Rajinikanth age: ఆయన చిన్న మేనరిజం చేస్తే చాలు.. థియేటర్ మొత్తం ఈలలు, గోలులు. ఆరడుగుల అందగాడు కాదు.. అలా అని సిక్స్‌ప్యాక్ కూడా లేదు.. డ్యాన్సులు కూడా సాధారణంగానే ఉంటాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన లెక్కలేనంతమంది. ఆయనే సూపర్‌స్టార్ రజనీకాంత్. డిసెంబరు 12న పుట్టినరోజు సందర్భంగా తలైవ జీవిత విశేషాలు మీకోసం.
*రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో పుట్టారు.
*కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేసిన ఈయన.. నటనపై అమితమైన ఇష్టంతో చెన్నైకి వెళ్లారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సు చేరారు.
*ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ 'అపూర్వ రాగంగల్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు.
*'అంతులేని కథ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు బాలచందరే దర్శకత్వం వహించారు.
*ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
*1977లో రజనీ 15 సినిమాలు చేస్తే అందులో ఎక్కువశాతం ప్రతినాయక లక్షణాలున్న పాత్రలే కావడం విశేషం.