Telugu dubbed movies: తమిళ సినిమా 'మానాడు'.. తెలుగు రీమేక్, డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవల ప్రకటించింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అల్రెడీ తెలుగులో డబ్బింగ్ అయినా సినిమాను మళ్లీ తెలుగులో రీమేక్ చేయడమేంటని షాకయ్యారు.
అయితే ఇలా జరగడం ఇదేం కొత్త కాదు. స్టార్ హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా ఇలానే కొన్ని సినిమాలు తీశారు, తీస్తున్నారు. అవునా అని మీరు షాకవ్వొద్దు. ఆ సినిమాలేంటనేది మీరు ఓ లుక్కేయండి
కాటమరాయుడు-వీరుడొక్కడే
అజిత్- శివ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా 'వీరమ్'. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను 'వీరుడొక్కడే' పేరుతో 2014లో తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఇదే చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి, తెలుగులో పవన్‌కల్యాణ్ 'కాటమరాయుడు' టైటిల్‌తో మళ్లీ తీశారు. ఇలా తెలుగులో డబ్ అయిన సినిమాను టాలీవుడ్లో ఓ స్టార్ హీరో మళ్లీ తెలుగులోనే రీమేక్ చేయడం బహుశా ఇదే తొలిసారి!
గాడ్‌ఫాదర్-లూసిఫర్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన పొలిటికల్ డ్రామా 'లూసిఫర్'. 2019లో వచ్చిన ఈ సినిమాతో హీరో పృథ్వీరాజ్, దర్శకుడిగా తొలి హిట్ అందుకున్నారు. దీనిని తెలుగులోనూ 'లూసిఫర్' పేరుతో థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఇదే సినిమాను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ఫాదర్' పేరుతో తీస్తుండటం విశేషం. కథలో మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతుంది.
ఖైదీ నం.150-కత్తి, భోళా శంకర్-ఆవేశం
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నం.150'. ఇది విజయ్ 'కత్తి' అనే తమిళ చిత్రానికి రీమేక్. తొలుత 'కత్తి' సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగులో రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ రీమేక్ హక్కుల్ని తీసుకునేసరికి.. డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయలేదు.
ప్రస్తుతం చిరంజీవి-మెహర్ రమేశ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'భోళా శంకర్'.. తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్. అయితే 'వేదాళం'ను 2015 దసరా సందర్భంగా తమిళంతో పాటు తెలుగులో 'ఆవేశం' పేరుతో ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మన దగ్గర ఆ సమయంలో ఎక్కువ చిత్రాల రిలీజ్లు ఉండేసరికి అది కాస్త వాయిదా పడింది. ఆ తర్వాత తెలుగు రీమేక్ రైట్స్‌ను ఓ నిర్మాత కొనేసరికి, తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాకుండా ఆగిపోయింది.
వీటితోపాటే సిద్ధార్థ్ తమిళ సినిమా 'జిగర్తాండ', 'చిక్కడు దొరకడు' పేరుతో తెలుగులో రిలీజైంది. అదే చిత్రాన్ని వరుణ్‌తేజ్‌తో 'వాల్మీకి' పేరుతో తెరకెక్కించారు. టైటిల్ విషయంలో వివాదం వచ్చేసరికి దానిని కాస్త 'గద్దలకొండ గణేష్'గా మార్చి రిలీజ్ చేశారు. అలానే కన్నడ సూపర్‌హిట్ 'దియా' చిత్రాన్ని, గతేడాది అదే పేరుతో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. విచిత్రమేమిటంటే సరిగ్గా అది విడుదలైన 15 రోజుల తర్వాత దాని తెలుగు రీమేక్ 'డియర్ మేఘ' థియేటర్లలోకి వచ్చింది. డబ్బింగ్ వెర్షన్ చూసిన చాలామంది ఆడియెన్స్.. రీమేక్ సినిమాపై ఆసక్తి చూపలేదు.
వేరే భాషలో రీమేక్.. మళ్లీ తెలుగులో రిలీజ్
తెలుగులో హిట్ అయినా కొన్ని సినిమాల్ని వేరే భాషల్లో రీమేక్ చేయడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అయితే ఆ సినిమాలను మళ్లీ డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేసినా సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నే ఇవి.
ఎన్టీఆర్ 'టెంపర్'ను తమిళంలో 'అయోగ్య'గా రీమేక్ చేశారు. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మళ్లీ తెలుగులో 'అయోగ్య' పేరుతో రిలీజ్ చేశారు.
నాగార్జున 'మన్మథుడు' సినిమాను కన్నడలో 'ఐశ్వర్య' పేరుతో రీమేక్ చేశారు. దీపికా పదుకొణెకు ఇదే తొలి చిత్రం. దీనినే మళ్లీ తెలుగులో 'కంత్రీ మొగుడు' పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.
నాగచైతన్య-సమంతల 'ఏ మాయ చేసావె' సినిమా గౌతమ్ మేనన్ తీసిన బెస్ట్ మూవీస్‌లో ఒకటి. తెలుగు, తమిళంలో దీని షూటింగ్ ఒకే టైమ్‌లో జరిగింది. తమిళంలో శింబు-త్రిషలతో 'విన్నైతాండ వరువాయ'గా రిలీజ్ చేశారు. మళ్లీ దానిని తెలుగులో 'ఎందుకిలా చేసావె' పేరుతో డబ్బింగ్ చేశారు.
ఏ మాయ చేసావె-ఎందుకిలా చేసావె సల్మాన్‌ఖాన్ 'దబంగ్'ను తెలుగులో 'గబ్బర్‌సింగ్'గా రీమేక్ చేస్తే, తమిళంలో 'ఒస్తే' పేరుతో తెరకెక్కించారు. తమిళ సినిమాను తెలుగులో మళ్లీ 'తిమ్మిరి' టైటిల్‌తో రిలీజ్ చేశారు.
తాప్సీ ప్రధాన పాత్రలో తీసిన హారర్ చిత్రం 'ఆనందో బ్రహ్మ'. ఇదే సినిమాను తమిళంలో 'పెట్రోమాక్స్' పేరుతో రీమేక్ చేశారు. మళ్లీ అదే టైటిల్‌తో తెలుగులోనూ రిలీజ్ చేయడం విశేషం.