సంక్రాంతికి వినోదాలు పంచడం మహేష్‌కి కొత్త కాదు. ఈసారి 'సరిలేరు నీకెవ్వరు' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. క్లాస్ మాస్ తేడా లేకుండా అందరికీ వినోదం పంచుతున్నాడు. ఈ సినిమా విజయోత్సవం సందర్బంగా కొన్ని విషయాలు వెల్లడించాడు.
సంక్రాంతి పండగ సంబరాలు మీ ఇంట్లో ఎలా ఉంటాయి?
సంక్రాంతి పండగ నాకు చాలా ప్రత్యేకం. చిన్నప్పుడు నాన్న మా సొంతూరు బుర్రిపాలెం తీసుకెళ్లేవారు. అక్కడ గడిపిన రోజులు ఇప్పటికీ గుర్తే. ఆ తర్వాత సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది సినిమానే. నాన్నగారి సినిమా ఏదో ఒకటి విడుదలయ్యేది. నేను హీరో అయ్యాక నా సినిమాల్లో 'ఒక్కడు', 'బిజినెస్ మేన్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతికి విడుదలయ్యాయి. ఈ సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా పండగ జనవరి 11నే మొదలైంది. మా చిత్రబృందం మామూలు జోష్‌లో లేదు.
"తెలుగు చిత్ర పరిశ్రమ బంగారం. దాని పరిధి పెరుగుతూనే ఉంటుంది. మా వ్యాపారం, మా ఇమేజ్ కంటే ప్రేక్షకుడికి ఎక్కువ ఆనందాన్నివ్వడం ముఖ్యం"
ఇలాంటి సినిమానే ఎందుకు చేయాలనుకున్నారు?
నాలుగేళ్లు వరుసగా కథా బలమున్న చిత్రాలు చేశా. మాకు 'దూకుడు' లాంటి సినిమా కావాలని అభిమానులు చెబుతూనే వస్తున్నారు. అనిల్ రావిపూడి 'సరిలేరు..' కథ చెప్పాక వారు కోరుకుంటున్నది ఇదే అనిపించింది. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు మరిన్ని చేస్తా. వ్యక్తిగతంగా నాకూ ఓ కొత్త ఉత్సాహాన్నిచ్చిందీ చిత్రం.
'నాన్నా మళ్లీ చూస్తా అనగానే గర్వంగా ఫీలయ్యా' సినిమాని మీరు మీ పిల్లలతో కలిసి చూస్తారట కదా. మరి ఈ సినిమా చూశాక వాళ్ల స్పందనేంటి?
విడుదల రోజునే పిల్లలతో కలిసి ఇంట్లోనే చూస్తాం. ఈసారి కొత్త హోమ్ థియేటర్ కట్టుకున్నా. అందులో సినిమా చూస్తూ ఎంత ఆస్వాదించామో. తొలిసారి గౌతమ్ 'నాన్నా మళ్లీ చూడాలనుంది' అన్నాడు. రెండోసారీ చూశాడు. అది నేను సాధించిన ఒక గొప్ప లక్ష్యం అని గర్వంగా భావిస్తున్నా. మా నాన్నగారు సినిమా చూసి నీ కెరీర్‌లోనే పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని, దర్శకుడిని కలవాలని ఉందని చెప్పారు. ఎంతో ఆనందిస్తే తప్ప ఆయన అలా అనరు.
" గౌతమ్, సితార ఇంట్లో చేసే సందడి చూస్తే చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తుంటాయి. అదే సమయంలో చాలా తొందరగా పెద్దోళ్లు అయిపోతున్నారే అనిపిస్తుంటుంది. ఈ తరం పిల్లల్లో వేగం ఎక్కువ. గౌతమ్ 13 ఏళ్లకే పెద్ద పెద్ద మాటలు చెబుతుంటాడు. సినిమాల గురించి అన్ని విషయాలూ అడుగుతున్నాడు. మంచి స్క్రిప్టు దొరికితే తప్పకుండా నటిస్తాడు"
సరిలేరు మీకెవ్వరు అని ఎవరిని చూసినప్పుడు మీకనిపించింది?
నాన్న విషయంలో రోజూ అలాగే అనిపించేది. స్టార్‌గా ఏ స్థాయికి చేరుకున్నా... ఇంటికొచ్చాక అవన్నీ పక్కనపెట్టి మాతో గడిపేవారు. ఇప్పుడు నేనూ ఆయన బాటలోనే వెళుతున్నా. ఇమేజ్, బ్లాక్‌బస్టర్.. ఇవన్నీ మరిచిపోయి గౌతమ్, సితారలకి తండ్రిగా, నమ్రతకి భర్తగా గడుపుతుంటా.
ఈ సినిమా విజయోత్సవాన్ని కాస్త విభిన్నంగా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగా అభిమానులు ట్విట్టర్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ప్రిన్స్ చేత సమాధానాలు ఇచ్చేలా కార్యక్రమం ఏర్పాటు చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశ్నలు అడగ్గా.. మహేశ్ తనదైన రీతిలో జవాబులిచ్చాడు.