అందాల కథానాయికలు.. శక్తిమంతమైన ప్రతినాయికలుగా మెప్పించడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు అగ్రనాయికగా జోరు చూపిన రమ్యకృష్ణ.. 'నరసింహా' చిత్రంలో రజనీకాంత్‌కు సవాల్ విసిరే ప్రతినాయికగా నీలాంబరి పాత్రలో మెప్పించారు. సంప్రదాయబద్ధమైన పాత్రలతో అలరించిన రాశి 'నిజం'లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో గోపీచంద్‌కు జోడీగా మురిపించించారు.
ఈతరంలోనూ వరలక్ష్మీ శరత్‌కుమార్, రెజీనా, రీతూ వర్మ, పాయల్ రాజ్‌పుత్, కాజల్ లాంటి వారంతా లేడీ విలన్లుగా మారి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న వారే. ముఖ్యంగా ఇటీవల కాలంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, రెజీనా ప్రతినాయిక పాత్రలకు చిరునామాగా మారారు. ఇప్పుడీ పంథాలోనే మరికొందరు ముద్దుగుమ్మలు లేడీ విలన్లుగా భయపెట్టేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నారు.
భయపెట్టనున్న కీర్తి
కెరీర్ తొలినాళ్ల నుంచీ నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనే మెప్పిస్తూ వస్తోంది నటి కీర్తి సురేశ్. 'మహానటి'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నాయిక.. ఇప్పుడు విలక్షణమైన పాత్రలతో ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తమిళంలో 'సాని కాయిధం' అనే చిత్రానికి పచ్చజెండా ఊపింది. దీంట్లో దర్శకుడు సెల్వరాఘవన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకుడు.
ఓ విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో.. కీర్తి ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లో ఆమె కనిపించిన విధానం ఆసక్తిరేకెత్తించింది. ఆ పోస్టర్‌లో ఆమె రక్తంతో తడిసిన అవతారంలో.. ఎదురుగా పదునైన మారణాయుధాలు పెట్టుకోని దర్శనమిచ్చింది.
తమన్నా తొలిసారి..
స్టార్ కథానాయిక స్థాయిని ఎప్పుడో అధిగమించింది తమన్నా. అందుకే ఇప్పుడు పాత్రల ఎంపికలో వైవిధ్యత కనబరుస్తోంది. ఈ క్రమంలోనే లేడీ విలన్‌గా భయపెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె నితిన్‌తో కలిసి 'మ్యాస్ట్రో' చిత్రం చేస్తోంది. బాలీవుడ్‌లో విజయవంతమైన 'అంధాధున్'కి రీమేక్‌గా రూపొందుతోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు.