దర్శకధీరుడు రాజమౌళి- సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం మనందరికీ తెలుసు. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా రానుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జక్కన్నతో కలిసి పనిచేయడం గురించి మహేశ్ స్పందించారు.
'మా ఇద్దరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ వస్తే చూడాలని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మా సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఇప్పుడే దాని గురించి ఏం బయటపెట్టలేను. ఈ సినిమా నాకెంతో స్పెషల్. ఇది మరో బాహుబలి మాత్రం కాదు' అని ఆయన అన్నారు.
సంక్రాంతి కానుకగా..
'సర్కారు వారి పాట' రిలీజ్ గురించి ఆయన స్పందిస్తూ.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న థియేటర్లలోనే విడుదల చేయనున్నాం. ఆ విషయంలో నేనెంతో నమ్మకంగా ఉన్నాను. ఓటీటీ మీద నాకు గౌరవం ఉంది. అది వేరే తరహా మాధ్యమం. వెండితెర కోసమే నా సినిమాలు సిద్ధమవుతున్నాయి. అలాగే, థియేటర్ల వేదికగా నా ఫ్యాన్స్‌ని నేను కలవగలను' అని మహేశ్ వివరించారు.
ఎక్కువ సమయం వారితోనే ..
కరోనా వల్ల వచ్చిన బ్రేక్‌తో తన తండ్రి, భార్యాపిల్లలతో ఎక్కువగా సమయం గడపడానికి అవకాశం లభించిందని ఆయన తెలిపారు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ తిరిగి ప్రారంభమవుతున్నాయని.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సెట్లోకి అడుగుపెడుతున్నామని వివరించారు. కరోనా వేళ అధికారుల సూచనలు తప్పకుండా అందరూ పాటించాలని మహేశ్ కోరారు.