తొలి సినిమా 'ఝుమ్మంది నాదం'తో కుర్రాళ్ల మనసుల్ని కట్టిపడేసింది... తరువాత వరుసగా అగ్ర కథానాయకులతో నటించి మెప్పించింది... ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ బిజీగా మారిన నటి 'తాప్సీ పన్ను'. ఇప్పుడు మరోసారి 'గేమ్ ఓవర్' అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విషయాలతో పాటు మరికొన్ని విశేషాలు తాప్సీ మాటల్లోనే...
ప్ర: గేమ్ ఓవర్ సినిమా కథ ఏంటి? ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం?
జ: మొట్టమొదటి సారి భారతీయ సినిమాలో ఇలాంటి కథ నేను విన్నాను. అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న సినిమా ఇది. నా పాత్రతో పాటు కథ, కథనం కూడా నాకు బాగా నచ్చాయి. ఇది ఒక ప్రాంతీయ సినిమాలా ఉండదు. ట్రైలర్ చూసిన వారంతా ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదల అవ్వాలి అంటున్నారు.
ప్ర: ఈ సినిమాలో చక్రాల కుర్చీలో కూర్చొని నటించారు కదా ఎలా ఉంది..?
జ: అవునండీ.. నా జీవితంలో ఇప్పటివరకూ ఎలాంటి ఫ్రాక్చర్ జరగలేదు.. రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయి వీల్ ఛైర్ లో కూర్చోవడం.. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి అనుభవం లేదు.
ప్ర: చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
జ: షూటింగ్ లో చాలా భాగం నేను వీల్ ఛైర్ లోనే ఉంటాను. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా డిమాండ్ ఉన్న రోల్ ఇది. ప్రమాదం జరిగిన ఒక సంవత్సరానికి.. మళ్లీ యానివర్సిరీ రియాక్షన్ మొదలయ్యే ఒక ట్రోమా సమస్యతో బాధపడే పాత్ర. ఆ యాక్సిడెంట్ ఏంటో మీరు సినిమాలో చూడాల్సిందే.
ప్ర: ఏ భాషలో అయినా సినిమాను మీ భుజాలపై వేసుకుంటున్నారు.. ఎలా మోస్తున్నారు? అది ఆత్మవిశ్వాసం అనుకోవచ్చా..?
జ: (నవ్వుతూ) నిజానికి వేరే దారి దొరకలేదు. ఇలాంటి కథలే దొరికాయి కాబట్టి.. నేనే నా భుజాలపై మోయాల్సి వస్తుంది. నాకూ ఈ కథలు నచ్చాయి. మా దర్శకులు కూడా చాలా తెలివైనవాళ్లు.. వాళ్లే నాకు హీరోలు.