పదిహేడు.. చాలా మంది ఈ నెంబర్ దురదృష్టానికి చిహ్నమని నమ్ముతారు. అయితే తెలుగు హీరోల్లో ఎక్కువ మందికి ఈ నెంబర్ బాగా కలిసొచ్చింది. ఎలాగంటే వీరు తీసిన సినిమాల్లో 17వ చిత్రం మాత్రం సూపర్ డూపర్ హిట్ అందుకుంది. పవన్ కల్యాణ్ మొదలుకుని ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ అందుకున్న రామ్ వరకు ఈ జాబితాలో ఉన్నారు. మరి ఎవరెవరు ఈ కోవలో ఉన్నారో ఓ లుక్కేద్దామా!
పవన్‌కల్యాణ్.. గబ్బర్‌సింగ్
అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఆరంభంలో వరుసగా హిట్లు పలకరించాయి. అనంతరం పదేళ్ల వరకు సరైన విజయం లేక డీలాపడ్డాడు. ఇలాంటి తరుణంలో గబ్బర్‌సింగ్ లాంటి విజయం అందుకుని ఫామ్‌లోకి వచ్చాడు పవర్ స్టార్. అన్నట్టు ఈ చిత్రం పవన్‌కల్యాణ్‌కు 17వ చిత్రం కావడం విశేషం.
మహేశ్‌బాబు వసూళ్ల బిజినెస్..
మహేశ్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి బిజినెస్‌మ్యాన్. దూకుడు విజయం తర్వాత చేసిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి ప్రేక్షకులను అలరించింది. సంభాషణలు, మహేశ్ నటనతో సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. రాజకుమారుడితో హీరోగా అరంగేట్రం చేసిన ప్రిన్స్‌కు బిజినెస్ మ్యాన్ 17వ చిత్రం.
తారకరాముడి అదుర్స్..
చిత్రసీమలో వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరో హోదా పొంది తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి, యమదొంగ లాంటి విజయాలు అందుకున్నాడు. తర్వాత కొన్ని పరాజయాలు పలకరించినా అదుర్స్ చిత్రంలో ద్విపాత్రభినయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అప్పటి వరకు ఏ స్టార్ హీరో చేయని పాత్రలో మెరిశాడు తారక్. తన కామెడీ టైమింగ్‌తో సినిమా బంపర్ హిట్టైంది.