: సినీప్రియులకు సరికొత్త అనుభూతిని పంచిచ్చేందుకు కొత్త దర్శకులు వైవిధ్యభరిత కథలతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కాలాన్ని వెనక్కి తిప్పో.. లేదంటే భవిష్యత్తులోకి తీసుకెళ్లో కథలు చెప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఫలితంగా ఇప్పుడు తెలుగులో టైమ్ ట్రావెల్ కథల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' (వర్కింగ్ టైటిల్) కూడా ఈ తరహా కథాంశంతోనే రూపొందుతోంది. 'మహానటి' లాంటి భారీ విజయం తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాని ముస్తాబు చేస్తున్నట్లు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో సోషియో ఫాంటసీ అంశాలతో పాటు టైమ్ మిషన్ కాన్సెప్ట్ కూడా మిళితమై ఉంటుందని.. అందుకే ఈ స్క్రిప్ట్ విషయంలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు సహాయం తీసుకుంటున్నట్లు తెలిసింది. కథానాయకుడు టైమ్ మిషన్ ఎక్కి భవిష్యత్తులోకి వెళ్లడమే ఈ చిత్ర కథా నేపథ్యమని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా.. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరిత కథలతో ప్రయాణం చేస్తుంటారు యువ హీరో శర్వానంద్. ఇప్పుడాయన కూడా ప్రభాస్ బాటలోనే టైమ్ మిషన్ ఎక్కేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా శ్రీకార్తిక్ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఒకే ఒక జీవితం'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ సినిమాలో చిత్రమైన టైమ్ ట్రావెల్ సెటప్ ఉందని సమాచారం. ఇందులో శర్వా, తన స్నేహితులతో కలిసి చిన్ననాటి రోజుల్లోకి వెళ్తాడని తెలుస్తోంది. అంటే బాల్యంలోకి వెళ్లి తన తల్లితో గడిపిన జ్ఞాపకాల్ని, స్కూల్ డేస్‌ను, అప్పటి స్నేహాల్ని దగ్గర్నుంచి చూసుకునే ప్రయత్నం చేస్తారట. ఇదే ఈ చిత్ర కథా నేపథ్యమని సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో చిత్ర కథా నేపథ్యంపై స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. మరి ఈ టైమ్ ట్రావెల్ తెరపై ఎలా కనువిందు చేయనుందో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.
Kalyan ram bimbisara: నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం 'బింబిసార'. ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్..అనేది ఉపశీర్షిక. వశిష్ట్ తెరకెక్కిస్తున్నారు. కేథరిన్, సంయుక్త మేనన్ కథానాయికలు. ఓ వైవిధ్యభరితమైన టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న బింబిసారుడి కాలానికి, వర్తమానానికి మధ్య సాగే కథగా ఉంటుంది. ఈ కథకు తగ్గట్లుగానే కల్యాణ్ రామ్ ఇందులో బింబిసారుడిగా.. మోడ్రన్ యువకుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని కథలు వస్తున్నాయి..